స్థలాలను లాక్కుంటాం..
ఎప్పటికై నా ఇంటిని నిర్మించుకోవాలనేది ఎంతో మంది ఆకాంక్ష. ఇందులో భాగంగా స్థలాన్ని కొనుగోలు చేసినా, ఆర్థిక పరిస్థితులు అనుకూలించక.. వాటిని కొంత కాలం ఖాళీగా వదిలేస్తారు. వీటికి వేకెంట్ ల్యాండ్ ట్యాక్‌ను చెల్లించాల్సి ఉన్నా, వాటిని కట్టడంలో కొంత జాప్యం జరుగుతుంది. అయితే వీటిని ఎలాగైనా సేకరించి, పన్నుల వసూళ్లలో నెల్లూరు ముందుందనే రీతిలో కనపడాలనే తాపత్రయంతో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అడుగులేస్తున్నారు. అనుకున్నదే తరువాయిగా పన్నులు చెల్లించకపోతే ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని బాహాటంగా బెదిరిస్తూ బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో నగరపాలక సంస్థ అధికారులు అవలంబిస్తున్న తీరుపై యజమానులు భగ్గుమంటున్నారు.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలల్లో సంక్షేమం మాట అటుంచితే, ప్రజలను ఎలా పీక్కుతినాలనే అంశంపైనే ఎక్కువ కసరత్తు సాగిస్తున్నారు. ఇప్పటికే ప్రజలపై భారం మోపుతూ వికటాట్టహాసం చేస్తున్న పాలకులు తాజాగా మరో దుర్మార్గ పోకడకు శ్రీకారం చుట్టారు. సాధారణంగా ఖాళీ స్థలాలున్న యజమానులు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్‌ను చెల్లించాల్సి ఉంది. వీటిని ముందో.. వెనుకో చెల్లించే వెసులుబాటు ఉంది. అయితే నెల్లూరులో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా సాగుతోంది. పన్నులను వెంటనే చెల్లించకపోతే స్థలాన్ని స్వాఽధీనం చేసుకుంటామంటూ బోర్డులను కార్పొరేషన్ అధికారులు పెడుతున్నారు. నగరపాలక సంస్థలో సాగుతున్న ఈ దారుణంపై ప్రైవేట్ స్థలాల యజమానులు భగ్గుమంటున్నారు.
ఎవరి దారి వారిదే..
పన్నులను వసూలు చేయడం మంచిదేనైనా, కార్పొరేషన్ అధికారులు అనుసరిస్తున్న వైఖరే వివాదాస్పదంగా మారుతోంది. కఠిన నిర్ణయాలతో మంత్రి నారాయణ దూకుడు పెంచగా.. పన్నుల కోసం పీడిస్తే నగరవాసుల కోసం రోడ్డెక్కుతానని పుష్ప సినిమా తరహాలో మాస్ వార్నింగ్‌లను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఇస్తున్నారు. ఈ తరుణంలో తగ్గేదేలే అనే రీతిలో మంత్రి సాగుతుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ప్రచారార్భాటానికి తాపత్రయం
కార్పొరేషన్ పరిధిలో ఖాళీ స్థలాలకు సంబంధించి 6,500 అసెస్మెంట్లు ఉండగా, వీటి నుంచి రూ.17.5 కోట్లు వసూలు కావాల్సి ఉంది. మంత్రి నారాయణ మున్సిపల్ మంత్రిగా ఉండటంతో తన శాఖలో పన్నులను భారీగా వసూలు చేస్తున్నామని చిత్రీకరించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నగరపాలక సంస్థలో మునుపెన్నడూ లేని విధంగా పన్నుల వసూళ్లే పరమావధిగా దూకుడు పెంచారు. కార్పొరేషన్లో చోటు చేసుకుంటున్న పరిణామాలను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి బాహాటంగా వ్యతిరేకిస్తున్నారు. మంత్రితో విభేదిస్తూనే.. అధికారులపై అసహనం వ్యక్తం చేస్తూ హెచ్చరికలనూ జారీ చేశారు. అయితే వీటిని పట్టించుకోకుండా, తన అనుచరులకు సంబంధించిన ఖాళీ స్థలాల్లో బోర్డులను పెట్టించడంపై ఆయన రగిలిపోతున్నారు. తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధపడుతున్నారని కోటంరెడ్డి అనుచరులే వ్యాఖ్యానిస్తున్నారు.
సామాన్యులపై కన్నెర్ర
మరోవైపు పన్ను చెల్లించని వారి నివాసాలకు విద్యుత్, కుళాయి కనెక్షన్లను కట్ చేస్తామని బెదిరిస్తున్నారు. వాణిజ్య సముదాయాలకు తాళాలేసేందుకు సిద్ధమవుతున్నారు. గత ప్రభుత్వాలు ఇలాంటి చర్యలకు పూనుకోలేదని, ఓట్లేసి గెలిపించిన ప్రజలకు కూటమి ప్రభుత్వమిచ్చే గిఫ్ట్ ఇదేనాననే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.
ఈ చిత్రంలో కనిపిస్తున్న స్థలం నెల్లూరు రూరల్ పరిధిలోని 385 / 2 సర్వే నంబర్‌లో ఉంది. దీనికి సంబంధించిన పన్నులను చెల్లించకపోవడంతో బోర్డును నగరపాలక సంస్థ అధికారులు రెండు రోజుల క్రితం ఏర్పాటు చేశారు. దీన్ని స్వాధీనం చేసుకున్నామని, సమాచారం కోసం అధికారులను సంప్రదించాలని అందులో పొందుపర్చారు. ప్రైవేట్ స్థలంలో బోర్డును చూసి ఆందోళనకు గురవడం యజమానుల వంతైంది.
ఇదేమి నిర్ణయమో..?
వాస్తవానికి ఖాళీ స్థలాలకు సంబంధించిన పన్ను బకాయిలను చెల్లించకపోతే నోటీసులను జారీ చేసి.. అప్పటికీ స్పందించకపోతే చట్ట ప్రకారం చర్యలు చేపడతారు. అయితే పన్నులు చెల్లించకపోతే ఏకంగా ప్రైవేట్ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామంటూ బోర్డులను నగరపాలక సంస్థ అధికారులు ఏర్పాటు చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. అధికారుల తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పలువురు పేర్కొంటున్నారు.
పన్ను కట్టరా.. అయితే అంతే..!
నెల్లూరు కార్పొరేషన్ దుర్మార్గ పోకడ
ఆస్తులను స్వాధీనం
చేసుకుంటామంటూ బోర్డుల ఏర్పాటు
బెదిరింపులతో భయభ్రాంతులకు
గురిచేస్తూ..
మంత్రి నారాయణ ఏకపక్ష నిర్ణయం
భగ్గుమంటున్న యజమానులు
Comments
Please login to add a commentAdd a comment