ICC Cricket World Cupబ 2023- India vs Pakistan: పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హిట్‌మ్యాన్ బ్యాటింగ్ అంటే తనకు ఇష్టమని తెలిపాడు. ఒక్కసారి రోహిత్ క్రీజులో నిలదొక్కుకుంటే అతడిని ఆపడం కష్టమని.. ప్రపంచంలోని టాప్ బ్యాటర్లందరిలో అతడికి బౌలింగ్ చేయడం కష్టమని పేర్కొన్నాడు.
కాగా వన్డే వరల్డ్‌కప్-2023 నేపథ్యంలో ఇప్పటికే పాకిస్తాన్ జట్టు భారత్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో తొలి వార్మప్ పూర్తి చేసుకున్న బాబర్ ఆజం బృందం.. మంగళవారం ఆస్ట్రేలియాతో మరో సన్నాహక మ్యాచ్‌కు సిద్ధమైంది.
ప్రపంచంలోని టాప్ బ్యాటర్లందరిలో టఫ్
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘‘ప్రపంచంలో ప్రస్తుతం టాప్‌లో ఉన్న బ్యాటర్లలో నాకు రోహిత్ శర్మ ఆట అంటే ఇష్టం. అతడికి బౌలింగ్‌కు చేయడం చాలా కష్టం.
అతడు మోస్ట్ డేంజరస్
ఒక్కసారి తను క్రీజులో పాతుకుపోతే.. అత్యంత ప్రమాదకారిగా మారిపోతాడు’’ అంటూ హిట్‌మ్యాన్‌పై ప్రశంసలు కురిపించాడు. అదే విధంగా ప్రస్తుతం.. టీమిండియాలో కుల్దీప్ యాదవ్ మోస్ట్ డేంజరస్ బౌలర్ అని షాదాబ్ ఖాన్ తన అభిప్రాయం పంచుకున్నాడు. అతడి ఫామ్ చూస్తుంటే ప్రత్యర్థి జట్లకు తిప్పలు తప్పవని పేర్కొన్నాడు.
హైదరాబాద్ ఆతిథ్యం అదుర్స్
ఇక తమకు హైదరాబాద్‌లో అదిరిపోయే ఆతిథ్యం లభించిందన్న ఈ లెగ్‌బ్రేక్ స్పిన్నర్.. ఇక్కడి అభిమానుల ప్రేమను చూస్తుంటే సంతోషంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేశాడు. కాగా ఆసియా కప్-2023లో సూపర్-4 మ్యాచ్‌లో షాదాబ్ బౌలింగ్‌లో రోహిత్ అదరగొట్టిన విషయం తెలిసిందే. అయితే, అతడికే వికెట్ కూడా సమర్పించుకోవడం విశేషం.
డేల్ స్టెయిన్ సైతం
మరోవైపు.. ఆసియా వన్డే కప్-2023 టైటిల్‌ను రోహిత్ సేన గెలవడంలో భారత చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు.
కాగా ఇటీవల సౌతాఫ్రికా మాజీ స్పీడ్‌స్టర్ డేల్ స్టెయిన్.. రోహిత్ శర్మ కఠినమైన బ్యాటర్ అని పేర్కొనగా.. తాజాగా షాదాబ్ సైతం అదే తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ప్రపంచకప్-2023లో భాగంగా అక్టోబరు 14న అహ్మదాబాద్‌లో దాయాదులు టీమిండియా- పాకిస్తాన్ తలపడనున్నాయి.
చదవండి: WC 2023: కేరళలో టీమిండియా.. ముంబైకి వెళ్లిపోయిన కోహ్లి! కారణమిదే!
Comments
Please login to add a commentAdd a comment