వారి మూడ్ పార్టీకి, మోదీకి పూర్తి అనుకూలంగా కన్పిస్తోంది
రాష్ట్రంలో 10 నుంచి 12 సీట్లలో గెలవబోతున్నాం
కరీంనగర్‌లో నా గెలుపు కూడా పక్కాబీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు ఓ ప్లాన్ ప్రకారం మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయి
ప్రజల దృష్టిని మళ్లించేందుకే రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్ల రద్దు ప్రచారం
‘సాక్షి’తో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్
(కె.రాహుల్) : ‘కరీంగనగర్‌లోనే కాదు, రాష్ట్రంలో దేశ వ్యాప్తంగా ప్రజల మూడ్ బీజేపీకి, మోదీకి పూర్తి అనుకూలంగా కనిపిస్తోంది. ప్రధానిగా మోదీ ఉండాలని, తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీలు అత్యధిక సంఖ్యలో గెలవాలని ప్రజలు డిసైడ్ అయ్యారు..’ అని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ చెప్పారు. ప్రధాని మోదీ అభివృద్ధి ఎజెండాతో వివిధ వర్గాల ఓట్లు సాధించి లోక్‌సభ ఎన్నికల్లో తాను కూడా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
వేములవాడలో 8న జరిగిన ప్రధాని మోదీ సభకు ఉదయం 9 గంటలకే వెల్లువలా వచ్చిన ప్రజలు సంజయ్‌దే విజయమని ప్రకటించేశారన్నారు. తనపై పోటీచేస్తున్న బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు రెండోస్థానం కోసమే పోటీపడాల్సి ఉంటుందన్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి వినోద్‌కుమార్ నాన్ లోకల్ అయితే, కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో కూడా ప్రజలకు తెలియదన్నారు. ‘నేను ఈ గడ్డమీదే పుట్టిన. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు ఎన్నికల్లో గెలిచినా ఓడినా ఇక్కడే ఉన్నా. ప్రజల కష్టాల్లో అండగా ఉన్న. నాకు ఈ గడ్డతో ఉన్నది పేగు బంధం.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఎన్నడైనా ఈ గడ్డ ప్రజల కోసం పోరాటాలు చేశారా? మళ్లీ గెలిపిస్తే నాకున్న పరిచయాలు, ఢిల్లీ పెద్దలతో ఏర్పడ్డ సంబంధాలతో మరింత అభివృద్ధి చేస్తా..’ అని చెప్పారు. కరీంనగర్‌తో పాటు రాష్ట్రంలో పరిస్థితి, కాంగ్రెస్ పాలన, అభివృద్ధి, పలు రాజకీయ అంశాలపై బండి సంజయ్ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.\
నేనేం చేశానో గ్రామాల్లో కన్పిస్తోంది
మా పోరాటాల వల్లే కేసీఆర్ సర్కార్ పీడ విరగడైంది. తెలంగాణ ప్రజలను అరిగోస పెడుతున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గల్లిలోకి గుంజుకొచ్చి గడీల పాలనను బద్దలు కొట్టినం. ఏ ప్రభుత్వమైతే ధర్నాలు, నిరసనలను నిషేధించిందో అదే ప్రభుత్వాన్ని ధర్నా చౌక్‌కు గుంజుకొచ్చిన. కేసీఆర్ పాలనలో విసిగి, అన్యాయాలకు గురైన ప్రజలకు అండగా ఉంటూ పోరాటాలు చేసిన. కేసీఆర్ ప్రభుత్వం అన్నో ఇన్నో ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చింది అంటే నా పోరాటం వల్లనే. జిల్లాకు సంబంధించిన అనేక రోడ్ల పనులకు కేంద్రం నిధులు ఇచ్చేలా ఒప్పించి పనులు స్టార్ట్ చేయించిన. రూ.12 వేల కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చిన వివరాలు గ్రామ గ్రామాన కళ్లకు కన్పిస్తుంటే ఏమీ చేయలేదనే వాళ్లను ఏమనాలి ?
