సర్ఫరాజ్‌ ఖాన్‌, దృవ్‌ జురెల్‌లకు జాక్‌పాట్‌ | Dhruv Jurel And Sarfaraz Khan Will Be Included In Grade C If They Play In 5th Test Against England | Sakshi
Sakshi News home page

సర్ఫరాజ్‌ ఖాన్‌, దృవ్‌ జురెల్‌లకు జాక్‌పాట్‌

Published Wed, Feb 28 2024 8:14 PM | Last Updated on Wed, Feb 28 2024 9:17 PM

Dhruv Jurel And Sarfaraz Khan Will Be Included In Grade C If They Play In 5th Test Against England - Sakshi

టీమిండియా బ్యాటింగ్‌ సంచలనాలు సర్ఫరాజ్‌ ఖాన్‌, దృవ్‌ జురెల్‌లకు జాక్‌పాట్‌ కొట్టే ఛాన్స్‌ వచ్చింది. ఇంగ్లండ్‌తో జరుగబోయే తదుపరి టెస్ట్‌లో ఈ ఇద్దరు తుది జట్టులో ఉంటే, వీరికి బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌లు దక్కనున్నాయి. బీసీసీఐ కాంట్రాక్ట్‌ దక్కాలంటే ఆటగాళ్లు టీమిండియా తరఫున కనీసం 3 టెస్టులు లేదా ఎనిమిది వన్డేలు లేదా పది టీ20లు ఆడాల్సి ఉంటుంది.

అయితే వీరిద్దరు ఇప్పటివరకు రెండు టెస్ట్‌ మ్యాచ్‌లే ఆడారు. ఈ రెండు మ్యాచ్‌ల్లో వీరిద్దరి ప్రదర్శనను పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ.. మూడు మ్యాచ్‌ల అనంతరం వీరికి సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఇద్దరు ఆటగాళ్ల తాజా  ఫామ్‌ను బట్టి చూస్తే వీరు ఐదో టెస్ట్‌కు తుది జట్టులో ఉండటం దాదాపుగా ఖాయమేనని చెప్పాలి. దీంతో వీరికి గ్రేడ్‌ సి కింద బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ దక్కడం దాదాపుగా ఖరారైందనే చెప్పాలి.

కాగా, 2023-24 సంవత్సరానికి గాను సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ పొందిన ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ ఇవాళ (ఫిబ్రవరి 28) ప్రకటించింది. ఈ జాబితాలో మొత్తం 30 మంది ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. 

  • ఏ ప్లస్‌ కేటగిరిలో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, జస్ప్రీత్‌ బుమ్రా, రవీంద్ర జడేజా..
  • ఏ కేటగిరిలో అశ్విన్‌, షమీ, సిరాజ్‌, కేఎల్‌ రాహుల్‌, శుభ్‌మన్‌ గిల్‌, హార్దిక్‌ పాండ్యా..
  • బి కేటగిరిలో సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌, కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, యశస్వి జైస్వాల్‌..
  • సి కేటగిరిలో రింకూ సింగ్‌, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్‌, శార్దూల్ ఠాకూర్‌, శివమ్‌ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్‌ సుందర్, ముఖేష్ కుమార్‌, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్‌, కేఎస్‌ భరత్‌, ప్రసిద్ద్‌ కృష్ణ, అవేశ్‌ ఖాన్‌, రజత్‌ పాటిదార్ చోటు దక్కించుకున్నారు. 

రంజీల్లో ఆడాల్సిందేనన్న బీసీసీఐ ఆదేశాలను బేఖాతరు చేసిన శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌ కాంట్రాక్ట్‌లను కోల్పోగా.. రింకూ సింగ్‌ (సి), తిలక్‌ వర్మ (సి), ప్రసిద్ద్‌ కృష్ణ (సి), అవేశ్‌ ఖాన్‌ (సి), రజత్‌ పాటిదార్ (సి), జితేశ్‌ శర్మ (సి), ముకేశ్‌ కుమార్‌ (సి), రవి బిష్ణోయ్‌కు (సి) కొత్తగా కాంట్రాక్ట్‌ లభించింది.

శ్రేయస్‌ (బి), ఇషాన్‌లతో (సి) పాటు యుజ్వేంద్ర చహల్‌ (సి), చతేశ్వర్‌ పుజారా (బి), దీపక్‌ హుడా (సి), ఉమేశ్‌ యాదవ్‌ (సి), శిఖర్‌ ధవన్‌ (సి) బీసీసీఐ కాంట్రాక్ట్‌లు కోల్పోయారు. 

కేఎల్‌ రాహుల్‌, శుభ్‌మన్‌ గిల్‌, సిరాజ్‌లకు బి నుంచి ఏ కేటగిరికి ప్రమోషన్‌ లభించగా.. అక్షర్‌ పటేల్‌, రిషబ్‌ పంత్‌లకు ఏ నుంచి బి కేటగిరికి డిమోషన్‌ వచ్చింది. 

గతేడాది బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌లో లేని యశస్వి జైస్వాల్‌.. ప్రస్తుత ఇంగ్లండ్‌ టెస్ట్‌ సిరీస్‌లో అత్యుత్తమంగా (వరుస డబుల్‌ సెంచరీలు) రాణించడంతో అతనికి నేరుగా బి గ్రేడ్‌ కాంట్రాక్ట్‌ దక్కింది.

ఏ ప్లస్‌ కేటగిరిలో ఉన్న ఆటగాళ్లకు వార్షిక వేతనం కింద యేటా రూ. 7 కోట్లు దక్కనున్నాయి. ‘ఏ’ కేటగిరీలోని క్రికెటర్లకు  రూ. 5 కోట్లు..‘బి’ కేటగిరిలో ఉన్న వారికి రూ. 3 కోట్లు.. ‘సి’ కేటగిరిలో ఉన్న క్రికెటర్లకు కోటి రూపాయల వార్షిక వేతనం లభించనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement