షణ్ముఖర్‌కు పుష్పాభిషేకం
తిరుత్తణి: తిరుత్తణి మురుగన్ ఆలయంలో స్కంధషష్టి వేడుకల్లో ప్రధానమైన పుష్పాభిషేకం గురువారం సాయంత్రం కోలాహలంగా నిర్వహించారు. వేల సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో నవంబర్ 2న స్కంధషష్టి వేడుకలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. వేడుకలు సందర్భంగా మూలవర్లకు రోజూ విశేష అభిషేక ఆరాధన పూజలు నిర్వహిస్తున్నారు. కావడి మండపంలో వళ్లి, దేవసేన సమేత షణ్ముఖర్‌కు లక్షార్చన పూజలు జరుగుతున్నాయి. వేడుకల్లో 6వ రోజైన గురువారం స్కంధషష్టి వేడుకల్లో ప్రదానమైన సూరసంహారం మురుగన్ ఆలయాల్లో నిర్వహిస్తారు. అయితే తిరుత్తణి మురుగన్ ఆలయంలో అందుకు భిన్నంగా పుష్పాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. మురుగన్ సూరపద్ముని హతమార్చి శాంతిమయంగా కొలువైన కొండగా తిరుత్తణి ఆలయం అంటూ పురాణాలు చెబుతున్న క్రమంలో ఈ ఆలయంలో పుష్పాభిషేకం నిర్వహిస్తారు. ఆ ప్రకారం తిరుత్తణి బస్టాండు వద్దున్న సుందర వినాయకస్వామి ఆలయం నుంచి ఆలయ నిర్వాహకులు, భక్తలు, పువ్వుల వ్యాపారులు సంయుక్తంగా మూడు టన్నుల పుష్పాల బుట్టలను ఊరేగింపుగా కొండకు మెట్లు మార్గంలో మేళ తాళాలతో తరలించారు. కావడి మంపడంలో వల్లి దేవసేన సమేత ఉత్సవర్లు షణ్ముఖర్‌కు ఆలయ అర్చకులు పుష్పాభిషేకం చేపట్టి చివరగా మహాదీపారాధన పూజలు చేశారు. ఈ సందర్భంగా కావడి మండపంలో గుమిగూడిన భక్తజనం హారంహర భక్తి పులకింపులతో స్వామి దర్శనం చేసి మొక్కుకున్నారు. స్వామికి అభిషేకం చేసిన పువ్వులను భక్తులు పోటీపడి తీసుకెళ్లారు. వేడుకలు సందర్భంగా డీఎస్పీ కందన్ ఆధ్వర్యంలో 100 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. శుక్రవారం ఉదయం స్వామికి కల్యాణోత్సవంతో స్కంధషష్టి వేడుకలకు ముగింపు పలుకుతారు.
Comments
Please login to add a commentAdd a comment