చెన్నై: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయానికి నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఎస్పీ బాలు అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎస్పీ భౌతిక కాయానికి నివాళులర్పించి.. కుమారుడు ఎస్పీ చరణ్‌ను ఓదార్చారు. అనంతరం సాక్షితో మాట్లాడుతూ.. 'నెల్లూరులో గానగంధర్వుడికి తగిన స్థాయిలో జ్ఞాపకం ఏర్పాటుకు సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తాము. ఆయన లేని లోటు ఎవరూ పూడ్చలేనిది. (గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత)
ఆయన నెల్లూరు వాసి కావడం నెల్లూరు వ్యక్తిగా గర్వపడుతున్నాం. అన్ని భాషలలో అన్నివేల పాటలు పాడిన వ్యక్తి ఎవరూ లేరు, ఇక ఉండబోరు. బాలు కుటుంబానికి సీఎం వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తరపున ఘన నివాళి అర్పించాము' అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిలు కూడా ఎస్పీ బాలుకు పార్థివ దేహానికి నివాళులర్పించి, శ్రద్ధాంజలి ఘటించారు. (బాలు తీరని కోరిక నాకు తెలిసి ఒకే ఒకటి..)
కాగా.. తిరువళ్లూరు జిల్లా తామరపాక్కంలోని ఎస్పీబీ గార్డెన్స్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఎస్పీబీ భౌతిక కాయాన్ని ఫామ్‌హౌస్‌లో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. గాన గంధర్వుడు బాలును చివరిసారిగా చూసేందుకు అభిమానులు, తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖలు తరలి వస్తున్నారు. శనివారం ఫామ్‌హౌస్‌లోనే ఉదయం 10.30 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment