రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

Published Sat, May 25 2024 12:05 PM

-

అన్నానగర్‌: రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. తిరువారూర్‌ జిల్లా తిరుతురపూండి విహారల్‌ వీధికి చెందిన మణికంఠన్‌ (33) గురువారం రాత్రి మన్నార్‌గుడి నుంచి బైకులో తిరుత్తరపూండి వైపు బయలుదేరాడు. అదే సమయంలో తిరుతురపూండి మాదాపురానికి చెందిన రాబర్ట్‌ (38), రాజ్యలక్ష్మితో బైకులో మాదాపురం నుంచి పల్లంకోయిల్‌కు వెళుతున్నారు. ఆ సమయంలో మణికంఠన్‌ పల్లంగోవిల్‌ సమీపంలోని సుమతాంగి అనే ప్రాంతంలో ఎదురుగా ఉన్న కారును తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న రాబర్ట్‌ బైకును ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో మణికంఠన్‌, రాబర్ట్‌, రాజ్యలక్ష్మి కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మణికంఠన్‌, రాబర్ట్‌ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన రాజ్యలక్ష్మి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి మృతులు మణికంఠనన్‌, రాబర్ట్‌ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పాము కాటుకు వృద్ధుడి మృతి

తిరువళ్లూరు: ఇంట్లో చొరబడిన పామును చంపడానికి యత్నించిన వృద్ధుడు పాము కాటుకు బలైన సంఘటన ఆరంబాక్కంలో విషాదం నింపింది. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి తాలుకా ఆరంబాక్కం ఎల్‌ఆర్‌ మేడు ఎస్టీ కాలనీకి చెందిన మునస్వామి(63) కుటుంబసభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. ఈ క్రమంలో గత 21వ తేదీ రాత్రి ఏడుగంటల సమయంలో ఇంట్లోకి నాగుపాము చొరబడింది. పామును గుర్తించిన కుంటుబసభ్యులు బయటకు వెళ్లిపోగా మునస్వామి పామును చంపడానికి యత్నించాడు. ఈ సమయంలో అతడు పాము కాటుకు గురి కావడంతో బంధువులు గుమ్మిడిపూండి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక చిక్సిత అందించిన తరువాత 108 ద్వారా చైన్నె స్టాన్లీ వైద్యశాలకు తరలించగా అక్కడ చిక్సిత పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. ఆరంబాక్కం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఆలయ వేడుకల్లో అపశృతి

–మేక రక్తం తాగి పూజారి మృతి

సేలం: ఈరోడ్‌ సమీపంలో జరిగిన ఆలయ ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. మేక రక్తం తాగిన పూజారి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈరోడ్‌ సమీపంలోని గోపిచెట్టి పాళయం వద్ద ఉన్న నల్లకౌండం పాళయంకు చెందిన పళనిస్వామి (56). ఈయన కొలప్పలూర్‌ చెట్టియం పాళయంలోని అనమలైయార్‌ ఆలయ పూజారి. ఆలయంలో ఉత్సవాల సందర్భంగా గురువారం ఆలయ ప్రాంగణంలో భక్తులు మేకలను బలి ఇచ్చారు. మేకల రక్తాన్ని పళనిస్వామి సహా ఐదుగురు పూజారులు తాగారు. కొంతసేపటికి పళనిస్వామి వాంతులు చేసుకుని స్పృహతప్పి పడిపోయాడు. స్థానికులు అతన్ని గోపిచెట్టి పాళయం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పళనిస్వామిని పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతిచెందినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement