మాజీ మంత్రి, బీజేపీ నేత డీకే అరుణ(ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్: సిద్ధిపేట ఘటనకు నిరసనగా అధికార టీఆర్‌ఎస్ పార్టీ తీరును వ్యతిరేకిస్తూ బీజేపీ ఆందోళనలు చేపట్టింది. ఇందులో భాగంగా ఏబీవీపీ, బీజేవైఎం ‘ఛలో ప్రగతిభవన్’కు పిలుపునిచ్చాయి. దీంతో ముందస్తు చర్యలు చేపట్టిన పోలీసులు ప్రగతిభవన్ వద్ద భారీ స్థాయిలో పోలీసులను మోహరించారు. అదే విధంగా పలువురు బీజేపీ నేతలను హౌజ్‌అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఎమ్మెల్యే రాజాసింగ్, మోత్కుపల్లి నరసింహులు ఇంటి వద్ద పోలీసులను మోహరించారు.
హైడ్రామా.. ప్రగతి భవన్‌కు వెళ్లవద్దు
ఈ నేపథ్యంలో బీజేపీ నాయకురాలు డీకే అరుణ ఇంటి వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. దుబ్బాక ప్రచారానికి వెళ్లాలని అరుణ పట్టుబట్టగా.. ఇంటిని వీడే బయటకు వెళ్లేందుకు వీల్లేదంటూ అడ్డుకున్నారు. అయితే ఆమె ఏమాత్రం వెనక్కితగ్గలేదు. ప్రచారానికి వెళ్లకుండా ఎందుకు ఆపుతున్నారంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలో ఎట్టకేలకు దిగి వచ్చిన పోలీసులు, దుబ్బాక ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు డీకే అరుణకు అనుమతినిచ్చారు. ప్రగతి భవన్‌కు వెళ్లవద్దని సూచిస్తూ.. ఎస్కార్ట్ వాహనం ఇచ్చి పంపించారు.(చదవండి: సీపీని సస్పెండ్ చేయాలి: బండి సంజయ్ )
అదే విధంగా మోత్కుపల్లికి కూడా దుబ్బాక వెళ్లేందుకు అనుమతినిచ్చారు. మరోవైపు.. దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో నోట్లకట్టల కలకలం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అరెస్టు ఘటనలపై టీఆర్‌ఎస్, బీజేపీ నేతలు ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల కమిషన్‌ను కలవనున్నారు. సిద్ధిపేట ఘటనపై పరస్పర ఫిర్యాదులకు సిద్ధమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment