తన గోడు చెప్పుకుంటున్న బాధితురాలు నస్రీన్
ఆత్మకూరు : తనపై భర్త తరపు బంధువులు దాడులకు పాల్పడుతున్నారని, తనకు న్యాయం చేయాలని ఓ వివాహిత ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో షేక్ నస్రీన్ సోమవారం విలేకరులతో మాట్లాడారు. వింజమూరుకు చెందిన షేక్ నస్రీన్ భర్త ముజీబ్‌తో గొడవలు రావడంతో మూడేళ్ల క్రితం విడిపోయింది. వారికి ఐదేళ్ల కుమార్తె ఉంది. ఆమె బతుకుదెరువు కోసం కలిగిరిలోని ఓ దుకాణంలో చిరుద్యోగం చేస్తోంది. రోజూ వింజమూరు నుంచి కలిగిరికి వెళ్లి వస్తుంటుంది. ఈ క్రమంలో ఆమె భర్త తరపు బంధువులు నలుగురు తమ మాట వింటే భర్తతో కాపురం నిలబెడతామని చెప్పుకొచ్చారు.
అదే క్రమంలో ఆమెను తరచూ వేధిస్తుండేవారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం కలిగిరిలో విధులు పూర్తి చేసుకుని వింజమూరుకు వస్తున్న ఆమెను ఆ నలుగురూ అటకాయించి ఇబ్బందులకు గురిచేశారు. ఆమె ఉంటున్న ఇల్లు (భర్త బంధువుది) వెంటనే ఖాళీ చేయాలని దౌర్జన్యానికి పాల్పడ్డారు. అంతేకాకుండా ఆమె ఉంటున్న ఇంటిని సైతం కొంత భాగం కూలదోశారు. దీంతో అదేరోజు రాత్రి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సమయంలో రాలేమని, మరుసటి రోజు రావాలని పోలీసులు చెప్పడంతో స్టేషన్ ఎదుటే ఈ ఆదివారం తనకు న్యాయం చేయాలని ధర్నాకు దిగింది.
పోలీసులు ఆమెను ధర్నాను విరమింపజేసేందుకు ప్రయత్నించే క్రమంలో చేతిలోని బ్లేడు తెగి గాయాలయ్యాయి. అస్వస్థతకు గురైన ఆమె ఆత్మకూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరింది. తనను వేధిస్తున్న వారిపై ఫిర్యాదు చేసేందుకు దిశ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లనున్నట్లు ఆమె తెలిపింది. దీనిపై పోలీసులను వివరణ కోరగా పలువురిపై కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment