మీడియాతో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్. చిత్రంలో భగవంత్ మాన్, కేజ్రీవాల్
చాలా రాష్ట్రాల్లోని బీజేపీయేతర ప్రభుత్వాలను కేంద్రం ఇబ్బందులకు గురిచేస్తోంది. రకరకాల దాడులు చేస్తూ వేధించడంతోపాటు అనేక రకాల దుర్మార్గాలకు బీజేపీ ప్రభుత్వం ఒడిగడుతోంది. ఢిల్లీలో కేజ్రీవాల్ నేతృత్వంలో ఆప్ మూడు పర్యాయాలు గెలిచినా.. కేంద్రం దుర్మార్గంగా లెఫ్టినెంట్ గవర్నర్‌ను తెచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన ప్రభుత్వాన్ని ఊపిరాడనీయకుండా చేసింది. కేజ్రీవాల్ ప్రభు త్వం సుప్రీంను ఆశ్రయించి ఉపశమనం పొందినా.. మోదీ సర్కారు ఆర్డినెన్స్ తెచ్చి ఢిల్లీ ప్రజలను అవమానించింది. ఇలాంటి వారికి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం.
– కేసీఆర్
ప్రజా ప్రభుత్వాలను పనిచేయనీయరా?
ప్రజలు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే.. ఆ ప్రభుత్వాన్ని ప్రధాని మోదీ పని చే యనీయరు. విపక్ష పార్టీలు అధికారంలోకి వస్తే.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూల్చివేస్తున్నారు. ఈడీ, సీబీఐల ను పంపి బెదిరించి ఎమ్మెల్యేల్లో చీలిక తె స్తారు. లేకుంటే గవర్నర్లను దుర్వినియోగం చేస్తూ ఆర్డినెన్స్ తెచ్చి ప్రభుత్వాన్ని పనిచేయనీయరు. తెలంగాణ గవర్నర్ సైతం బిల్లులు పాస్ చేయడం లేదు.
– కేజ్రీవాల్
సాక్షి, హైదరాబాద్: దేశంలో కేంద్ర ప్రభుత్వ అరాచకాలు, ఆగడాలు మితిమీరి పరాకాష్టకు చేరుకుంటున్నాయని.. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను ముప్పుతిప్పలు పెడుతూ పనిచేయనీయడం లేదని బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. చివరికి సుప్రీంకోర్టు తీర్పుకు కూడా అతీగతీ లేకుండా పోయిందని, ఎమర్జెన్సీ రోజులు గురుకొస్తున్నా యని పేర్కొన్నారు. దేశంలో ఇందిరాగాంధీ నాటి ఎమర్జెన్సీకి ముందు ఇలాంటి పరిస్థితే ఉండేదని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అదే దారిలో నడుస్తోందని విమర్శించారు.
ప్రజల చేత ఎన్నుకోబడిన ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలోనే అధికారులందరూ పనిచేయాలని.. వారి బదిలీలు, ఇతర అంశాలు రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టమైన తీర్పు ఇచ్చిందని.. కానీ కేంద్రం ఆ తీర్పును కాలరాసేలా ఆర్డినెన్స్ తీసుకురావడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం రాష్ట్రానికి వచ్చిన ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల సీఎంలు అర్వింద్ కేజ్రివాల్, భగవంత్‌సింగ్ మాన్‌లతో కూడిన బృందం.. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయింది. కేంద్ర ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మద్దతు ఇవ్వాలని కోరింది. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముగ్గురు సీఎంలు మాట్లాడారు. ఇందులో సీఎం కేసీఆర్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే..
‘‘చీకటి రోజులు అంటూ ఏ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రధాని మోదీ, బీజేపీ నాయకులు గొంతు చించుకుని మాట్లాడుతారో.. ఇప్పుడు సరిగ్గా అలానే జరుగుతోంది. నాడు అలహాబాద్ హైకోర్టు తీర్పును తోసిరాజంటూ ఇందిరాగాంధీ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది. ఇప్పట్లో మోదీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చిన తరహాలోనే అప్పుడు చేసింది. నాడు మహాశక్తివంతురాలు అనుకున్న ఇందిరాగాంధీని లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ నాయకత్వంలో దేశం పక్కన పెట్టేసింది. ఆ స్థానంలో జనతా పార్టీని గద్దెనెక్కించినా.. ఆ ప్రభుత్వం తప్పులు చేస్తే మళ్లీ ఇందిరాగాంధీని ప్రజలు గెలిపించారు.
ఏదైనా తప్పు జరుగుతుంటే భారతదేశం ప్రతిస్పందిస్తుంది. మీరూ (ప్రధాని మోదీ) ఇందిరా గాంధీ అవలంబించిన ఎమర్జెన్సీ దారిలోనే ఉన్నారు. మీకు, వారికి ఏమీ తేడా లేదు. నిన్నగాక మొన్న కర్ణాటక ప్రజలు బీజేపీకి కర్రుకాల్చి వాతపెట్టిన్రు. వంగి వంగి కోతి దండాలు పెట్టినా కూడా తీసిపడేశారు. ఇకనైనా బుద్ధి రావాలి. రైతు చట్టాల తరహాలో ఢిల్లీ ఆర్డినెన్స్‌ను కూడా ఉపసంహరించుకోవాలి. క్షమాపణ కోరడం మీ వృత్తే కదా (మాఫీ కే సౌదాగర్)! ఉపసంహరించుకోకుంటే ప్రజాస్వామ్యానికి ముప్పు.
ఆర్డినెన్స్‌ను ఓడిస్తాం
ఢిల్లీ ఆర్డినెన్స్ ఉపసంహరించుకోవాలని ప్రధాని మోదీని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే మేమంతా (విపక్షాలు) అర్వింద్ కేజ్రివాల్ పక్షాన నిలబడతాం. లోక్‌సభ, రాజ్యసభలలో మా శక్తినంతా ప్రయోగించి ఆర్డినెన్స్‌ను ఓడిస్తాం. నేను ఢిల్లీ వెళ్లినప్పుడు నన్ను అర్వింద్ కేజ్రివాల్ స్వయంగా తీసుకెళ్లి అక్కడ జరిగిన మంచి పనులను చూపించారు. మొహల్లా క్లినిక్స్, తాగునీటి సరఫరా, విద్యుత్ రాయితీలు వంటివి పేదలకు మేలు చేస్తున్నాయి. ప్రజాదరణ గల ప్రభుత్వం కాబట్టే ప్రజలు మూడు సార్లు గెలిపించారు. అలాంటి పాపులర్ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టడం సరికాదు.
ఇలాంటి దౌర్భాగ్యం ఎన్నడూ చూడలేదు
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించినా.. కేంద్రం ఎన్నో కుయుక్తులు పన్నింది. గెలిచిన మేయర్‌ను ప్రమాణ స్వీకారం చేయనీకుండా ముప్పుతిప్పలు పెట్టింది. చివరికి సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. గవర్నర్ పదవి అలంకారప్రాయమైనది. అసెంబ్లీ బడ్జెట్ సెషన్ ఏర్పాటు గవర్నర్ల బాధ్యత. కానీ పంజాబ్ గవర్నర్ బడ్జెట్ సెషన్ పెట్టనంటే.. సుప్రీంకోర్టుకు వెళ్లి బడ్జెట్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఇలాంటి దౌర్భాగ్యాన్ని దేశంలో ఎన్నడూ చూడలేదు’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ముగ్గురు సీఎంలతోపాటు రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్, బీఆర్‌ఎస్ ఎంపీలు కే కేశవరావు, నామా నాగేశ్వర్‌రావు, ఆప్ ఎంపీలు సంజయ్‌సింగ్, రాఘవ్ చద్దా తదితరులు పాల్గొన్నారు.
ప్రధాని సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించకుంటే ఎలా?: కేజ్రివాల్
ఢిల్లీలో పాలనా వ్యవస్థల నియంత్రణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దేశ ప్రధాని పాటించకుంటే ఎలాగని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రివాల్ ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాలను పనిచేయనీయకపోవడం దుర్మార్గమని.. ఒక ప్రధాన మంత్రి, 31 రాష్ట్రాల గవర్నర్లు కలిసి దేశాన్ని ఏలుతారంటే, ఇక దేశంలో ఎన్నికలు నిర్వహించడం ఎందుకని నిలదీశారు. ‘‘2015 ఫిబ్రవరిలో మా ప్రభుత్వం తొలిసారిగా అధికారంలో వస్తే.. మే 23న నోటిఫికేషన్ ద్వారా కేంద్రం మా అధికారాలను లాక్కుంది. మాకంటే ముందు పాలించిన సీఎం షీలా దీక్షిత్ నియంత్రణలోనే ఢిల్లీలో అన్ని పాలన వ్యవస్థలు పనిచేశాయి.
ఢిల్లీ సీఎంగా వైద్య, విద్య శాఖల కార్యదర్శులను బదిలీ చేసే అధికారం నాకు లేదు. దీనిపై ఎనిమిదేళ్లుగా హైకోర్టు, సుప్రీంకోర్టులో పోరాడాం. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ నెల 11న ఢిల్లీ ప్రజల పక్షాన తీర్పు ఇచ్చింది. కానీ కేంద్రం ఈ నెల 19న సుప్రీంకోర్టు తీర్పును రద్దు చేస్తూ ఆర్డినెన్స్ తెచ్చింది. ఈ ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధం. ఇది ఢిల్లీ ప్రజలకు ఘోర అవమానం. ప్రధాన మంత్రి సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించనంటే దేశం ఎలా నడుస్తుంది?’’ అని కేజ్రివాల్ ప్రశ్నించారు.
ఆర్డినెన్స్‌ను ఓడిస్తాం..
రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ లేదని.. 238 రాజ్యసభ సీట్లలో బీజేపీకి 93 ఎంపీలు మాత్రమే ఉన్నారని, ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు రాజ్యసభకు వస్తే బీజేపీయేతర పార్టీలన్నీ కలసి ఓడించగలమని కేజ్రివాల్ చెప్పారు. ఈ బిల్లును ఓడించడం ద్వారా 2024లో దేశంలో బీజేపీ అధికారంలోకి రాదని ప్రజల్లో విశ్వాసం కలిగించిన వాళ్లం అవుతామని.. ఇది 2024 ఎన్నికలకు సెమీఫైనల్ వంటిదని పేర్కొన్నారు. తమకు అండగా నిలిచినందుకు సీఎం కేసీఆర్‌కు ఢిల్లీ ప్రజల తరఫున కృతజ్ఞతలు చెప్తున్నామన్నారు.
బీజేపీ కార్యాలయాలుగా రాజ్‌భవన్‌లు: భగవంత్‌సింగ్
రాజ్‌భవన్‌లు బీజేపీ కార్యాలయాలుగా, గవర్నర్లు బీజేపీ స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహరిస్తున్నారని పంజాబ్ సీఎం భగవంత్‌సింగ్ మాన్ విమర్శించారు. పంజాబ్‌లోని 117 స్థానాల్లో 92 స్థానాలను ఆప్ గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పెట్టేందుకు గవర్నర్ నిరాకరించడం ఏమిటని ప్రశ్నించారు. చివరికి సుప్రీంకోర్టుకు వెళ్లి బడ్జెట్ సమావేశాలు నిర్వహించుకోవాల్సి వచ్చిందన్నారు.
తెలంగాణ, తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, పంజాబ్ రాష్ట్రాల్లో గవర్నర్లు బిల్లులను ఆమోదించకుండా పెండింగ్‌లో ఉంచారని చెప్పారు. సీఎంలు ఫోటోలు దిగడానికే నీతి ఆయోగ్ సమావేశాలకు వెళ్లాలని.. ఎందుకంటే అక్కడికి వెళ్లినా ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదని చెప్పారు. అందుకే శనివారం నాటి నీతి ఆయోగ్ భేటీకి తాను, కేజ్రివాల్ వెళ్లలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment