
సాక్షి, ఆసిఫాబాద్(తిర్యాణి): పల్లె ప్రగతి పనుల పరిశీలనకు కుమ్రంభీం జిల్లా అదనపు కలెక్టర్ వరుణ్‌రెడ్డి అటవీ బాటపట్టారు. బుధవారం తిర్యాణి మండలం రోంపెల్లి నుంచి గుండాల గ్రామం వరకు దట్టమైన అటవీ ప్రాంతంలో ఆరు కిలోమీటర్ల నడకలో మూడు వాగులు దాటారు. గుండాలలో పల్లె ప్రగతి పనులు, జలపాతం సందర్శించారు. గ్రామస్తులతో సమావేశమై ఎకో టూరిజం డెవలప్‌మెంటు ద్వారా గుండాల జలపాతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని, తద్వారా ఇక్కడి 20 మంది యువకులకు స్వయం ఉపాధి లభిస్తుందని తెలిపారు.
జలపాతం వద్ద గుడారాలను ఏర్పాటు చేసి పర్యాటకుల సంఖ్య మరింత పెరిగేలా చర్యలు చేపడతామని, రొంపెల్లి నుంచి గుండాల వరకు రోడ్డు సౌకర్యం కోసం ప్రతిపాదనలు సిద్ధమైనట్లు తెలిపారు. ఆయన వెంట గిన్నెదరి ఫారెస్టు రేంజ్ అధికారి ప్రణయ్, ఈజీఎస్ ఏపీవో శ్రవణ్‌కుమార్, సర్పంచ్ జంగుబాయి, పంచాయతీ కార్యదర్శి రాధాకిషన్, ఆదివాసీ నాయకులు శంకర్, కోవ మెతిరాం, సీతారాం, అశోక్ ఉన్నారు.