2023-24 సంవత్సరానికి గాను సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ ఇవాళ (ఫిబ్రవరి 28) ప్రకటించింది. 30 మంది పేర్లు గల ఈ జాబితాలో అందరూ ఊహించిన విధంగానే శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కాంట్రాక్ట్‌లు కోల్పోయారు. రంజీల్లో ఆడాల్సిందేనన్న బీసీసీఐ ఆదేశాలను బేఖాతరు చేసినందుకు గాను వీరిపై వేటు పడినట్లు తెలుస్తుంది. వీరితో పాటు చతేశ్వర్ పుజారా, ఉమేశ్ యాదవ్, శిఖర్ ధవన్ లాంటి వెటరన్లను బీసీసీఐ పక్కకు పెట్టింది. సరైన అవకాశాలు రాని చహల్, దీపక్ హుడాలపై కూడా వేటు పడింది.
- ఏ ప్లస్ కేటగిరిలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా..
- ఏ కేటగిరిలో అశ్విన్, షమీ, సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా..
- బి కేటగిరిలో సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్..
- సి కేటగిరిలో రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిద్ద్ కృష్ణ, అవేశ్ ఖాన్, రజత్ పాటిదార్ చోటు దక్కించుకున్నారు.
కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, సిరాజ్‌లకు బి నుంచి ఏ కేటగిరికి ప్రమోషన్ లభించగా.. అక్షర్ పటేల్, రిషబ్ పంత్‌లకు ఏ నుంచి బి కేటగిరికి డిమోషన్ వచ్చింది. ఇటీవలికాలంలో ఆకట్టుకున్న యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, తిలక్ వర్మ, ప్రసిద్ద్ కృష్ణ , అవేశ్ ఖాన్ , రజత్ పాటిదార్ , జితేశ్ శర్మ , ముకేశ్ కుమార్, రవి బిష్ణోయ్‌లకు కొత్తగా కాంట్రాక్ట్ లభించింది.
ప్రతిభకు దక్కిన గౌరవం..
సహజంగా తొలిసారి కాంట్రాక్ట్ లభించే ఆటగాళ్లకు బీసీసీఐ తొలుత సి గ్రేడ్‌లో అవకాశం ఇస్తుంది. అయితే సూపర్ ఫామ్‌లో ఉన్న యశస్వి నేరుగా బి గ్రేడ్ కాంట్రాక్ట్ పొంది జాక్‌పాట్ కొట్టాడు. ఈ కాంట్రాక్ట్ అనేది అతనికి ఆషామాషీగా లభించింది కాదు. ఈ యువ కెరటం ఆడిన 8 టెస్ట్‌ల్లో 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీల సాయంతో 971 పరుగులు చేశాడు. ఇందులో ఇటీవల ఇంగ్లండ్‌పై చేసిన వరుస డబుల్ సెంచరీలు ఉన్నాయి.
ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్‌లో అతను రికార్డు స్థాయిలో 4 మ్యాచ్‌ల్లో 655 పరుగులు చేసి కోహ్లి పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును సమం చేశాడు. యశస్వి మెరుపులు టెస్ట్ మ్యాచ్‌లకు మాత్రమే పరిమితం కాలేదు. ఈ యువ ఆటగాడు టీ20ల్లో సైతం సత్తా చాటాడు. ఇప్పటివరకు ఆడిన 17 మ్యాచ్‌ల్లో సెంచరీ, 4 అర్దసెంచరీల సాయంతో 161 స్ట్రయిక్‌రేట్‌తో 502 పరుగులు చేశాడు. ఈ స్థాయిలో రాణించిన కారణంగానే అతనికి నేరుగా బి గ్రేడ్ కాంట్రాక్ట్ దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment