జగన్‌దే తుది నిర్ణయం
మాట్లాడుతున్న కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పక్కన చంద్రశేఖర్‌రెడ్డి, విజయకుమార్‌రెడ్డి తదితరులు
● డిప్యూటీ మేయర్ పోటీపై
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
నెల్లూరు(బారకాసు): నెల్లూరు నగరపాలక సంస్థలో ఖాళీగా ఉన్న డిప్యూటీ మేయర్ పదవి కోసం పోటీ చేసే విషయంలో తుది నిర్ణయం తమ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిదేనని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. రామ్‌జీనగర్‌లోని పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ కార్యాలయంలో పార్టీ నగర, రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం విజయకుమార్‌రెడ్డితో పాటు పలువురు కార్పొరేటర్లు, నేతలతో ప్రత్యేక సమావేశాన్ని కాకాణి గురువారం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డిప్యూటీ మేయర్ స్థానానికి ఎన్నికను ఫిబ్రవరి మూడున నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి నోటిఫికేషన్‌ను జారీ చేశారని చెప్పారు. ఎన్నికల్లో గెలుపొందిన 54 మంది కార్పొరేటర్లు తమ పార్టీకి చెందిన వారని, అయితే వీరిలో కొందరు ద్రోహం చేసి టీడీపీ పంచన చేరారని ఆరోపించారు. పలువురు కార్పొరేటర్లను బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి టీడీపీలో మంత్రి నారాయణ చేర్చుకున్నారని ధ్వజమెత్తారు. వీరందరూ వారి అంతరాత్మకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. కీలకమైన సమయంలో తమ పార్టీకి వీరు అండగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని పార్టీ అధిష్టానానికి వివరించనున్నామని, తదుపరి జగన్‌మోహన్‌రెడ్డి తీసుకునే నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామని తెలిపారు. టీడీపీ తరఫున డిప్యూటీ మేయర్ అభ్యర్థిని నిలబెట్టి తమ పార్టీ తరఫున విజయం సాధించిన వారితో గెలిపించుకుంటామని చెప్పడమంత దురదృష్టకర పరిస్థితి మరొకటి లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment