
సాక్షి, చెన్నై : ‘తన వివాహానికి కామరాజర్ హాజరయ్యేందు గాను.. ఏకంగా వేదికనే మార్చేశారు’ అని సీఎం ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. కొళత్తూరులో ముఖ్యమంత్రి సమక్షంలో గురువారం తొమ్మిది జంటలకు వివాహాలు జరిగాయి.
తన నియోజకవర్గం పరిధిలోని కొళత్తూరులో ఆధునీకరించిన దివంగత మాజీ సీఎం కామరాజర్ కమ్యూనిటీ హాల్‌ను ఈ సందర్భంగా సీఎం ప్రారంభించారు. అలాగే, రూ. 2.83 కోట్లతో చేపట్టనున్న పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 9 జంటలకు వివాహాలు జరిగాయి. వధూవరులకు బీరువా, మంచం, మిక్సీ వంటి 33 రకాల వస్తువులను సారెగా సీఎం అందజేశారు.
కామరాజర్ కోసం..
తన వివాహం కోసం తేనాంపేట డీఎంకే ప్రధాన కార్యాలయం సమీపంలోని ఓ కల్యాణ మండపాన్ని వేదికగా తొలుత ఎంపిక చేశారని స్టాలిన్ గుర్తు చేశారు. ఇక్కడ అన్ని ఏర్పాట్లూ జరిగాయని, అయితే చివరి క్షణంలో కామరాజర్ కోసం వేదికను మార్చాల్సి వచ్చిందని తెలిపారు. తన వివాహానికి హాజరు కాలేని పరిస్థితుల్లో తీవ్ర అనారోగ్యంతో కామరాజర్ ఉన్నట్టు పేర్కొన్నా రు. తనకు ఆశీస్సులు అందించాలన్న ఆశగా ఉన్నా, ఆరోగ్యం సహకరించడం లేదన్న ఆవేదనను కామరాజర్ వ్యక్తం చేశారని గుర్తు చేశారు.
దీంతో తనకు కామరాజర్ ఆశీస్సులు ఉండాలన్న సంకల్పంతో ఆయన ఇంటికి సమీపంలోని ఉమ్మడియాస్ మైదానంలో ఆగమేఘాలపై తన తండ్రి, దివంగత కరుణానిధి వేదిక సిద్ధం చేయించారని వివరించారు. తన వివాహ వేదికపైకి నేరుగా కారులోనే వచ్చి మరీ కామరాజర్ ఆశీస్సులు అందించారని ఆనందం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: ప్రధాని ముందే తమిళనాడు డిమాండ్లను వినిపించిన సీఎం స్టాలిన్