
అక్రమ కేసులను ధైర్యంగా ఎదుర్కొంటాం
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): అక్రమ కేసులను ధైర్యంగా ఎదుర్కొంటానే తప్ప భయపడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. డైకస్ రోడ్డులోని తన క్యాంప్ కార్యాలయం వద్ద విలేకరులతో గురువారం ఆయన మాట్లాడారు. తన నివాసం వద్ద నాలుగు రోజులుగా రేయింబవళ్లూ తన కోసం రక్షణగా నిలిచిన పార్టీ శ్రేణులను చూస్తే గర్వంగా ఉందని చెప్పారు. కార్యకర్తలకు అన్యాయం జరిగితే సంఘటితంగా అందరూ నిలబడతామనే స్ఫూర్తి నింపిన పార్టీ జిల్లా శ్రేణులకు హ్యాట్సాఫ్ చెప్పారు. కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్ని.. అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపాలని చూస్తే ప్రజలు తిరగబడి రోడ్లపైకి వస్తారన్నారు. తనపై మోపిన అక్రమ కేసు విషయంలో ఇది రుజువైందని చెప్పారు. పోలీసులు రోజుకొకర్ని తీసుకొచ్చి తప్పుడు కేసులు నమోదు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారని ఎద్దేవా చేశారు. పోలీస్ వ్యవస్థ పక్షపాతంగా వ్యవహరిస్తున్నా, న్యాయస్థానాల ద్వారా న్యాయం జరుగుతుందనే నమ్మకం తనకు ఉందని చెప్పారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తామంటున్నారని, ఈ ఉడత బెదిరింపులకు భయపడేవారెవరూ లేరని చెప్పారు. తనకు అండగా నిలిచిన రాష్ట్ర, జిల్లా నేతలు, కార్యకర్తలు, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజానీకానికి కృతజ్ఞతలను తెలియజేశారు.
కాకాణితో ప్రసన్న భేటీ
కాకాణి గోవర్ధన్‌రెడ్డితో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్ వీరి చలపతిరావు తదితరులు భేటీ అయ్యారు.
భారీగా మోహరించిన కార్యకర్తలు
కాకాణి గోవర్ధన్‌రెడ్డిని అరెస్ట్ చేస్తారనే ప్రచారంతో ఆయన ఇంటి వద్ద నేతలు, కార్యకర్తలను గురువారం రాత్రి భారీగా మోహరించారు. అక్రమ కేసులో తమ నాయకుడ్ని అరెస్ట్ చేస్తే ఊరుకునేదిలేదని నినాదాలు చేశారు. అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారనే సంకేతాలతో డైకస్‌రోడ్డు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పొద్దుపోయాక కాకాణి నివాసానికి ఆయా గ్రామాల నుంచి కార్యకర్తలు చేరుకుంటున్నారు.

అక్రమ కేసులను ధైర్యంగా ఎదుర్కొంటాం