ఆశయం ముందు తలవంచిన అవరోధాలు | - | Sakshi
Sakshi News home page

ఆశయం ముందు తలవంచిన అవరోధాలు

Published Fri, Aug 25 2023 12:28 AM | Last Updated on Sat, Aug 26 2023 1:49 PM

- - Sakshi

కందుకూరు: ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న ఆమె చిన్ననాటి ఆశయం ముందు పెళ్లి, కుటుంబ బాధ్యతలు, అనారోగ్యం వంటి అవరోధాలన్నీ చిన్నబోయాయి. పట్టుదల, నిరంతర కృషితో ఎంతటి లక్ష్యాన్ని అయినా సాధించవచ్చని నిరూపించింది ఉలవపాడు మండలం బద్దిపూడికి చెందిన చేజర్ల రమ్యరెడ్డి. ఇటీవల విడుదలైన గ్రూప్‌–1 ఫలితాల్లో విజయం సాధించింది. ఎటువంటి కోచింగ్‌ లేకుండానే తన సొంత ప్రిపరేషన్‌తో రెండో ప్రయత్నంలోనే గ్రూప్‌–1 ఆఫీసర్‌గా ఎంపికై ంది.

పబ్లిక్‌ సర్వీస్‌ చిన్ననాటి కోరిక
బద్దిపూడికి చెందిన శ్రీనివాసులరెడ్డి, కృష్ణవేణి దంపతుల కుమార్తె చేజర్ల రమ్యరెడ్డి. తండ్రి సాధారణ రైతు కావడంతో రమ్య పాఠశాల విద్యను అమ్మనబ్రోలులోని ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో పూర్తి చేసింది. విజయనగరం జిల్లా తాటిపూడి రెసిడెన్షిల్‌ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ విద్యను పూర్తి చేసింది. అనంతరం విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో బీఫార్మసీ, ఏలూరు జిల్లాలోని నోవా కళాశాలలో ఎంఫార్మసీ పూర్తి చేసింది. ఆ తరువాత రెండేళ్ల పాటు అరబిందో ఫార్మా స్యూటికల్స్‌లో ఉద్యోగం చేసింది. 2010లో తల్లిదండ్రులు చూసిన సంబంధం మేరకు మాచవరానికి చెందిన వంశీకృష్ణారెడ్డిని వివాహం చేసుకుంది. భర్త మలేసియాలో ఎలక్ట్రికల్‌ అండ్‌ ఇన్‌స్ట్రూమెంటేషన్‌ ఇంజినీర్‌గా పనిచేస్తుండడంతో అక్కడికి వెళ్లారు. ఆ తరు వాత 2018లో స్వదేశానికి వచ్చి కరోనా ప్రభావంతో ఇక్కడే ఉండిపోయారు.

రెండో ప్రయత్నంలోనే..
రమ్యరెడ్డి తన రెండో ప్రయత్నంలోనే గ్రూప్‌–1 ఉద్యోగం సాధించింది. 2018 చివరిలో వెలువడిన గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ సమయానికి రమ్యకు ఐదేళ్ల కుమారుడితో పాటు కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. అయినా సరే గ్రూప్‌–1 పరీక్షలు రాసి ఇంటర్వ్యూ వరకు వెళ్లింది. ఇంటర్వ్యూలో సరైన మార్కులు రాకపోవడంతో త్రుటిలో ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. 2022 సెప్టెంబర్‌లో మళ్లీ గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ విడుదలవగా ప్రణాళికాబద్ధంగా పరీక్షలకు సిద్ధమైంది. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూ లు పాసై మెడికల్‌ అండ్‌ హెల్త్‌ డిపార్టుమెంట్‌లో అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించింది. మెయిన్స్‌ సమయంలో సైనసైటిస్‌ మేజర్‌ ఆపరేషన్‌తో నెల పాటు ప్రిపరేషన్‌ నిలిచిపోయినా మళ్లీ కోలుకుని పరీక్షలు రాసి విజయం సాధించింది. తాను చిన్ననాటి నుంచి కలలు కన్న ప్రభుత్వ ఉద్యోగం ఆశయాన్ని నెరవేర్చుకుంది.

ఇష్టపడి కష్టపడితే ఏదైనా సాధ్యమే
చాలా మంది పెళ్లి అయిన తరువాత ఇంకేమి సాధిస్తాం అని చెప్తుంటారు. కానీ సరైన లక్ష్యాన్ని ఎంచుకుని కష్టపడితే ఏదైనా సాధించవచ్చు. నా ఉద్యోగ ప్రయత్నంలో నా భర్త వంశీకృష్ణారెడ్డితో పాటు కుటుంబ సభ్యులు చాలా సహకరించారు. అందుకే నాలుగేళ్ల పాటు పట్టు వదలకుండా నిరంతరం కష్టపడి చదివాను. చివరికి నాకు ఇష్టమైన మెడికల్‌ అండ్‌ హెల్త్‌ డిపార్టుమెంట్‌లోనే ఉద్యోగం రావడం సంతోషంగా ఉంది. ప్రజలకు సేవ చేసేందుకు ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నా.

– రమ్యరెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement