టీమిండియా ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, శివమ్ దూబేలకు బంపర్ ఆఫర్ తగిలేలా ఉంది. ఈ ఇద్దరికి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. గతకొంతకాలంగా పొట్టి క్రికెట్‌లో విశేషంగా రాణిస్తున్న వీరిరువురికి సెంట్రల్ కాంట్రాక్ట్‌తో గుర్తింపునివ్వాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం.
త్వరలోనే వీరు శుభవార్త వినే అవకాశం ఉందని భారత క్రికెట్ సర్కిల్స్ కోడైకూస్తున్నాయి. బీసీసీఐ గతేడాది (2022-23) మొత్తం 26 మంది ఆటగాళ్లకు సెంట్రల్ కాంట్రాక్ట్ అందించింది. 2023-24 బీసీసీఐ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాలో కొత్తగా యశస్వి, దూబే చేరవచ్చు.
కాగా, ప్రస్తుతం స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో యశస్వి, దూబే ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా శివమ్ దూబే తన కెరీర్‌లో అత్యుత్తమ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఆఫ్ఘన్‌తో తొలి రెండు మ్యాచ్‌ల్లో అతను రెండు అజేయ అర్ధశతకాలతో (60, 63) పాటు మూడు వికెట్లు పడగొట్టి టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.
గతేడాది ఐర్లాండ్ టూర్‌తో మూడేళ్ల తర్వాత టీమిండియాలోకి (టీ20 జట్టు) రీఎంట్రీ ఇచ్చిన దూబే అప్పటి నుంచి విశేషంగా రాణిస్తున్నాడు (20 టీ20ల్లో 45.83 సగటున 275 పరుగులు, 8 వికెట్లు).
అంతకముందు ఐపీఎల్ 2023లో దూబే సీఎస్‌కే తరఫున విశ్వరూపమే ప్రదర్శించాడు. ఆ సీజన్‌లో అతను 16 మ్యాచ్‌ల్లో 158.33 స్ట్రయిక్‌రేట్‌తో 418 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు, 35 సిక్సర్లు ఉన్నాయి. దూబే బౌలింగ్‌లో ఇంకాస్త మెరుగై, బ్యాటింగ్ ప్రదర్శనను ఇలాగే కొనసాగిస్తే హార్దిక్‌కు ప్రత్యామ్నాయంగా మారడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు.
మరోవైపు జైస్వాల్ అరంగేట్రం నాటి నుంచి టెస్ట్, టీ20ల్లో చెలరేగిపోతున్నాడు. గతేడాది వెస్టిండీస్ పర్యటనలో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన జైస్వాల్.. నాటి నుంచి 4 టెస్ట్‌లు, 16 వన్డేలు ఆడి 2 సెంచరీలు, 5 అర్ధసెంచరీలు చేశాడు. తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో టీ20లో జైస్వాల్ (68).. దూబేతో కలిసి భారత్‌కు అద్భుత విజయాన్ని అందించారు.
Comments
Please login to add a commentAdd a comment