మేం పక్కా హిందుత్వవాదులం
హిందువులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేది ఎంఐఎం. ఆ పార్టీతో పదేళ్ల పాటు సంసారం చేసింది బీఆర్‌ఎస్. మనుగడ కోసం ఒవైసీతో అంటకాగుతోంది కాంగ్రెస్. హిందువుల ఆత్మ గౌరవం కోసం నేను కొట్లాడుతా. నేను ఎన్నడూ రాజకీయం కోసం హిందుత్వాన్ని వాడుకోను కానీ హిందూ ధర్మ పరిరక్షణ కోసం బరాబర్ రాజకీయం చేస్తా..దేవుడు పేరు చెప్పుకుని ఓట్లు అడుక్కునే బిచ్చగాళ్లు బీజేపోళ్లని రేవంత్‌రెడ్డి హేళన చేశారు. హామీల అమలుపై కాంగ్రెస్ మాటలు జనం నమ్మడం లేదని ఆ దేవుడి మీదే ఒట్టేసే పరిస్థితికి వచ్చిండు. రాముడి అక్షింతలను, తీర్ధ ప్రసాదాలను హేళన చేసిన కేసీఆర్ పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో బొంద పెట్టారు. ఆ పార్టీని పాతాళంలోకి తొక్కడం ఖాయం.
నాకే బాధ్యత ఇవ్వాలో పార్టీ నిర్ణయిస్తుంది
రాష్ట్రవ్యాప్తంగా 10 నుంచి 12 సీట్లలో బీజేపీ గెలవబోతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. అంతకు మించి గెలిచినా ఆశ్చర్యపోవడానికి లేదు. నేను గెలిచిన తర్వాత కేంద్రమంత్రి పదవి ఇస్తారా? ఏ బాధ్యత అప్పగిస్తారనేది మోదీ నాయకత్వంలోని మా కేంద్ర పార్టీ నిర్ణయిస్తుంది. నేను బీజేపీ సైనికుడిని. కరీంనగర్ ప్రజల సేవకుడిని. పార్టీ అప్పగించిన పని వంద శాతం నిర్వహించడమే నా బాధ్యత.
ఫోన్ ట్యాపింగ్ డబ్బులు ఇక్కడ ఖర్చు చేస్తున్నారు
ఫోన్ ట్యాపింగ్ డబ్బులు తీసుకొచ్చి కరీంనగర్‌లో ఖర్చు చేస్తున్నారు. ఓటుకు వెయ్యి ఇచ్చి ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయి. కాళేశ్వరం అవినీతిపై, ఫోన్ ట్యాపింగ్‌పై కాంగ్రెస్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలు, ఆ పార్టీపై, ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలపై బీఆర్‌ఎస్ ప్రశ్నించడం లేదు. ఈ రెండు పార్టీలు ఓ ప్లాన్ ప్రకారం మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని పైకి డ్రామాలు ఆడుతున్నాయి.
రిజర్వేషన్లకు కాంగ్రెస్ తూట్లు
కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లకు తూట్లు పొడిచింది. ముస్లిం రిజర్వేషన్ల అమలు పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణ పేదలకు అన్యాయం చేసింది. అగ్రకులాల్లోని పేదలకు కూడా 10% రిజర్వేషన్లు కల్పించిన వ్యక్తి మోదీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తున్న నేత. అలాంటి నాయకుడు రిజర్వేషన్లను రద్దు చేస్తారంటే ఎవరూ నమ్మరు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు, ఇతర హామీలు అమలు చేయకపోవడంతో మోసం చేసిందనే భావన ప్రజల్లో ఉంది. దీన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్ల రద్దు, హైదరాబాద్‌ను యూటీ చేస్తారనే ప్రచారాన్ని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ చేస్తున్నాయి.
ఆ పార్టీలకు మధ్యవర్తి ఎంఐఎం
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు మధ్యవర్తి ఎంఐఎం. ఈ పార్టీలన్నీ అవినీతి ఎలా చెయ్యాలి, ప్రజలను ఎలా మోసం చెయ్యాలి.. తిరిగి ఎన్నికలొస్తే డబ్బులతో ఓట్లు ఎలా కొనాలి? అనే చూస్తాయి. దేశాన్ని దోచుకోవడంలో కాంగ్రెస్, రాష్ట్రాన్ని దోచుకోవడంలో బీఆర్‌ఎస్ పార్టీలు పీహెచ్‌డీ చేశాయి. కేసీఆర్ కుటుంబం అవినీతిలో గుడిని మింగితే.. కాంగ్రెస్ ప్రభుత్వం గుడిలో లింగాన్ని కూడా వదలిపెట్టనట్లుగా అవినీతికి తెరదీస్తూ... ఆ డబ్బుతో ఢిల్లీకి కప్పం కడుతోంది. గ్యారెంటీలను నమ్మి గెలిపించిన ప్రజలకు పంగనామాలు పెట్టింది. వంద రోజుల పేరుతో 6 గ్యారంటీల్లో 5 హామీలను అమలు చేశామనడం పెద్ద అబద్ధం.
Comments
Please login to add a commentAdd a comment