Sunil Gavaskar Comments: టీమిండియా నవతరం కెప్టెన్లను ఉద్దేశించి దిగ్గజ సారథి సునిల్ గావస్కర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. జట్టు బాగా ఆడకపోయినా, చెత్తగా ఓడినా తమకు వచ్చే నష్టమేమీ లేదన్నట్లు వ్యవహరిస్తారని పేర్కొన్నాడు. కెప్టెన్‌గా తమ స్థానానికి వచ్చిన ఢోకా ఏమీ లేదన్నట్లు హాయిగా ఉంటారని పరోక్షంగా ఐసీసీ టైటిళ్ల కెప్టెన్‌ను ఉద్దేశిస్తూ విమర్శలు గుప్పించాడు.
మూడు టైటిళ్లతో
కాగా 2013 తర్వాత టీమిండియా ఇంతవరకు ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు. 1983లో కపిల్ డెవిల్స్ వన్డే వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత 2011లో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని భారత జట్టు మరోసారి 50 ఓవర్ల ఫార్మాట్‌లో చాంపియన్‌గా నిలిచింది. అంతకంటే ముందు ధోని సేన అంటే 2007లో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్ టోర్నీలో గెలిచి ట్రోఫీని ముద్దాడింది.
మెగా టోర్నీల్లో చేతులెత్తేసి
ఆ తర్వాత మళ్లీ మ్యాజిక్ రిపీట్ చేస్తూ.. 2013లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ఇలా భారత్‌కు మూడుసార్లు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్‌గా ధోని చరిత్రకెక్కాడు. ఇదిలా ఉంటే.. గత పదేళ్లుగా టీమిండియా ద్వైపాక్షిక సిరీస్‌లలో రాణిస్తున్నా.. మెగా ఈవెంట్లలో మాత్రం తేలిపోతోంది.
2015, 2019 వన్డే వరల్డ్‌కప్.. 2021, 2022 టీ20 ప్రపంచకప్, ఆసియా టీ20 టోర్నీ-2022 ఈవెంట్లలో వైఫల్యాలే ఇందుకు నిదర్శనం. ఇటీవల ముగిసిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్- 2023 ఫైనల్లోనూ ఆస్ట్రేలియా చేతిలో ఏకంగా 209 పరుగుల తేడాతో ఓడి ఘోర పరాభవం మూటగట్టుకుంది.
కెప్టెన్‌కు ఆ భయం లేకుంటే ఇలాగే ఉంటది
ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో సునిల్ గావస్కర్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. ‘‘మ్యాచ్ ఓడినా గెలిచినా.. తనకైతే జట్టులో చోటు ఉంటుందని కెప్టెన్‌కు తెలుసు.
ఇది కేవలం ఇటీవలి కాలంలో జరుగుతున్నదని మీరు అనుకోవచ్చు. కానీ 2011 నుంచే ఇలా జరుగుతోంది. విదేశాల్లో టెస్టు సిరీస్‌లలో 0-4, 0-4తో వైట్‌వాష్‌కు గురైనా అప్పుడు కెప్టెన్‌ను మార్చలేదు కదా!’’ అని వ్యాఖ్యానించాడు. జట్టు గెలుపోటములకు కెప్టెన్లు, కోచ్‌లు జవాబుదారీగా ఉన్నపుడే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని అభిప్రాయపడ్డాడు.
నాడు ధోని సారథ్యంలో వైట్‌వాష్
కెప్టెన్‌కు తన స్థానం గురించి పూర్తి భరోసా ఉన్నపుడు ఒక్కోసారి అన్నీ తేలికగా తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చాడు. కాగా గావస్కర్ ధోనిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడనడానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే.. ధోని సారథ్యంలోనే టీమిండియా 2011-12లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో టెస్టు సిరీస్‌లో 0-4తో క్లీన్‌స్వీప్‌నకు గురైంది.
అయితే, ధోని తర్వాత టెస్టు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన విరాట్ కోహ్లి విదేశాల్లో టీమిండియాకు పలు చిరస్మరణీయ విజయాలు అందించడం విశేషం. ఇక టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. డబ్ల్యూటీసీ సీజన్ 2023-25లో తొలి మ్యాచ్‌లో విండీస్‌పై రోహిత్ సేన ఘన విజయం సాధించింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం 1-0తో ముందంజలో ఉంది.
చదవండి: టీమిండియా కొత్త కెప్టెన్ అరంగేట్రం.. రహానేపై వేటు! అతడు కూడా..
SL Vs Pak: జస్ట్ 87 పరుగులతో సెంచరీ మిస్! ఆ బాధ వర్ణణాతీతం!
సౌతాఫ్రికాలో ఇలాంటి బ్యాటర్లే కావాలి: టీమిండియా బ్యాటింగ్ కోచ్ కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment