జీవన ఎరువుల ప్రయోగశాల | Farmers friend : A research institute which gives many insights of agriculture | Sakshi
Sakshi News home page

జీవన ఎరువుల ప్రయోగశాల

Published Thu, Jun 29 2023 12:08 AM | Last Updated on Thu, Jun 29 2023 7:00 PM

- - Sakshi

సాక్షి, నెల్లూరు డెస్క్‌ : భూ మండలంలో సంచరించే జీవుల మనుగడ వాటి శరీరంలో ఉండే సూక్ష్మజీవుల (మైక్రోబ్స్‌) పైనే ఆధారపడి ఉంటుందనేది శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైన వాస్తవం. మైక్రోబ్స్‌ ఆయా జీవుల్లో వాటి శరీర పరిమాణాన్ని బట్టి లక్షలు/కోట్లలో ఉంటాయి. ఒక నిర్ధిష్టమైన రేషియోలో వాటి సంఖ్య పెరుగుతుంటే.. అదే సమయంలో ఆ స్థాయి నిష్పత్తిలో మరికొన్ని అంతరించిపోతుంటాయి. ఈ మైక్రోబ్స్‌ ప్రాణి బతకడానికి అవసరమైన న్యూట్రియంట్స్‌ను అందిస్తాయి. ఇవి ప్రాణులకు ఎంత ముఖ్యమో మొక్కలకూ అంతే అవసరం.

మొక్కల ఎదుగుదలకు

సాధారణంగా రైతులు పొలంలోని పైరు ఎదుగుదల కోసం రసాయన ఎరువులను వాడుతుంటారు. అందులో నత్రజని, పొటాషియం, భాస్వరం వంటి పదార్థాలుంటాయి. వాటిని అవసరమైన మేరకే మొక్కలకు వాడాలి. మోతాదు మించితే పైరుకు నష్టం కలుగుతుంది. మరోవైపు ఈ రసాయన ఎరువులు విపరీతంగా వాడటంతో భూమి నిస్సారం అవుతోంది. మ్యూకస్‌ తగ్గిపోయి జీవం కోల్పోతోంది. దీంతో దాదాపు రెండు దశాబ్దాల నుంచి శాస్త్రవేత్తలు జీవన ఎరువులపై దృష్టి సారించారు. ధరణికి హాని చేయని జీవన ఎరువుల తయారీని ప్రోత్సహిస్తున్నారు.

ఏమిటీ జీవన ఎరువులు?

జీవన ఎరువు అంటే మొక్కల పెరుగుదలకు అవసరమైన పోషకాలు అందించే ఒక రకమైన మంచి బ్యాక్టీరియాతో కూడిన ద్రవ లేదా మొత్తని పదార్థం. ప్రస్తుతం ఈ జీవన ఎరువులను అనేక కంపెనీలు తయారు చేస్తున్నాయి. ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేసుకుంటున్నాయి. అయితే వాటిలో నిర్ణీత మోతాదులో లివింగ్‌ ఆర్గానిజమ్స్‌ ఉంటున్నాయా? మైకోరిజాల్‌ ఫంగీ, బ్లూ–గ్రీన్‌ అల్గే, బ్యాక్టీరియా తగినంతగా ఉంటున్నాయా? తదితర అంశాలపై రైతులకు కలిగే ఇలాంటి సందేహాలను నివృత్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కల్తీ జీవన ఎరువుల బారి నుంచి రైతన్నలను కాపాడేందుకు చర్యలు తీసుకుంది.

జీవన ఎరువుల ప్రయోగశాల

దుకాణాల్లో రైతులకు విక్రయించే జీవన ఎరువులు నాణ్యమైనవో కాదో నిర్ధారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నెల్లూరులో జీవన, సేంద్రియ ఎరువుల నాణ్యత నిర్ధారణ ప్రయోగశాలను ఏర్పాటు చేసింది. రూ.1.40 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ ప్రయోగశాలలో అధునాతన పరికరాలు సమకూర్చారు. మండల స్థాయిలో అధికారులు సేకరిస్తున్న శాంపిళ్లను రీజినల్‌ సెంటర్ల (అమరావతి, తిరుపతి, విశాఖ, తాడేపల్లిగూడెం)కు మొదటగా పంపుతారు. అక్కడి నుంచి వాటిని డీకోడ్‌ చేసి నెల్లూరులోని ప్రయోగశాలకు పంపుతున్నారు. ఇక్కడి ల్యాబ్‌లలో ఆ శాంపిళ్లను వివిధ విభాగాల్లో పరీక్షలు నిర్వహించి అవి నాణ్యమైనవో కాదో తెలియజేస్తున్నారు. వీరిచ్చే నివేదిక ఆధారంగా ఒకవేళ అవి సరిగా లేకుంటే వాటిని విక్రయించే లేదా తయారీదారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

