యశస్వి జైశ్వాల్- రుతురాజ్ గైక్వాడ్ (PC: IPL)
WTC Final 2021-23- IPL 2023: రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం, ముంబై బ్యాటర్ యశస్వి జైశ్వాల్‌కు బంపర్ ఛాన్స్ దక్కినట్లు సమాచారం. ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ జట్టులో అతడికి చోటు దక్కినట్లు తెలుస్తోంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపికైన టీమిండియాలో స్టాండ్ బైగా ఉన్న రుతురాజ్ గైక్వాడ్ స్థానాన్ని యశస్వితో భర్తీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సెంచరీతో మెరిశాడు
కాగా రాజస్తాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఐపీఎల్-2023లో అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. 14 మ్యాచ్‌లు ఆడిన ఈ యూపీ కుర్రాడు 625 పరుగులు సాధించాడు. ఈ సీజన్‌లో అతడి అత్యధిక స్కోరు 124. ఈ మేరకు 600 పైచిలుకు పరుగులు సాధించిన యశస్వి.. అత్యధిక పరుగుల వీరులు జాబితాలో నాలుగో స్థానం సంపాదించాడు. దేశవాళీ క్రికెట్‌లోనూ రాణించాడు.
రుతురాజ్ అవుట్.. యశస్వి ఇన్!
ఈ క్రమంలో 21 ఏళ్ల ఈ లెఫ్టాంట్ బ్యాటర్‌కు టీమిండియాలో చోటు ఖాయమంటూ క్రీడా ప్రముఖులు సహా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్లో యశస్వికి చోటు అన్న వార్త అతడి ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది.
కాగా ముంబై దేశవాళీ జట్టు కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో స్టాండ్ బైగా చోటు దక్కిన విషయం తెలిసిందే. టీమిండియాను గాయాల బెడద వేధిస్తున్న వేళ ఈ యువ ఓపెనర్‌కు లండన్‌కు వెళ్లే ఛాన్స్ వచ్చింది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. త్వరలోనే పెళ్లికి సిద్ధమవుతున్న రుతురాజ్.. లండన్ ఫ్లైట్ మిస్‌కానున్నట్లు తెలుస్తోంది.
ద్రవిడ్ విజ్ఞప్తి మేరకు
ఈ మేరకు.. ‘‘జైశ్వాల్ త్వరలోనే టీమిండియాతో కలువనున్నాడు. పెళ్లి చేసుకోబోతున్న కారణంగా గైక్వాడ్ లండన్‌కు రాలేనని చెప్పాడు. జూన్ 5 తర్వాతే జట్టుతో చేరే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించాడు.
అయితే, హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ మాత్రం గైక్వాడ్‌కు రీప్లేస్‌మెంట్ చూడాలని సెలక్టర్లను కోరాడు. అతడి స్థానంలో జైశ్వాల్ లండన్‌కు పయనం కానున్నాడు’’ అని బీసీసీఐ అధికారి వెల్లడించినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తన కథనంలో పేర్కొంది.
జూన్ 7న ఆరంభం
కాగా డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో రుతురాజ్‌తో పాటు ముకేశ్ కుమార్, సూర్యకుమార్ యాదవ్ స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపికైన విషయం తెలిసిందే. కాగా జూన్ 7-11 వరకు ఇంగ్లండ్ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. టీమిండియా- ఆస్ట్రేలియా ఐసీసీ ట్రోఫీ కోసం ఓవల్ వేదికగా తలపడనున్నాయి.
ఇదిలా ఉంటే.. రాజస్తాన్ ఐపీఎల్-2023 లీగ్ దశలోనే నిష్క్రమించగా.. సీఎస్‌కే మే 28న ఫైనల్లో గుజరాత్‌తో తలపడనుంది. ఇక సీఎస్‌కే విజయాల్లో రుతురాజ్‌ది కీలక అన్న సంగతి తెలిసిందే.
డబ్ల్యూటీసీ ఫైనల్-2023: బీసీసీఐ ప్రకటించిన జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్).
స్టాండ్ బై ప్లేయర్లు: రుతురాజ్ గైక్వాడ్, ముకేశ్ కుమార్, సూర్యకుమార్ యాదవ్.
చదవండి: కీలక మ్యాచ్‌ల్లో రోహిత్ రాణించడం ఎప్పుడు చూడలేదు.. అతనో ఫెయిల్యూర్...!
Comments
Please login to add a commentAdd a comment