
ప్రేమేందర్‌రెడ్డిని ఆస్పత్రికి తీసుకువస్తున్న కార్యకర్తలు
ఖమ్మం: ఖమ్మం, వరంగల్, నల్ల గొండ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ఆదివారం ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ సరళిని పరిశీలించేందుకు మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో పర్యటిస్తుండగా ఆయనపై దాడి జరిగింది. ఆయనపై కొంతమంది చాతీపై ఇటుకలతో దాడి చేయడంతో గాయపడ్డారు. పోలీసులు, పార్టీ నాయకులు సమీపంలోని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించారు.
ఆస్పత్రికి చేరుకున్న పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ కార్యకర్తలే దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రేమేందర్‌రెడ్డి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని, పోలింగ్ ముగిసిన తర్వాత హైదరాబాద్ తరలిస్తామని తెలిపారు.