
సాక్షి, హైదరాబాద్: వైద్య కళాశాల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం రెండేళ్ల నుంచి అన్ని సౌకర్యాలతో నడుస్తున్న 300 పడకల ఆస్పత్రి తప్పనిసరిగా ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. రెండేళ్లూ 60 శాతం ఆక్యుపెన్సీ ఉండాలని పేర్కొంది. ఆస్పత్రి లేని కాలేజీల్లో విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జి కరువవుతోందన్న విమర్శల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. 2021–22 వైద్య విద్యా సంవత్సరంలో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఎలాంటి నిబంధనలు పాటించాలన్న దానిపై కేంద్రం తాజాగా కొన్ని సవరణలు చేసింది. దీనిపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఈ నిబంధనలను తాజాగా జాతీయ వైద్యమండలి (ఎన్‌ఎంసీ) విడుదల చేసింది. మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కనీసం 20 నుంచి 25 ఎకరాల స్థలం ఉండాలన్న నిబంధనను తొలగించారు. మెట్రోపాలిటన్ నగరాల్లో స్థల సమస్య వల్ల బహుళ అంతస్తులు నిర్మించి కాలేజీ నిర్వహించవచ్చు. కాలేజీలో కనీసం 24 విభాగాలు ఉండాలి. కాలేజీకి తొలుత 100 నుంచి 150 సీట్లతో అనుమతిస్తారు. సమకూర్చుకునే సౌకర్యాలనుబట్టి ఆ సంఖ్యను ఏటా పెంచుతారు.
కాలేజీలో సీట్ల సంఖ్యను బట్టి 19 విభాగాల్లో తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సిన పడకల సంఖ్యను నిర్దేశించారు. వంద సీట్లుంటే 400 పడకలు, 150 సీట్లుంటే 600 పడకలు, 200 సీట్లుంటే 800 పడకలు, 250 సీట్లుంటే వెయ్యి పడకలు ఉండాలి. ప్రతి కళాశాలలో 30 పడకలు అదనంగా ఎమర్జెన్సీ మెడిసిన్‌కు కేటాయించాలి. ఐదు పడకల ఐసీయూ, పీఐసీయూ వేర్వేరుగా ఉండాలి. ఫిజికల్ మెడికల్ రిహాబిలిటేషన్ సెంటర్, స్కిల్ ల్యాబొరేటరీ, ఆర్‌టీ–పీసీఆర్ పరీక్షలు చేసే ల్యాబొరేటరీ తప్పనిసరి. వైద్య సిబ్బంది నివాస సదుపాయాలను కుదించారు. ఎమర్జెన్సీ స్టాఫ్ అందుబాటులో ఉండాలన్న నిబంధనను ఆప్షన్‌గా చేశారు. లెక్చర్ హాళ్లను తగ్గించేశారు. కొన్ని వైద్య విభాగాల్లో పడకల సంఖ్య కుదించారు. ఏటా కాలేజీని తనిఖీ చేయాలనే నిబంధనను మార్చేశారు. వైద్య సిబ్బంది సంఖ్యను తగ్గించారు. డాక్టర్ల విషయం చెప్పలేదుకానీ, పారామెడికల్ సిబ్బందిని తగ్గించారు.
సెంట్రల్ రిసెర్చ్ ల్యాబొరేటరీ కళాశాల ఇష్టం..
మెడికల్ కాలేజీల్లో సెంట్రల్ రిసెర్చ్ ల్యాబొరేటరీలు తప్పనిసరికాదని, కళాశాల ఇష్టమని పేర్కొన్నారు. ఈ ల్యాబొరేటరీల్లో ఆస్పత్రికి వచ్చే రోగులపై పరిశోధనలు జరుగుతుంటాయి. కొన్ని రోగాల్లో వచ్చే మార్పులు, కొత్త రోగాలపై క్లినికల్ రిసెర్చ్, క్లినికల్ ట్రయల్స్ కూడా నిర్వహిస్తారు.
నిబంధనల్లో కొన్ని..
► విజిటింగ్ ఫ్యాకల్టీ సేవలను వినియోగించుకోవచ్చు. ఎమర్జెన్సీ విభాగంలో అదనపు ఫ్యాకల్టీని నియమించుకోవాలి.
► అన్ని కాలేజీల్లో బయోమెట్రిక్ అటెండెన్స్, సీసీటీవీ సౌకర్యం తప్పనిసరి. సీసీ కెమెరాల ద్వారా తరగతి గదులు, రోగులకు అందే వైద్యసేవల లైవ్ స్ట్రీమింగ్‌ను ఎన్‌ఎంసీ ఆధ్వర్యంలో నడిచే డిజిటల్ మిషన్‌మోడ్ ప్రాజెక్టుతో అనుసంధానించాలి.
► అనాటమీ విభాగంలో భౌతికకాయాలను కోసి పరిశీలించేందుకు వీలుగా 50 శాతం విద్యార్థుల సామర్థ్యంతో డిసెక్షన్ హాల్ ఏర్పాటుచేయాలి. ప్రతి 10 మంది విద్యార్థులకు ఒక బాడీ అందుబాటులో ఉంచాలి. 400 చ.మీ. వైశాల్యంతో పోస్ట్‌మార్టం/అటాప్సీ బ్లాక్ ఉండాలి.
► ప్రతి మెడికల్ కాలేజీకి అనుసంధానంగా ఒక ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఉండాలి.
► ఎయిర్ కండిషన్డ్ బ్లడ్‌బ్యాంక్, 24 గంటల ఫార్మసీ సేవలు ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment