సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య (ఎంబీబీఎస్) ప్రవేశాల్లో అడ్డదారులు తొక్కే మెడికల్ కాలేజీలపై నిషేధం విధిస్తామని జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) హెచ్చరించింది. తప్పుడు పద్దతుల్లో ఇచ్చే మొదటి సీటుకు రూ.కోటి, రెండో సీటుకు రూ.2 కోట్లు జరిమానా విధిస్తామని.. మరోసారి తప్పు చేస్తే తదుపరి ఏడాది సంబంధిత మెడికల్ కాలేజీని నిషేధిస్తామని స్పష్టం చేసింది. మెడికల్ అడ్మిషన్లు తదితర అంశాలపై గెజిట్ నోటిఫికేషన్లను జారీచేసింది.
బ్లాక్ చేసి అమ్ముకుంటూ..
దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలు ఎంబీబీఎస్ సీట్లను బ్లాక్ చేసి కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్న ఉదంతాలు ఎన్నో బయటపడుతున్నాయి. ముఖ్యంగా బీ కేటగిరీ సీట్లను ఎన్నారై సీట్లుగా మార్చుకోవడం, తప్పుడు అర్హతలున్నా సీట్లు ఇవ్వడం, అడ్మిషన్ల కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా సీట్లు కేటాయించడం వంటి అక్రమాలు జరుగుతున్నాయి. దీనితో అర్హులైన విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది.
ఇక నుంచి మెడికల్ కాలేజీలకు రేటింగ్
వైద్య కాలేజీల ఏర్పాటు, కొత్త కోర్సుల అనుమతి కోసం ఎన్‌ఎంసీ నిబంధనలను విడుదల చేసింది. వీటి అమలుకు ‘మెడికల్ అసెస్‌మెంట్ అండ్ రేటింగ్ బోర్డు (మార్బ్)’ను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించింది. మార్బ్ నుంచి లిఖితపూర్వక అనుమతులు లేకుండా కొత్తగా వైద్య కాలేజీలు ఏర్పాటు చేయడానికిగానీ, కొత్త కోర్సులు ప్రారంభించడానికిగానీ వీల్లేదు.
ఎంబీబీఎస్, పీజీ కోర్సుల కోసం కొత్త కాలేజీల ఏర్పాటుకు ఈ సంస్థ దరఖాస్తులు ఆహ్వానించినప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతో ఏర్పాటైన స్వయం ప్రతిపత్తి సంస్థలు, సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద ఏర్పాటైన కంపెనీలు దరఖాస్తు చేసుకోవచ్చు. మార్బ్ అన్ని కోణాల్లో పరిశీలించి అనుమతి ఇస్తుంది.
మార్బ్ అనుమతి లేకుండా ఇప్పటికే తరగతులు నిర్వహిస్తున్న ఏ మెడికల్ కాలేజీలో కూడా సీట్లు పెంచడానికి వీల్లేదు. మార్బ్ థర్డ్ పార్టీ సంస్థల సాయంతో మెడికల్ కాలేజీల పనితీరును పరిశీలించి రేటింగ్ ఇస్తుంది. ఇక ప్రతీ మెడికల్ కాలేజీ వార్షిక నివేదికను సంబంధిత బోర్డులకు అందజేయాలి.
గుర్తింపు పొందిన వైద్య అర్హత ఉంటేనే..
గుర్తింపు పొందిన వైద్య అర్హతలు లేకుండా ఏ వ్యక్తి కూడా మెడికల్ ప్రాక్టీస్ చేయకూడదని ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది. ఇందుకోసం ‘మెడికల్ ప్రాక్టీషనర్ల నమోదు, మెడిసిన్ నిబంధనల ప్రాక్టీస్ లైసెన్స్– 2023’ను విడుదల చేసింది. మెడికల్ ప్రాక్టీస్ చేయడానికి లైసెన్సు కోసం నేషనల్ మెడికల్ రిజిస్టర్‌లో నమోదు చేసుకోవాలి. విదేశాల్లో వైద్యవిద్య చదివినవారు జాతీయ స్థాయిలో సంబంధిత పరీక్ష పాస్ కావాలి.
రాష్ట్ర వైద్య మండలిలో దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత, అది జాతీయ వైద్య రిజిస్టర్‌లోనూ, రాష్ట్ర వైద్య రిజిస్టర్‌లో కూడా కనిపిస్తుంది. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్‌కు జారీచేసిన మెడిసిన్ ప్రాక్టీస్ లైసెన్స్ ఐదేళ్ల వరకు చెల్లుబాటు అవుతుంది. తర్వాత స్టేట్ మెడికల్ కౌన్సిల్‌కు దరఖాస్తు చేసుకుని లైసెన్స్‌ను పునరుద్ధరించుకోవాలి.
అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్యం
అత్యున్నత, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా వైద్య విద్య ఉండాలని ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది. అందుకోసం ‘గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్–2023’ను విడుదల చేసింది. విద్యార్థి కి ఉన్నతమైన, నాణ్యమైన ఎంబీబీఎస్ లేదా ఇతర అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యను అందించడానికి తగిన ప్రణాళికను అమలు చేయాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment