No Headline
ఇప్పటికే భవనాల కూల్చివేతతో దాతల పేర్లు మాయమయ్యే పరిస్థితి వచ్చింది. ఈ వైనాన్ని దాతలు సహించలేకపోతున్నారు. దీనికి తోడు ఇప్పుడు స్థానిక రాజకీయ నేతలు, జిల్లా ఉన్నతాధికారులు మళ్లీ దాతల సాయాన్ని కోరుతున్నారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. రథసప్తమి మహోత్సవాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న క్రమంలో జిల్లాకు, నగరానికి చెందిన వర్తక, వ్యాపార రంగాల ప్రతినిధులు తమ వంతుగా ఆలయంలో ఉత్సవ నిర్వహణకు విరాళాలివ్వాలని, లేదంటే తగినట్లుగా సహకారం ఇవ్వాలంటూ వేడుకోవడం జిల్లా వ్యాప్తంగా చర్చలకు దారితీస్తోంది.
అరసవల్లి:
రథసప్తమి వేడుకల నిర్వహణ పేరుతో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు విస్మయం గొలుపుతోంది. అరసవల్లి ఆదిత్య క్షేత్ర ప్రగతిలో దాతల పాత్ర అత్యంత కీలకమైనది. ఈ క్షేత్రం దేవేంద్ర ప్రతిష్టితమే అయినా 1999లో వరుదు బాబ్జీరావు అప్పట్లోనే రూ.40 లక్షలు ఖర్చు పెట్టి ప్రధాన విమాన గోపురాన్ని నిర్మించాక ఆలయ శోభ ద్విగుణీకృతమైంది. ఒక విధంగా ఆలయ అభివృద్ధిలో దాతల ప్రస్థానం అప్పటి నుంచే ఆరంభమైందని కూడా చెప్పవచ్చు. కాలక్రమేణా చాలా మంది దాతలు స్థాయిని బట్టి రూ.లక్షల్లో విరాళాలిచ్చి ఆలయ స్వరూపం మారడానికి దోహదపడ్డారు. ప్రముఖ వ్యాపారి గ్రంథి మల్లికార్జునరావు (జీఎంఆర్) భాగస్వామ్యంతో అనివెట్టి మండపం, ట్రైమెక్స్ కంపెనీ అధినేత కోనేరు రాజేంద్రప్రసాద్ అన్నదాన మండపం, తర్వాత జిల్లాకు చెందిన ఎంతో మంది వ్యాపారులు, రాజకీయ ప్రముఖులు, విద్యావేత్తలు తమ పేర్లు, తమ పెద్దల పేర్లతో రూ.లక్షల విలువైన జింకు రేకు షెడ్లు, వసతి గదుల నిర్మాణాలు, మరుగుదొడ్ల కాంప్లెక్సులు, నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష చొప్పున విరాళాలిచ్చి తద్వారా ఆలయ అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు. 2024 వరకు దాతల ప్రోత్సాహంతోనే ఆలయ పరిసరాల్లో కొత్త కొత్త నిర్మాణాలు చేపట్టారు. ఇవన్నీ భక్తులకు సౌకర్యం కల్పించడానికి ఇతోధికంగా దోహదపడ్డాయి. కానీ 2025 రథ సప్తమికి సీన్ అంతా మారిపోయింది. ఎంతో మంది దాతలు భక్తితో ఇచ్చిన సొమ్ముతో కట్టిన నిర్మాణాలన్నీ కూల్చేశారు.
మళ్లీ దాతల కోసం వెంపర్లాట..!
దాతల పేర్లు లేకుండా చేసి..
అరసవల్లిలో దాతలు ఇచ్చిన నిర్మాణాల కూల్చివేత
కొత్త నిర్మాణాలకు మళ్లీ దాతల సహకారానికి విజ్ఞప్తి
ప్రభుత్వ తీరుపై భక్తుల విస్మయం
ఆలయానికి విరాళాలిచ్చిన దాతలు తమ పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని ఎంతో ఆశపడతారు. 2010 నుంచి ఆలయంలో వివిధ స్థాయిల్లో దాతలు రూ.లక్షల విరాళాలతో ఆలయ పరిసరాల్లో నిర్మాణాలు చేపట్టారు. అలాగే 2020 నుంచి ఈ రకమైన దాతల ప్రోత్సాహం మరింత రెట్టింపయ్యింది. తాజాగా అరసవల్లి ఆలయంలో రథసప్తమి మహోత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించడంతో ఒక్కసారిగా ఈ నెల రోజుల్లోనే ఆలయ పరిసరాల్లో దాతల డబ్బుతో చేపట్టిన నిర్మాణాలు, జింకు షెడ్లన్నీ కూల్చివేసేశారు. స్థానిక ఎమ్మెల్యే, కేంద్ర, రాష్ట్ర మంత్రుల ఆదేశాల మేరకు అరసవల్లి ఆలయ రూపురేఖలు మార్చే క్రమంలో ‘ప్రసాద్’ స్కీమ్ వర్తింపజేస్తామంటూ ప్రకటించారు. దీంతో రూ.100 కోట్ల వరకు నిధులు వస్తాయని ప్రకటనలు గుప్పిస్తూ ముందుగా ఎలాంటి నోటీసులు లేకుండానే దాతలకు సమాచారం ఇవ్వకుండానే మొత్తం నిర్మాణాలు కూల్చేశారు. దీంతో అన్నదాన మండపం, ప్రసాదాల తయారీ, విక్రయాల కౌంటర్లు, అలాగే మరుగుదొడ్ల కాంప్లెక్స్, సుమారు ఆరు షెడ్లు కూల్చేశారు. కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా ఆలయానికి ముందున్న నిర్మాణాలు, షెడ్లు కూల్చివేయడంతో దాతల మనోభావాలు దెబ్బ తిన్నాయి. తమ వారి జ్ఞాపకార్థం చేపట్టిన నిర్మాణాలకు విలువ లేకుండా పోయిందనే ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి జరిగితే మంచిదే కానీ ఎలాంటి ప్రత్యామ్నాయం లేకుండా కూల్చివేతలకు దిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రస్తుత అరసవల్లి క్షేత్రంలో అన్నదాన ప్రసాదం, ఇతర ప్రసాదాల విక్రయ భవనాలు చూస్తే అర్థమైపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment