నాబార్డ్ చైర్మన్ చింతల గోవిందరాజులును శాలువాతో సత్కరించి జ్ఞాపికను బహూకరిస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో నిరంజన్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు
సాక్షి, హైదరాబాద్: భారతీయ జీవికలో, దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన వ్యవసాయ రంగం లాభ దాయకం కాదనే వ్యతిరేక దృక్పథంలో మార్పు రావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభిలషించారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడంతో పాటు, విదేశాలకు అవసరమయ్యే ఆహార పదార్థాలను అందించే స్థాయికి భారతదేశం చేరుకోవాలని ఆకాంక్షిం చారు. నాబార్డ్ చైర్మన్ చింతల గోవిందరాజులు గురు వారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సంద ర్భంగా ఆయనతోపాటు వచ్చిన నాబార్డు బృందంతో సమావేశమైన కేసీఆర్.. వ్యవసాయ రంగం అభివృద్ధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. సీఎం మాట్లాడుతూ.. దేశంలో ఎక్కువమంది ఆధారపడినది, ఆహారంతో పాటు ముడిసరుకును అందిస్తున్నది వ్యవసాయ రంగమేన న్నారు. వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థ కాబట్టే భారతీయ వ్యవస్థ ఆటుపోట్లను తట్టుకుని నిలబడగలుగు తున్నదన్నారు. వ్యవసాయరంగాభివృద్ధితో పాటు వ్యవ సాయాధారిత పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం, నాబార్డులాంటి సంస్థలు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయాలని కోరారు. ‘దేశంలో 15 కోట్ల కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాయి. పరోక్షంగా మరిన్ని కోట్ల మంది ఆధారపడుతున్నారు. దేశంలోని 135 కోట్ల మందికి అన్నం పెట్టేది వ్యవసాయదారులే. ఇంత జనాభా కలిగిన దేశానికి ప్రపంచంలో మరో దేశమేదీ తిండి పెట్టలేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దేశం ఆహార ఉత్పత్తుల విషయంలో స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు వివిధ దేశాల్లో ఆహార అవసరాలను గుర్తించి, మన దేశం నుంచి ఎగుమతి చేసే విధానం రావాలి. దీనికోసం నాబార్డు అధ్యయనం చేయాలి’ అని సీఎం సూచించారు. ( రెండు రాష్ట్రాలు సమానమే )
సంఘటిత వ్యవసాయమే శరణ్యం
దేశంలో కొండ, శీతల, సముద్ర తీర ప్రాంతాల్లాంటి అనేక రకాల భూభాగాలున్నాయని, ఏ ప్రాంతానికి ఏ పంటలు అనువైనవో గుర్తించి వాటినే సాగు చేయించాలని, దేశాన్ని క్రాప్ కాలనీలుగా విభజించాలని కేసీఆర్ కోరారు. పంటల మార్పిడి విధానం అవలంభించాలని సూచించారు. వ్యవసాయ ఉత్పత్తులు పెరగ్గానే సరిపోదని, దాని అనుగుణమైన మార్కెట్ లేకుంటే ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయని, పంటలు పండించే విధానంతో పాటు మార్కెటింగ్ విధానం కూడా ఉండాలని అభిప్రాయపడ్డారు. పరిశ్రమలకు కావాల్సిన ముడి సరుకులను వ్యవసాయమే అందిస్తున్నందున పారిశ్రామికీకరణ కూడా జరగాలని, దేశంలో వ్యవసాధారిత పరిశ్రమల్ని అభివృద్ధి చేయాలన్నారు. రైతులు సంఘటిత వ్యవసాయం ద్వారా పెట్టుబడులు తగ్గించుకుని, ఆదాయం పెంచుకునే విధంగా ప్రోత్సహించేలా ప్రభుత్వాలు భూమిక కల్పించాలన్నారు. రైతులు సంఘటితంగా ఆహార ఉత్పత్తులను వినిమయ వస్తువులుగా మార్చి అమ్మితే ఎక్కువ లాభాలు గడించే అవకాశం ఉందని, రైతులు సామూహిక వ్యవసాయం చేసేలా ప్రోత్సహించాలని అన్నారు. రైతులే పంటలను ప్రాసెస్ చేసి అమ్మేలా యంత్రాలను అందించాలని, తెలంగాణ ప్రభుత్వం పెద్దఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్‌లను పెట్టాలని నిర్ణయించిందని చెప్పారు. ఇదే విధానం దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని, ఇందుకు తగిన ఆర్థిక చేయూతనందించే పథకాలకు నాబార్డు రూపకల్పన చేయాలని చెప్పారు.
వ్యవసాయ యాంత్రీకరణ జరగాలి
వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న కూలీల కొరత సమస్యను అధిగమించడానికి వ్యవసాయ యాంత్రీకరణ జరగాలని, నాటు వేసేందుకు, కలుపు తీసేందుకు, వరి, ఇతర పంటలు కోసేందుకు యంత్రాలు ఎక్కువ సంఖ్యలో రావాలని, ఇందుకు తగిన ఆర్థిక సాయం, సబ్సిడీలను నాబార్డు అందించాలని సీఎం కేసీఆర్ కోరారు. సహకార బ్యాంకులు మరింత సమర్థవంతంగా నడిచేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. సమావేశంలో రాష్ట్ర మంత్రులు ఎస్.నిరంజన్‌రెడ్డి, ఎరబ్రెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, రాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ రవీందర్‌రావు, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు జనార్దన్‌రెడ్డి, నర్సింగరావు, రామకృష్ణ, సందీప్ సుల్తానియా, సీఎం కార్యదర్శులు స్మితా సభర్వాల్, రొనాల్డ్‌రోస్, నాబార్డు సీజీఎం వైకే రావు, డీజీఎం ప్రసాద్‌రావు, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, మర్రి జనార్దనరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాబార్డు బృందానికి సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment