కేఎల్ రాహుల్
KL Rahul- ICC ODI World Cup 2023: టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గత కొంతకాలంగా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. టీ20 ప్రపంచకప్-2022 సహా ఇటీవల ముగిసిన బంగ్లాదేశ్‌తో సిరీస్‌లలోనూ ఆకట్టుకోలేకపోయాడు. తొలి వన్డేలో సీనియర్ జోడి రోహిత్ శర్మ- శిఖర్ ధావన్ ఓపెనింగ్ చేయగా.. రాహుల్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు.
ఈ మ్యాచ్‌లో 73 పరుగులతో టీమిండియా టాప్ స్కోరర్‌గా నిలిచిన ఈ కర్ణాటక బ్యాటర్.. ఆ తర్వాతి రెండు వన్డే(14, 8)ల్లో మాత్రం విఫలమయ్యాడు. ముఖ్యంగా మూడో మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో చెలరేగగా.. రాహుల్ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యాడు.
రాణిస్తున్న యువ ఓపెనర్లు
ఇక టెస్టు సిరీస్‌లో కెప్టెన్‌గా విజయవంతమైన రాహుల్ బ్యాటర్‌గా మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. కాగా బంగ్లాతో వన్డే సిరీస్‌లో రాహుల్‌ను ఐదో స్థానంలో పంపారు. అదే సమయంలో.. ఓపెనర్‌గా ఇషాన్ చెలరేగాడు. ఓపెనింగ్ స్థానాన్ని సుస్థిరం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. మరో యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ సైతం తనకు వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుంటున్నాడు.
రాహుల్ స్థానానికి ఎసరు
ఇదిలా ఉంటే.. టీ20 స్పెషలిస్టు సూర్యకుమార్ యాదవ్ వన్డేలోనూ రాణించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇంకో వైపు.. రవీంద్ర జడేజా తిరిగివచ్చి సత్తా చాటాలని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వైస్ కెప్టెన్సీ కోల్పోయిన రాహుల్ ఆటగాడిగా ఓపెనింగ్, మిడిలార్డర్ స్థానాల్లో కూడాచోటు కోల్పోయే ప్రమాదం ఉంది. దీంతో ప్రపంచకప్ తుదిజట్టులో ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌కు చోటు దక్కడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ మాజీ కోచ్ సంజయ్ బంగర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఈ ఏడాది స్వదేశంలో వన్డే వరల్డ్‌కప్ జరుగనున్న నేపథ్యంలో రాహుల్ అవకాశాల గురించి అతడు మాట్లాడుతూ.. ‘‘ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా రాణిస్తున్న తరుణంలో టాపార్డర్‌లో కేఎల్ రాహుల్ స్థానం ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది.
తుదిజట్టులో చోటు కోసం అతడు ఇషాన్‌తో పోటీ పడాల్సి ఉంటుంది. నా అభిప్రాయం ప్రకారం వన్డేల్లో ఇక రాహుల్‌కు అవకాశాలు రావడం కష్టమే అనిపిస్తోంది’’ అని ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫోతో పేర్కొన్నాడు. ప్రపంచకప్ జట్టులో అతడికి స్థానం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డాడు.
చదవండి: IND Vs SL: శ్రీలంకతో తొలి టీ20.. యువ ఓపెనర్ అరంగేట్రం! అక్షర్‌కు నో ఛాన్స్
Comments
Please login to add a commentAdd a comment