నల్గొండ: కొద్ది రోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న యువకుడికి అతి త్వరలోనే ఆపరేషన్ జరగాల్సి ఉంది. కానీ అంతలోనే ఆకస్మికంగా మృత్యువాతపడ్డాడు. ఈ హృదయవిదారకర ఘటన బుధవారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది. చౌటుప్పల్‌లోని గాంధీపార్కుకు చెందిన బాలగోని నాగేష్(38) స్థానికంగా రిఫ్రిజరేటర్ షాప్ నిర్వహిస్తున్నాడు. నాగేష్‌కు కొద్ది రోజుల క్రితం కిడ్నీ సమస్య తలెత్తింది. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందాడు.
ప్రస్తుతం స్థానిక ప్రభుత్వాస్పత్రిలో డయాలసీస్ చేయించుకుంటున్నాడు. కుమారుడికి కిడ్నీ ఇచ్చేందుకు తల్లి దేవకమ్మ ముందుకు వచ్చింది. అందుకు అవసరమైన అన్ని రకాల వైద్య పరీక్షలు సైతం పూర్తయ్యాయి. కిడ్నీ మార్పిడి చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సంబంధిత కుటుంబ సభ్యులకు నిమ్స్ ఆస్పత్రి వైద్యులు సైతం సూచించారు.
అందులో భాగంగా ఈనెల 10 లేదా 12న ఆపరేషన్ నిర్వహించేందుకు వైద్యులు నిర్ణయించారు. ఆ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి దాటాక నాగేష్‌కు అకస్మాత్తుగా శ్వాస సంబంధిత ఇబ్బంది తలెత్తింది. వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స నిర్వహించి ఆక్సిజన్ పెట్టారు.
అనంతరం మెరుగైన వైద్య కోసం హైదరాబాద్ తీసుకువెళ్తుండగా పరిస్థితి విషమించి మార్గమధ్యలో మృతిచెందాడు. త్వరలోనే ఆపరేషన్ జరిగితే సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారి కలిసిమెలిసి తమ మధ్య తిరుగుతావనుకుంటే కానరాని లోకాలకు వెళ్లిపోయావా అంటూ భార్యాపిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment