సాక్షి, హైదరాబాద్: ఎల్రక్టానిక్స్ దిగ్గజ సంస్థ కేన్స్ గుజరాత్‌కు తరలిపోతున్నా ప్రజలను తప్పుదోవ పట్టించేలా మంత్రి శ్రీధర్‌బాబు అసత్యాలు చెప్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మూడు యూనిట్లలో కీలమైన రెండు యూనిట్లు తరలిపోతున్నాయని, కాంగ్రెస్ చేతగాని, అసమర్థ, గందరగోళ నిర్ణయాలతో పెట్టుబడిదారుల్లో అయోమయం నెలకొందన్నారు.
ఇకనైనా కేన్స్ సంస్థ పెట్టుబడుల విషయంలో ప్రజలకు నిజాలు చెప్పాలని ‘ఎక్స్’వేదికగా కేటీఆర్ డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కేన్స్ సంస్థ తెలంగాణలో మూడు యూనిట్లను స్థాపించేలా ఒప్పించి అన్ని అనుమతులను ఇచ్చామన్నారు. వీటిలో సాధారణ ఎల్రక్టానిక్స్ తయారీ యూనిట్‌తో పాటు మరో అత్యాధునిక యూనిట్ (ఒసాట్)ను కొంగరకలాన్‌లో ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు.
మరో పీసీబీ యూనిట్‌ను వరంగల్‌లో ఏర్పాటు చేసేందుకు కంపెనీని ఒప్పించామని కేటీఆర్ తెలిపారు. ఒసాట్‌ను కొంగరకలాన్‌లో ఏర్పాటు చేసి ఉంటే సెమీ కండక్టర్ల రంగానికి హైదరాబాద్‌లో మంచి భవిష్యత్ ఉండేదన్నారు. తెలంగాణలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేలా ప్రోత్సహించి, అవసరమైతే ప్రలోభాలకు, బెదిరింపులకు పాల్పడుతూ కాంగ్రెస్ పార్టీ సర్కస్ ఫీట్లు చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే వారిపై చర్యలు అంటూ హంగామా చేస్తోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment