నాంపల్లి (హైదరాబాద్): సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ అంత్యక్రియలు దారుస్సలాం రోడ్డులోని ఆఖరిత్ మంజిల్‌లో జనసందోహం నడుమ జరిగాయి. సోమవారం గద్దర్ అంతిమ యాత్రలో జరిగిన తొక్కిసలాటలో అస్వస్థతకు గురై, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆయన తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.
అనంతరం ఆయన పార్థివదేహాన్ని సోమవారం రాత్రి ఆసుపత్రి నుంచి లక్డీకాపూల్‌లోని ఆయన నివాసానికి తీసుకువచ్చారు. మంగళవారం ఉదయం 5.30 గంటలకు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లోని మసీదుకు తరలించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పార్థివదేహాన్ని అభిమానులు, బంధువుల సందర్శనార్థం అక్కడే కాసేపు ఉంచారు.
అనంతరం దారుస్సలాంలోని ఆఖరిత్ మంజిల్ శ్మశాన వాటికకు తీసుకెళ్లి అశ్రునయనాల నడుమ అంత్యక్రియలు పూర్తి చేశారు. అంతిమ యాత్రకు భారీ స్థాయిలో ఆయన అభిమానులు, జర్నలిస్టులు, రాజకీయ నేతలు, పౌర, విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు, మేధావులు, కవులు, కళాకారులు హాజరయ్యారు. జహీరుద్దీన్ అలీఖాన్ కడచూపు కోసం తరలివచ్చిన వందలాది మందితో దారుస్సలాం రోడ్డు పూర్తిగా కిక్కిరిసిపోయింది.
ప్రముఖుల పరామర్శ...
లక్డీకాపూల్‌లోని జహీరుద్దీన్ అలీఖాన్ నివాసానికి చేరుకున్న పలువురు ప్రముఖులు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. పరామర్శించిన వారిలో రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, మహమూద్ అలీ, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కి, ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు, ఎమ్మెల్యే సీతక్క, డీజీపీ అంజనీకుమార్, ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ప్రముఖ విద్యావేత్త వేదకుమార్, సీనియర్ జర్నలిస్టులు పల్లె రవికుమార్, విరాహత్ అలీ, షబ్నమ్ హాస్మి, అయూబ్ ఖాన్, మాజీ ఎమ్మెల్సీ అమీన్‌వుల్లా హసన్ జాఫ్రి ఉన్నారు.
అలీఖాన్ కుటుంబ సభ్యులకు డీజీపీ పరామర్శ
సాక్షి, హైదరాబాద్: అస్వస్థతకు గురై సోమవారం సా యంత్రం మృతిచెందిన ఉర్దూ దినపత్రిక సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ కుటుంబ సభ్యులను డీజీపీ అంజనీ కుమార్ పరామర్శించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఉదయం లక్డీకాపూల్‌లోని అలీ ఖాన్ నివాసానికి వెళ్లారు. అక్కడ జహీరుద్దీన్ అలీఖాన్ కుటుంబ సభ్యులను డీజీపీ పరామర్శించి ఓదార్చారు.
Comments
Please login to add a commentAdd a comment