మాకు వేరే ప్రాంతంలో ఇళ్లు కట్టించి ఇవ్వండి
సీఎంకు సీతారాం తండావాసుల విజ్ఞప్తి
సాక్షి, మహబూబాబాద్: ‘సారూ.. శనివారం రాత్రి వచ్చిన వరదతో చెట్టుకొకరం.. పుట్టకొకరం అయినం. ట్యాంకులు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నం.. ఇట్టా మునిగే తండాలో ఉండలేం.. మాకు వేరేచోట ఇళ్లు కట్టించి ఇవ్వండి.. తండా అంతా అక్కడే ఉంటాం..’అంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఎదుట మహ బూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం శివారు సీతారాం తండావాసులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. పర్యటనలో భాగంగా మంగళవారం తండాకు వచి్చన సీఎం స్థానికులతో మాట్లాడారు.
సీఎం: నీ పేరు ఏం పేరు...?
తండావాసీ: నాపేరు మంగీలాల్ సార్..
సీఎం: ఏం జరిగింది? ఎక్కడివరకు నీళ్లు వచ్చాయి? (ఇల్లు చూపిస్తూ)
మంగీలాల్: శనివారం రాత్రి అందాజ 2 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఇంట్లోకి నీళ్లు రావడం ప్రారంభించాయి. ఏంది అని చూడగానే బయట అంతా కొండ మాదిరిగా నీళ్లతో ఉంది. నా భుజాల వరకు నీళ్లు వచ్చేశాయి. వెంటనే మేము పిల్లల్ని తీసుకుని పెద్ద బిల్డింగ్, ట్యాంకులు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నాం..ఇక ఇక్కడ ఉండలేం సార్.. మాకు వేరే ఇల్లు కట్టించండి.
సీఎం: శీనన్నా (పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి) వీళ్లను చూడు. ఈ ఇల్లు మీరే కట్టుకున్నారా? (మళ్లీ మంగీలాల్‌ను ఉద్దేశించి)
మంగీలాల్: లేదు సార్.. ఇందిరమ్మ ఇల్లు అప్పుడు కట్టుకున్నాం.
సీఎం: ఇప్పుడు కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం.. ఇక్కడే ఉంటారా.. వేరే చోటుకు వెళ్తారా? కలెక్టర్ గారూ అంతా చూడండి. తండా మొత్తం నమోదు చేసుకోండి. మంచి సైట్ చూడండి. ఇంట్లో ఏం తడిసినయి? ఏం ఇబ్బంది జరిగింది?
మంగీలాల్ కొడుకు: సార్ నా పుస్తకాలు తడిసినయి.. ఈ ఇంట్లో ఉండలేము. మళ్లీ మునుగుతాం.. మాకు వేరే ఇల్లు కావాలి.
మంగీలాల్: బియ్యం, బట్టలు అన్నీ తడిసినయ్ సార్
సీఎం: ఈమె తెలుసా? (సీతక్కను చూపిస్తూ) ఈమె నీకు కావాల్సిన పుస్తకాలు కొనిస్తుంది.. ఈయన తెలుసా? (ఎమ్మెల్యే రాంచంద్రునాయక్‌ను చూపిస్తూ) ఈయన పెద్ద డాక్టర్. ఈయన మాదిరిగానే మంచిగా చదువుకోవాలి.. అధైర్య పడకండి.. అన్నీ చూసుకుంటాం.
Comments
Please login to add a commentAdd a comment