‘చెప్పినట్లు వినకుంటే స్టేషన్‌కు ఎత్తుకెళ్లి తాట తీస్తా. | - | Sakshi
Sakshi News home page

నాకే ఎదురు మాట్లాడుతావా.. నీ అంతు చూస్తా..

Published Thu, Sep 21 2023 1:28 AM | Last Updated on Thu, Sep 21 2023 3:08 PM

- - Sakshi

సాక్షి, పుట్టపర్తి: శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు అధికారి భిన్నంగా వ్యవహరిస్తున్నాడని, సివిల్‌ పంచాయితీలో జోక్యం చేసుకుని తమను ఇబ్బంది పెడుతున్నాడని రొద్దం మండలం పెద్ద కోడిపల్లికి చెందిన అనిత, నాగరంగమ్మ, చిట్టి, అపర్ణ తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. తమపై రుబాబు చేస్తూ.. ముడుపులు ముట్టజెప్పిన వారి వైపు నిలుస్తున్నారని, న్యాయం అడిగిన తమను ‘చెప్పినట్లు వినకుంటే స్టేషన్‌కు ఎత్తుకెళ్లి తాట తీస్తా. నాకే ఎదురు మాట్లాడుతావా.. నీ అంతు చూస్తా..’అంటూ దౌర్జన్యం చేశాడని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. బుధవారం ఎస్పీ కార్యాలయానికి వచ్చి తమ గోడు వెల్లబోసుకున్నారు.

అసలు సంగతి ఇదే..
రొద్దం మండలం పెద్ద కోడిపల్లికి చెందిన అనిత, నాగరంగమ్మ, చిట్టి, అపర్ణ తదితరుల నివాసాల నుంచి గడ్డి వాములకు వెళ్లేందుకు గ్రామకంఠం దారి ఎప్పటి నుంచో ఉంది. అయితే మూడేళ్లుగా అదే గ్రామానికి చెందిన నరసింహులు అనే వ్యక్తి దారి కోసం వదిలిన భూమి తనదేనని చెబుతున్నాడు. ఈ దారిలో ఎవరూ నడవకుండా ఆంక్షలు విధిస్తున్నాడు. అంతేకాకుండా ఓ పట్టా తీసుకొచ్చి కోర్టులో పిటిషన్‌ వేశాడు. దీంతో సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అయితే సదరు మహిళలు రెవెన్యూ కార్యాలయంలో విచారణ చేయగా, నరసింహులు నకిలీ పట్టా సృష్టించినట్లు తేలింది.

దీంతో టీడీపీ మద్దతుదారుడైన నరసింహులు పెనుకొండ సీఐ కరుణాకర్‌ను ఆశ్రయించాడు. విషయం కోర్టు పరిధిలో ఉన్నా సీఐ కరుణాకర్‌ జోక్యం చేసుకుని దారిలో వెళ్లకూడదని మహిళలను గట్టిగా హెచ్చరించారు. దీంతో వారు దిక్కు తోచని స్థితిలో బుధవారం ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ఎస్పీ మాధవరెడ్డి అందుబాటులో లేకపోవడంతో డీఎస్పీ (ఏఆర్‌) విజయ్‌కుమార్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.

తమ ఇంటికి వెళ్లేందుకు దారి లేకుండా చేస్తోన్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ నాయకుల అండతో పెద్ద కోడిపల్లి గ్రామానికి చెందిన నరసింహులు.. గ్రామకంఠం భూమికి నకిలీ పట్టా సృష్టించి పెనుకొండ సీఐ కరుణాకర్‌ను తమపై ఉసికొల్పుతున్నారని తెలిపారు. అయితే తాను ఎస్పీకి విషయం చెబుతానని.. సోమవారం ‘స్పందన’లో మరోసారి ఫిర్యాదు చేయాలని డీఎస్పీ విజయ్‌కుమార్‌ వారికి చెప్పి పంపించారు.

టీడీపీ నేతలు దౌర్జన్యం చేస్తున్నారు
గ్రామంలో కొందరు పనిగట్టుకుని మాకు దారి లేకుండా చేయాలని చూస్తున్నారు. నకిలీ పట్టా సృష్టించి పోలీసులను అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉన్నామని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గొడవల్లో మహిళలు అని కూడా చూడకుండా టీడీపీ నేతలు దౌర్జన్యాలకు దిగుతున్నారు.
– అనిత

సీఐ అండతో రెచ్చిపోతున్నారు
శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులే అవినీతిపరులకు మద్దతు పలుకుతున్నారు. స్థానిక పోలీసులపై నమ్మకం లేక ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించాం. పెనుకొండ సీఐ కరుణాకర్‌ అండ చూసుకుని మా గ్రామంలో నరసింహులు వర్గీయులు రెచ్చిపోతున్నారు. ఎస్పీ గారు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నాం.
– చిట్టి

మహిళలని కూడా చూడలేదు
మా ఇంటి నుంచి గడ్డి వాములోకి వెళ్లేందుకు దారి లేకుండా చేశారు. దారికి అడ్డంగా బండలు పాతడానికి వచ్చారు. మా ఇంట్లో మగవారు లేకపోవడంతో అడ్డగించాం. మహిళలు అని కూడా చూడకుండా చితకబాదారు. రొద్దం పోలీసులకు ఫిర్యాదు చేశాం. సీఐ జోక్యంతో రొద్దం పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. మా ఫిర్యాదు కూడా స్వీకరించలేదు.
– అపర్ణ

నరసింహులు నుంచి ప్రాణహాని ఉంది
నకిలీ పట్టా సృష్టించి.. కోర్టులో పిటిషన్‌ వేశారు. రెవెన్యూ అధికారులు పట్టా రికార్డుల్లో లేదని తేల్చి చెప్పారు. కొందరు టీడీపీ నేతల అండతో నరసింహులు వర్గీయులు మాపై దాడి చేసే అవకాశం ఉంది. అతని నుంచి ప్రాణహాని ఉంది. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు.
– నాగరంగమ్మ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement