![WPL 2025 Deepti Sharma Appointed As UP Warriorz Captain](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/dup.jpg.webp?itok=3817fMp3)
PC: UP Warriorz X
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) టీ20 క్రికెట్ టోర్నమెంట్‌లో మరో జట్టుకు కొత్త కెప్టెన్ నియామకం జరిగింది. ఈనెల 14 నుంచి జరిగే మూడో సీజన్‌లో యూపీ వారియర్స్ జట్టుకు భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ(Deepti Sharma) నాయకత్వం వహించనుంది. గత సీజన్‌లో ఆస్ట్రేలియా స్టార్ అలీసా హీలీ కెప్టెన్సీలో యూపీ వారియర్స్(UP Warriorz) జట్టు బరిలోకి దిగింది.
అయితే గాయం కారణంగా అలీసా హీలీ మూడో సీజన్ డబ్ల్యూపీఎల్ నుంచి వైదొలిగింది. దాంతో యూపీ వారియర్స్‌కు కొత్త కెప్టెన్‌గా దీప్తి శర్మను నియమించారు. గత సీజన్‌లో దీప్తి శర్మ ఎనిమిది ఇన్నింగ్స్‌లు ఆడి 136.57 స్ట్రయిక్‌రేట్‌తో 295 పరుగులు సాధించడంతోపాటు 10 వికెట్లు తీసింది.
గత సీజన్‌లో గుజరాత్ జెయింట్స్ జట్టుకు బెత్ మూనీ కెప్టెన్ వ్యవహరించగా... ఈసారి ఆస్ట్రేలియాకే చెందిన ఆస్లీ గార్డ్‌నర్ గుజరాత్ జెయింట్స్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైంది. డబ్ల్యూపీఎల్‌లోని మిగతా మూడు జట్లకు హర్మన్‌ప్రీత్ (ముంబై ఇండియన్స్), స్మృతి మంధాన (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు), మెగ్ లానింగ్ (ఢిల్లీ క్యాపిటల్స్) కెప్టెన్లుగా ఉన్నారు.
లంకపై ఘన విజయం.. సిరీస్ ఆసీస్‌దే
గాలె: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా... శ్రీలంకలో 14 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ అందుకుంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం ముగిసిన చివరిదైన రెండో టెస్టులో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తద్వారా సిరీస్‌ను 2–0తో చేజిక్కించుకుంది.
కంగారూ జట్టు చివరిసారిగా 2011లో శ్రీలంకలో టెస్టు సిరీస్ గెలిచింది. ఇప్పటికే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అర్హత సాధించిన ఆసీస్... లంక పర్యటనలో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. ఓవర్‌నైట్ స్కోరు 211/8తో ఆదివారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక చివరకు 68.1 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది.
కుశాల్ మెండిస్ (50; 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కంగారూ బౌలర్లలో కూనెమన్, లయన్ చెరో 4 వికెట్లు పడగొట్టారు. కుశాల్ మెండిస్ క్యాచ్ పట్టడం ద్వారా టెస్టు క్రికెట్‌లో 200 క్యాచ్‌లు అందుకున్న ఐదో ప్లేయర్‌గా ఆ్రస్టేలియా కెప్టెన్ స్మిత్ రికార్డుల్లోకి ఎక్కాడు.
అనంతరం స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 17.4 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 75 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖ్వాజా (27 నాటౌట్), ట్రావిస్ హెడ్ (20), లబుషేన్ (26 నాటౌట్) రాణించారు. ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ కేరీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... స్మిత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి.
కరుణరత్నే వీడ్కోలు
శ్రీలంక సీనియర్ బ్యాటర్ దిముత్ కరుణరత్నే పరాజయంతో కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఈ పోరు ద్వారా టెస్టు క్రికెట్‌లో 100 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న 36 ఏళ్ల కరుణరత్నే మాట్లాడుతూ... ‘కెరీర్ ఆరంభంలో ఒక్క టెస్టు మ్యాచ్ ఆడితే చాలు అనుకున్నా. వంద మ్యాచ్‌లు ఆడటం అదృష్టంగా భావిస్తున్నా’ అని అన్నాడు. సుదీర్ఘ కెరీర్‌లో కరుణరత్నే 39.25 సగటుతో 7,222 పరుగులు చేశాడు. అందులో 16 శతకాలు, 39 అర్ధశతకాలు ఉన్నాయి.
చదవండి: జట్టు కోసం కొన్ని పరుగులు చేశా.. అతడొక క్లాసీ ప్లేయర్: రోహిత్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment