సాక్షి, హైదరాబాద్: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో నిందితుల జాబితా రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ కేసులో అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ కుటుంబం మొత్తానికీ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. కిడ్నాప్‌కు సంబంధించిన కుట్రలో పాలు పంచుకున్నారని భార్గవ్ తండ్రి మురళి, తల్లి కిరణ్మయి, సోదరుడు చంద్రహాస్‌లను నిందితులుగా చేర్చారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వీరి కోసం అధికారులు గాలిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో భూమా అఖిలప్రియ సోదరుడు జగద్విఖ్యాత్‌రెడ్డిని కూడా నిందితుడిగా చేర్చిన విషయం తెలిసిందే. దీంతో అఖిలప్రియ–భార్గవ్‌రామ్ కుటుంబాల్లో ఒక్క మౌనిక రెడ్డి తప్ప మిగిలిన వారంతా కిడ్నాప్ కేసులో నిందితులుగా మారారు. హఫీజ్‌పేట భూ వివాదానికి సంబంధించి ప్రవీణ్‌రావుతో పాటు అతడి సోదరులను కిడ్నాప్ చేయడానికి భూమా అఖిలప్రియ, భార్గవ్‌రామ్ కొన్నాళ్ల క్రితమే పథకం వేసినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. దీన్ని ఎలా అమలు చేయాలనే అంశంపై తమ కుటుంబీకులతో కలసి పదేపదే చర్చలు జరిపారు. గుంటూరు శ్రీను నేతృత్వంలో కిరాయి మనుషులతో కిడ్నాప్ చేయించాలని నిర్ణయించుకున్నారు. ఈ కుట్ర చేసే సందర్భంలో మురళి, కిరణ్మయి, చంద్రహాస్‌లు భార్గవ్‌రామ్‌తోనే ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. చదవండి: బోయిన్‌పల్లి కేసు: వెలుగులోకి కీలక సూత్రధారి
మరోపక్క కిడ్నాప్‌ను అమలు చేయడానికి భార్గవ్ రామ్, గుంటూరు శ్రీను వివిధ ప్రాంతాల నుంచి తమ అనుచరులను, కిరాయి గూండాలను హైదరాబాద్‌కు రప్పించారు. వీరికి కూకట్‌పల్లిలోని పార్థ గ్రాండ్ హోటల్‌లో బస కల్పించారు. అక్కడ నుంచి యూసుఫ్‌గూడలోని స్కూలుకు తీసుకువచ్చారు. అక్కడే వీరిలో ఐటీ అధికారులుగా నటించే వారికి కొత్త బట్టలు ఇవ్వగా.. గుంటూరు ప్రాంతానికి చెందిన వంశీకి మాత్రం అద్దెకు తీసుకువచ్చిన పోలీసు యూనిఫాం ఇచ్చారు. ఆదాయపు పన్ను అధికారుల దాడి నేపథ్యంలో తాను బందోబస్తుగా వచ్చినట్లు ఇతడు బాధిత కుటుంబానికి తెలిపినట్లు వెలుగులోకి వచ్చింది. పరారీలో ఉన్న వారి జాబితాలో వంశీ కూడా ఉన్నాడు. భార్గవ్‌రామ్, అతడి కుటుంబీకులు, గుంటూరు శ్రీను తదితరులు ప్రస్తుతం బెంగళూరులో తలదాచుకున్నట్లు తెలిసింది. వీరిలో కొందరికి నేరచరిత్ర ఉండటంతో పోలీసుల దర్యాప్తు తీరుతెన్నులపై మంచి పట్టుంది. ఈ నేపథ్యంలో నిందితులు ప్రత్యేక బృందాలకు చిక్కకుండా తప్పించుకుంటున్నారు. అజ్ఞాతంలో ఉంటూనే నిందితులు ముందస్తు బెయిల్‌కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. చదవండి: ఐటీ అధికారులుగా ఎలా నటించారంటే..
Comments
Please login to add a commentAdd a comment