ఐఏఎంసీ శాశ్వత భవనం భూమిపూజ కార్యక్రమంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ. చిత్రంలో జస్టిస్ హిమాకోహ్లి, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి, మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) ఏర్పాటుతో హైదరాబాద్‌కు ప్రపంచ ఖ్యాతి లభిస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. గచ్చిబౌలిలోని ఐకియా వెనుక భాగంలో ఐఏఎంసీకి ప్రభుత్వం కేటాయించిన భూమిలో శాశ్వత భవన నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌తో కలిసి జస్టిస్ రమణ శనివారం భూమిపూజ చేశారు.
ఐఏఎంసీకి విలువైన భూమితో పాటు నిర్మాణానికి రూ.50 కోట్లు కేటాయించిన ప్రభుత్వానికి సీజేఐ కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఏడాదిలోగా భవన నిర్మాణం పూర్తిచేసుకొని దుబాయ్, సింగపూర్, లండన్ ఆర్బిట్రేషన్ కేంద్రాల తరహాలో మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఈ నెల 17, 18 తేదీల్లో దుబాయ్‌లో సెమినార్ ఏర్పాటు చేశామని, అంతర్జాతీయంగా ఆర్బిట్రేషన్ కేసులను ఆకర్షించేందుకు ఈ సెమినార్ దోహదపడుతుందని చెప్పారు. ఐఏఎంసీకి ఇప్పటికే ఆర్బిట్రేషన్ కేసులు వస్తున్నాయని, మధ్యవర్తిత్వం ద్వారా కేసులను పరిష్కరించడంలో ప్రపంచంలోనే మంచి గుర్తింపు సాధించబోతోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వర్‌రావు చెప్పారు.
అంతర్జాతీయ ప్రమాణాలు, సౌకర్యాలతో నిర్మించబోయే ఈ కేంద్రం నగరానికి కీర్తిప్రతిష్టలు తెచ్చిపెడుతుందన్నారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి, పూర్వ న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌వీ రవీంద్రన్, ఏపీ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, ఇతర న్యాయమూర్తులు, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, మహమూద్‌అలీ, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, సీఎస్ సోమేశ్‌కుమార్ తదితరులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment