గుకేశ్‌కు శుభాకాంక్షల వెల్లువ | Sakshi
Sakshi News home page

గుకేశ్‌కు శుభాకాంక్షల వెల్లువ

Published Tue, Apr 23 2024 8:30 AM

- - Sakshi

సాక్షి, చైన్నె: భారత యువ చదరంగ క్రీడాకారుడు గుకేశ్‌ దొమ్మరాజు ప్రఖ్యాత ప్రపంచ చెస్‌ ఫెడరేషన్‌ టోర్నమెంట్‌లో విజయం సాధించడంతో తమిళనాడులోని రాజకీయ పార్టీల నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం స్టాలిన్‌ పేర్కొంటూ, గతంలో భారత గ్రాండ్‌ మాస్టర్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ సాధించిన ఘనతను ప్రస్తుతం అతి పిన్న వయసులో చరిత్ర సృష్టించే విధంగా టైటిల్‌ను గుకేశ్‌ సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. గతంలో తనను గుకేశ్‌ కలిసిన సందర్భంగా తీసిన ఫొటోను తన సామాజిక మాధ్యమంలో సీఎం స్టాలిన్‌ షేర్‌ చేశారు. రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ పేర్కొంటూ, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నా రు. గుకేశ్‌ టైటిల్‌ దక్కించుకోవడం దేశానికే కాదు తమిళనాడుకు గర్వకారణంగా పేర్కొన్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి, బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, తమిళ మానిల కాంగ్రెస్‌ నేత జీకే వాసన్‌ తదితరులు సైతం గుకేష్‌కు అభినందనలు తెలియజేశారు. విశ్వనాథన్‌ ఆనంద్‌ సైతం శుభాకాంక్షలు తెలుపుతూ అత్యంత పిన్న వయస్సులో ఈ టైటిల్‌ దక్కించుకోవడం అభినందనీయమన్నారు. ఇదిలా ఉండగా కెనడా వేదికగా జరిగిన క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో టైటిల్‌ నెగ్గి చరిత్ర సృష్టించిన గుకేష్‌ తమిళనాడుకు చెందిన తెలుగు కుటుంబానికి చెందిన కుర్రోడు అనే విషయం తెలిసిందే. చైన్నెలో స్థిరపడ్డ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తూర్పు గోదా వరి జిల్లాకు చెందిన తెలుగు కుటుంబం రజనీకాంత్‌, పద్మ దంపతుల కుమారుడు గుకేశ్‌. అతి చిన్న వయస్సులో భారత గ్రాండ్‌ మాస్టర్‌గా ప్రస్తుతం చరిత్ర సృష్టించిన గుకేశ్‌ చైన్నె శివారులోని అయనంబాక్కంలోని ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నాడు. రజనీకాంత్‌ ఈఎన్‌టీ వైద్యుడు కాగా, పద్మ మైక్రోబయాలజిస్టుగా ఉన్నారు. చైన్నెకు టైటిల్‌తో రాబోతున్న గుకేశ్‌కు ఘన స్వాగతం పలికేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

గుకేశ్‌

Advertisement
Advertisement