కేసినోపై ఈడీ దూకుడు | Casino Case: Buchi Reddy And Harish Attended ED | Sakshi
Sakshi News home page

కేసినోపై ఈడీ దూకుడు

Published Tue, Nov 22 2022 3:01 AM | Last Updated on Tue, Nov 22 2022 2:58 PM

Casino Case: Buchi Reddy And Harish Attended ED - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విదేశాల్లో కేసినో ఆడిన వ్యక్తుల విచారణ పర్వంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దూకుడు పెంచింది. వ్యాపారవేత్త బుచ్చిరెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) హరీశ్‌ సోమవారం ఈడీ ఎదుట హాజరయ్యారు. బుచ్చిరెడ్డి ఉదయం ఈడీ ఎదుట హాజరయ్యారు. విచారణ సమయంలో బ్యాంకు లావాదేవీల రికార్డులు అందించాల్సిన ఆయన సరైన పత్రాలు లేకుండా రావడంతో ఆరేళ్ల బ్యాంకు లావాదేవీలు తీసుకుని రావాలని అధికారులు ఆదేశించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసినోలో మనీలాండరింగ్‌కు, హవాలాకు అవకాశం లేదని చెప్పారు. కేసినోలో తనకు 5% వాటా ఉందన్న బుచ్చిరెడ్డి జనవరిలో నేపాల్‌ వెళ్లినట్లు, తనతోపాటు మరో పది మంది వచ్చినట్లు వివరించారు. కేసినో ఆడటానికి వెళ్లే సమయంలో తమ వద్ద రూ.15 వేలకు మించి ఎక్కువ డబ్బు తీసుకెళ్లడానికి వీల్లేదన్నారు.

డబ్బంతా ఇక్కడే డిపాజిట్‌ చేస్తామని, అక్కడ కేసినోలో గెలిచిన వారికి ఇక్కడకు ఇచ్చిన తర్వాతే డబ్బు చెల్లిస్తారని, ఇందులో మనీలాండరింగ్‌కు అవకాశమే లేదని చెప్పారు. అనంతరం బ్యాంకు స్టేట్‌మెంట్లతో వచ్చిన బుచ్చిరెడ్డిని రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు ప్రశ్నించారు. కేసినోలో భాగస్వామ్యం, నేపాల్, గుడివాడ కేసినోలకు సంబంధించి ప్రశ్నించినట్లు సమాచారం.

బుధవారం కూడా విచారణకు హాజరుకావాలని అధికారులు ఆదేశించారు. కాగా హరీశ్‌ను అధికారులు 7 గంటలపాటు ప్రశ్నించారు. బ్యాంకు లావాదేవీల స్టేట్‌మెంట్లతోపాటు ఆయన కాల్‌డేటాపై కూడా అధికారులు విచారణ చేసినట్లు సమాచారం. కేసినో అడటానికి ఎన్నిసార్లు వెళ్లావు.? డబ్బెలా చెల్లించావు..? ఎవరికి చెల్లించావు.? ఎంత మొత్తం చెల్లించావు.? మీతో పాటు వచ్చిన వారు ఇంకెవరు ఉన్నారు?.. తదితర అంశాలపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు.

ఇదిలా ఉండగా, కేసినోల కేసులో నోటీసులు అందుకున్న మెదక్‌ డీసీసీ బ్యాంక్‌ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి ఈడీ ఎదుట హాజరుకాలేదని సమాచారం. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ ఎల్‌.రమణకు నోటీసులిచ్చిన సమయంలోనే దేవేందర్‌రెడ్డికి నోటీసులు జారీ చేసినా.. ఆయన ఇంకా విచారణకు హాజరుకాకపోవడం గమనార్హం. ఈ కేసులో ఇప్పటి వరకు మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సోదరులు మహేష్, ధర్మేంద్ర, ఊర్వశీ బార్‌ యజమాని యుగంధర్‌ను విచారించారు.  

గ్రానైట్‌ వ్యాపారులు కూడా.. 
ప్రభుత్వానికి సీనరేజ్‌ ఎగ్గొట్టి.. నిబంధనలకు విరుద్ధంగా విదేశాలకు గ్రానైట్‌ ఎగుమతి చేసిన వ్యాపారులను కూడా ఈడీ అధికారులు ఈరోజు విచారించినట్లు సమాచారం. అనుమతించిన పరిమాణం కంటే ఎక్కువ మొత్తాన్ని విదేశాలకు పోర్టుల ద్వారా ఎగుమతి చేసిన వ్యాపారులు అక్కడ నుంచి హవాలా రూపంలో డబ్బు తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి.

2012–13లో రాష్ట్ర విజిలెన్స్‌ అధికారులు విచారణ జరిపి దాదాపు ప్రభుత్వానికి రూ.124 కోట్ల సీనరేజి చెల్లింపులు ఎగ్గొట్టారని తేల్చారు. సీనరేజి చట్టం ప్రకారం.. ఎగ్గొట్టిన మొత్తానికి ఐదు రెట్లు జరిమానా, వడ్డీలు కలిపి మొత్తం రూ.748 కోట్లు చెల్లించాలని అప్పట్లోనే వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు. విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా కేసులు నమోదు చేసిన ఈడీ ఇటీవల మళ్లీ గ్రానైట్‌ వ్యాపారుల ఇళ్లలో సోదాలు నిర్వహించింది. వారికి నోటీసులు కూడా ఇచ్చి విచారణకు హాజరుకావాలని ఆదేశించిన విషయం విదితమే. ఈడీ అధికారుల ఆదేశాలతోనే పలు కంపెనీల డైరెక్టర్లు హాజరైనట్లు తెలిసింది.  

ఈడీ ఆఫీస్‌లో బుచ్చిరెడ్డి, హరీశ్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement