మేమంటే లెక్కేలేదు
సాక్షి, పుట్టపర్తి
అతుకుల బొంత... రోజూ చింత అన్నట్లుగా సాగుతోంది కూటమి నేతల సమన్వయం. పైకి అంతా బాగుందంటూ చెబుతున్న నేతలే ఇప్పుడు తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ పంచాయితీ పెట్టారు. బీజేపీ, జనసేన నేతలతో పాటు ధర్మవరం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కూడా ఆవేదన వెళ్లగక్కడం చర్చనీయాంశంగా మారింది.
ప్రతి నియోజకవర్గంలోనూ కుమ్ములాటలు
జిల్లా ఇన్‌చార్జి మంత్రి హోదాలో అనగాని సత్యప్రసాద్ సోమవారం తొలిసారి జిల్లాకు వచ్చారు. ఉదయం సాయి ఆరామం ఫంక్షన్‌లో హాలులో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్, సవిత, ఎంపీ బీకే పార్థసారథి, ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, కందికుంట వెంకట ప్రసాద్, పల్లె సింధూరారెడ్డి, పరిటాల సునీతతో పాటు మూడు పార్టీల జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు హాజరయ్యారు. అయితే ప్రతి నియోజకవర్గంలో మూడు పార్టీల మధ్య కుమ్ములాటలు బహిర్గతమయ్యాయి. నేతలు ఒకరిపై మరొకరు పితూరీలు చెప్పుకొచ్చారు. తొలిసారి ఇన్‌చార్జ్ మంత్రి హోదాలో జిల్లాకు వస్తే.. ‘ప్రాధాన్యం’ పంచాయితీ ఏందని సత్యప్రసాద్ తలపట్టుకుని కూర్చున్నారు.
తెగని ధర్మవరం పంచాయితీ..
ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారని పరిటాల శ్రీరామ్, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఇన్‌చార్జ్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వంలో పని చేసిన అధికారులను వద్దని చెప్పినా వినకుండా తీసుకొస్తున్నారని ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా తమ అధినేత రెడ్ మార్క్ వేసిన అధికారులను...ఇప్పటికీ అదే స్థానంలో కొనసాగించడం బాగోలేదని వాపోయారు. ఇక ప్రభుత్వంలో భాగంగా ఉన్నప్పటికీ తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని జనసేన నేత చిలకం మధుసూదన్‌రెడ్డి కూడా నిరసన గళం వినిపించారు. ఉద్యోగుల బదిలీల్లో తమకు ప్రాధాన్యం ఇవ్వలేదని.. మంత్రి సత్యకుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఇన్‌చార్జ్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.
పెనుకొండలో ఆరని అసమ్మతి సెగలు..
మంత్రి సవిత, ఎంపీ పార్థసారథి వర్గీయుల మధ్య విభేదాల గురించి సమన్వయ కమిటీ సమావేశంలో పలువురు పెనుకొండ నేతలు ప్రస్తావించారు. అయితే పార్థసారథి చాలా సీనియర్ అని.. అన్నీ ఆయనకు తెలుసని మంత్రి సవిత సమాధానం ఇచ్చారు. పార్థసారథి కూడా వెంటనే కల్పించుకుని... మంత్రి సవిత మాటల్లో చెప్పడం వేరు.. క్షేత్రస్థాయిలో చేస్తున్న పనులు వేరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టారని బీకే పార్థసారథి ఇన్‌చార్జి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు మద్యం దుకాణాల విషయంలోనూ తమ వర్గానికి ప్రాధాన్యం దక్కలేదని పార్థసారథి వివరించారు.
వాపోయిన మిత్రపక్షాలు..
సమావేశంలో కదిరి, మడకశిర, పుట్టపర్తి నియోజకవర్గాల్లోనూ కూటమి పార్టీల మధ్య ప్రాధాన్యం పంచాయితీ నడిచింది. టీడీపీ నేతలు అన్నీ తామై వ్యవహరిస్తున్నారని.. తమ పార్టీ నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని జనసేన, బీజేపీ నేతలు ఇన్‌చార్జ్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అందరి ఆవేదనలు విన్న తర్వాత.. ఏం చెప్పాలో తెలియని ఇన్‌చార్జ్ మంత్రి అనగాని...అయినాగానీ కలసికట్టుగా సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు.
ఇన్‌చార్జ్ మంత్రి అనగాని ముందుకు కూటమి నేతల పంచాయితీ
తమను గుర్తించడం లేదని
బీజేపీ నేతల ఆవేదన
వేదికలపైకి పిలవలేదని
జనసేన కార్యకర్తల ఆందోళన
ధర్మవరంలో తమను విస్మరిస్తున్నారని పరిటాల శ్రీరామ్ ఆక్రోశం
జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ముందే
నేతల మాటల యుద్ధం
‘మమ్మల్ని పట్టించుకోవడం లేదు.. మేమంటే లెక్కేలేదు. మమ్మల్ని వేదికలపైకి పిలవడం లేదు. ప్రభుత్వ కార్యక్రమాల సమాచారమే ఇవ్వడం లేదు. కూటమిలో మేమూ ఉన్నామన్న స్పృహే వారికి లేదు.. ఉద్యోగుల బదిలీల్లోనూ మాకు ప్రాధాన్యం ఇవ్వలేదు.. మేమూ కూటమిలో భాగమనే విషయం గుర్తించండి’
– సోమవారం పుట్టపర్తిలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎదుట బీజీపీ, జనసేన నేతల ఆవేదన ఇది.
Comments
Please login to add a commentAdd a comment