భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
నెల్లూరు రూరల్: భూముల రీ సర్వే, రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన సమస్యలను పరిష్కరించాలని ఇన్‌చార్జి కలెక్టర్ కార్తీక్ ఆదేశించారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో నెల్లూరు, ఆత్మకూరు డివిజన్ల పరిధిలోని తహసీల్దార్లు, సర్వేయర్లతో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రీసర్వే గ్రామసభల్లో వచ్చిన అర్జీలను ఆన్‌లైన్లో నమోదు చేసి పరిష్కారం చూపాలని సూచించారు. మండల స్థాయిలో పెండింగ్ అంశాలపై ఆర్డీఓలు రోజూ సమీక్షించాలని కోరారు. ప్రతి మంగళ లేదా బుధవారాల్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్, తహసీల్దార్ ప్రజలకు అందుబాటులో ఉండి సివిల్ భూ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. అర్జీల పరిష్కారంలో సాంకేతికంగా ఎదురయ్యే సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. నడికుడి – శ్రీకాళహస్తి రైల్వేలైన్ భూసేకరణ, నష్ట పరిహార వివరాలను కలెక్టరేట్‌కు ఫిబ్రవరి 15లోపు అందించాలని రాపూరు, పొదలకూరు తహసీల్దార్లకు సూచించారు. డీఆర్వో ఉదయభాస్కర్‌రావు, జిల్లా భూ సర్వే రికార్డుల ఏడీ నాగశేఖర్, కావలి, ఆత్మకూరు ఆర్డీఓలు వంశీకృష్ణ, పావని తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment