ఫిబ్రవరి 27న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక
శ్రీకాకుళం పాతబస్టాండ్:
ఉత్తరాంధ్ర పరిధిలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుందని, దీనికి సంబంధించిన అన్ని రకాల ప్రక్రియలను జిల్లా అధికార యంత్రాంగం మొదలు పెట్టిందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ఎన్నికల సంఘం వెలువరించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 29వ తేదీ నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని అన్నారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ 24 గంటల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, పబ్లిక్ ప్రాంతాల్లో రాజకీయ పరమైన పోస్టర్లు, ఫొటోలు తొలగించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ తుది ఓటర్ల జాబితా ప్రకారం జిల్లా పరిధిలో 4829 మంది ఓటర్లు ఉన్నారని, వారిలో పురుషులు 3275, కాగా మహిళా ఓటర్లు 1554 మంది ఉన్నారని పేర్కొన్నారు. అర్హత కలిగిన వారు నామినేషన్ ప్రక్రియ ముగియడానికి పది రోజుల ముందు వరకు అనగా జనవరి 31వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు వీలుగా పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు సమకూరుస్తున్నామని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి పటిష్ట అమలుకు చర్యలు తీసుకున్నామని, దానిలో భాగంగా ఎంపీడీఓ, వీడియో గ్రాఫర్ తో కూడిన 30 ఎంసీసీ బృందాలను మండలానికి ఒకటి చొప్పున నియమించామని కలెక్టర్ చెప్పారు. అలాగే మండలానికి ఒకటి చొప్పున తహసీల్దార్, ఎస్‌ఐ, వీడియో గ్రాఫర్‌తో 30 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు.
జిల్లాలో 29 నుంచే
ఎన్నికల కోడ్: కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment