
మద్యం షాపులో తాగుబోతుల వీరంగం
● ముగ్గురిపై దాడి
● యువకుడికి తీవ్రగాయాలు
పొదలకూరు: పట్టణంలోని వెంకటేశ్వర మద్యం షాపులో శనివారం నలుగురు తాగుబోతులు వీరంగం సృష్టించారు. కుర్చీలను విరగ్గొట్టడంతోపాటు మద్యం తాగుతున్న వారిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడి గాయపరిచారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. మండలంలోని మహ్మదాపురం ఎస్సీ కాలనీకి చెందిన విజయ్‌కుమార్, బత్తులపల్లి గ్రామానికి చెందిన వాసు, అఖిల్, వెంకట్ నెల్లూరులో పనిచేస్తుంటారు. వీరు మద్యం తాగేందుకు వచ్చి ఇష్టానుసారంగా ప్రవర్తించారు. ముందుగా ఉప్పుటూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తిపై దాడి చేయడంతో అతను కిందిపడిపోయాడు. పట్టణానికి చెందిన చాంద్‌పై దాడి చేయగా అతడు భయపడి వెళ్లిపోయాడు. తర్వాత అదే షాపులో మద్యం తాగేందుకు వెళ్లిన పట్టణానికి చెందిన మెకానిక్ భక్తనార్‌పై విచక్షణారహితంగా బీరు బాటిల్, ఇటుకరాయితో దాడికి పాల్పడ్డారు. అతడికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఎస్సై హనీఫ్ ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని సీహెచ్‌సీకి తరలించారు. మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు పంపారు. భక్తనార్‌కు తలపై ఆరు కుట్లు పడినట్టు స్థానికులు వెల్లడించారు. నిందితుల్లో ఒకరిద్దరు బౌన్స ర్లుగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. వారి వల్ల చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు. నిందితులను ఎస్సై అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

మద్యం షాపులో తాగుబోతుల వీరంగం