రైతులు పండించే పంటకు ఎరువుల వాడకం ఎంతో కీలకం. వాటిలో జీవన ఎరువులపై రైతులు ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. వాటిని వివిధ కంపెనీలు అనేక విధాలుగా తయారు చేస్తాయి. అసలు ఈ జీవన ఎరువులు అంటే ఏమిటి.. వాటిని ఎన్ని అంశాల్లో పరీక్షిస్తారు.. ఉండాల్సిన లక్షణాలు ఏమిటి.. ఎక్కడ తయారు చేస్తారో తదితర వివరాలను క్లుప్తంగా తెలుసుకుందాం.

ఏ పరీక్షలు చేస్తారంటే?

నెల్లూరులోని ప్రయోగశాలలో జీవన ఎరువులైన రైజోబియం, అజటోబాక్టర్‌, అజోస్పెరిల్లమ్‌, మైకోరైజా, పొటాషియం మొబిలైజింగ్‌ బ్యాక్టీరియా వంటి వాటిలో నాణ్యతా నిర్ధారణ పరీక్షలు చేస్తారు. సేంద్రియ ఎరువులైన వర్మీ కంపోస్టు, ఆర్గానిక్‌ మెన్యూర్‌, డీ ఆయిల్డ్‌ కేక్స్‌ అయిన వేపచెక్క, ఆముదం చెక్కల నాణ్యతను కూడా నిర్ధారిస్తారు. వివిధ శాంపిళ్లు ఈ ప్రయోగశాలకు రాగానే వాటిని స్టెరిలైజేషన్‌ చేసిన వస్తువుల్లో ఉంచి వాటిని యంత్రాల్లో 24 గంటల పాటు పరీక్షిస్తారు. బీఓడీ (బయోలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌) ఎంత మేరకు ఉందో తెలుసుకుంటారు. అనంతరం వాటిలో పీహెచ్‌ (ఉదజన సూచిక), ఈసీ (ఎలక్ట్రికల్‌ కండెక్టవిటీ), సేంద్రియ కర్బనం, నత్రజని, పొటాషియం, భాస్వరం, హెవీ మెటల్స్‌ ఎంతెంత స్థాయిలో ఉన్నాయో ల్యాబ్‌ల్లో పరీక్షించి తెలుసుకుంటారు.

ఎన్ని శాంపిళ్లను పరీక్షించారంటే..

ఇక్కడ ప్రయోగశాలను ఏర్పాటు చేశాక ఇప్పటి వరకు 307 జీవన ఎరువులు, 330 సేంద్రియ ఎరువులు, 10 డీ ఆయిల్డ్‌ కేక్స్‌ల నాణ్యతను పరీక్షించారు. క్వాలిటీ ఉన్నవి, లేనివి సర్టిఫై చేసి వాటిని ఆయా రీజినల్‌ సెంటర్లకు పంపుతున్నారు. నాణ్యత లేదని నిర్ధారణ అయితే.. వాటిని విక్రయించిన దుకాణాలు, తయారీదారులపై ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది. ఇలా జీవన ఎరువుల్లో నాణ్యత నిర్ధారణ చేపట్టి రైతులకు మేలు కలిగేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ముదావహం.

నాణ్యతను పక్కాగా నిర్ధారిస్తాం

ప్రయోగశాలకు రీజినల్‌ సెంటర్ల నుంచి డీకోడింగ్‌ చేసి శాంపిళ్లు పంపుతారు. అవి ఎక్కడి నుంచి తీసినవో మాకు తెలియదు. మాకు అందిన వాటిని వివిధ విభాగాల యంత్రాల్లో పరీక్షలకు పెడతాం. 24 గంటలపాటు వాటిని పరీక్షించి ఏఏ మోతాదుల్లో బీఓడీ ఉందో (బయోలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌) తెలుసుకుంటాం. అనంతరం వాటి పీహెచ్‌, ఈసీ తదితరాలు ఏ మేరకు ఉన్నాయో నిర్ధారించుకుని రిపోర్టు తయారు చేసి పంపిస్తాం.

– టి.శివరంజని, ఏఓ

No comments yet. Be the first to comment!
Add a comment
జీవన ఎరువులను పరీక్షించే యంత్రం1
1/4

జీవన ఎరువులను పరీక్షించే యంత్రం

ప్రయోగశాలలోని పరికరాలు 2
2/4

ప్రయోగశాలలోని పరికరాలు

3
3/4

4
4/4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement