
వివరాలు వెల్లడిస్తున్న ఇన్‌స్పెక్టర్ సురేంద్రబాబు
నెల్లూరు(క్రైమ్): ప్రయాణికుల ముసుగులో చోరీలకు పాల్పడిన ఘటనలో ముగ్గురు మహిళలను నెల్లూరు చిన్నబజారు పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం పోలీస్‌స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ ఎ.సురేంద్రబాబు కేసు వివరాలు వెల్లడించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఎ.లక్ష్మి గత నెల 14వ తేదీన నెల్లూరుకు వచ్చారు. రాత్రి 8.30 గంటల సమయంలో ఆమె గాంధీబొమ్మ నుంచి ఆర్టీసీ బస్టాండ్‌కు ఆటోలో ప్రయాణిస్తున్నారు.
ముగ్గురు గుర్తుతెలియని మహిళలు అదే ఆటోలో ఎక్కారు. లక్ష్మికి చెందిన హ్యాండ్‌బ్యాగ్ తెరిచి రూ.3.80 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను అపహరించుకెళ్లారు. బస్టాండ్ వద్ద ఆటో దిగిన లక్ష్మికి బ్యాగ్‌లోని నగలు కనిపించకపోవడంతో చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలో ఎస్సై ఎ.సైదులు తన సిబ్బందితో కలిసి కేసు దర్యాప్తును ప్రారంభించారు. బాధితురాలు చెప్పిన ఆనవాళ్లు, సాంకేతికత ఆధారంగా నిందితురాళ్లు విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన ఎం.సంధ్య, భాను, అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం, గొట్లం గ్రామానికి చెందిన ఆర్.వసంతగా గుర్తించారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
శుక్రవారం వీఆర్ లా కళాశాల ఎదురుగా ఉన్న రహదారిపై అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరం అంగీకరించడంతో వారిని అరెస్ట్ చేసి రూ.3.80 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన ఇన్‌స్పెక్టర్, ఎస్సైలతోపాటు క్రైమ్ పార్టీ ఏఎస్సై శ్రీహరి, హెచ్‌సీలు సురేష్, నరసయ్య, నజ్మల్, పీసీ శ్యామ్, వర్ధన్, దేవను ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి, డీఎస్పీ డి.శ్రీనివాసరెడ్డి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment