సాక్షి, హైదరాబాద్: ‘‘ఓటు అనే ఆయుధాన్ని ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా మార్చి తెలంగాణను సాధించగలిగాం. కేవలం ఉద్యమాలు, ఆందోళనల పేరుతో చట్టసభలకు దూరంగా జరిగే పోరాటాలు సఫలమైన చరిత్ర స్వాతంత్య్ర భారతంలో కనిపించదు. రాజకీయాలు చేయడమంటే నామోషీ అని భావించడం తప్పు. దేశానికి అన్నం పెట్టే రైతులు చట్టసభల్లోకి ఎందుకు వెళ్లకూడదు? తెలంగాణ ఉద్యమం తరహాలో.. రైతుల ఉద్యమానికి పార్లమెంటరీ పంథాను సమన్వయం చేసి, జమిలి పోరాటాలు సాగించాలి.
అప్పుడే దేశ వ్యవసాయ, రైతాంగ సమస్యలకు పరిష్కారం సాధ్యం..’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. రైతుల ఆత్మగౌరవం కోసం అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ జాతీయ స్థాయి రైతు సంఘాల నేతలతో ఆదివారం రెండో రోజున కూడా ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. దేశ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించారు. నాడు తెలంగాణ వ్యతిరేకులతో ‘జై తెలంగాణ’అనిపించినట్టే.. నేడు రైతు వ్యతిరేకులతో ‘జై కిసాన్’అని పలికించేలా చేద్దామన్నారు.
పట్టుబడితే సాధించలేనిదేమీ లేదు
జట్టు కట్టి పట్టుపడితే సాధించలేనిదేమీ లేదని తాను ప్రారంభించిన తెలంగాణ ఉద్యమం రుజువు చేసిందని.. తనకంటే ముందు జరిగిన పోరాటాల్లో నిర్దిష్ట కార్యాచరణ కొరవడటంతో లక్ష్యం నెరవేరలేదని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇందుకు కారణాలను అన్వేషించానని.. ఆఖరి పోరాటం ఆగం కాకూడదనే దృఢ సంకల్పంతో అటు రాజకీయ పంథాను, ఇటు ఉద్యమ పంథాను సమన్వయం చేసుకుంటూ జమిలి పోరాటంతో గమ్యాన్ని ముద్దాడామని తెలిపారు. ఇప్పుడు రైతు నేతలు రాజకీయాలనే పవిత్ర యజ్ఞంలో భాగస్వాములై, దేశ రైతాంగ సమస్యల పరిష్కారానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ‘‘ఎక్కడ ఆందోళన అవసరమో అక్కడ ఆందోళన చేద్దాం, ఎక్కడ రాజకీయాలు అవసరమవుతాయో అక్కడ రాజకీయాలు చేద్దాం.
ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. మన శక్తిని మనం గుర్తించడంలో వెనుకబడి ఉన్నాం. రాజకీయాల్లో ఉండటం అపవిత్రం అనుకోవడం సరికాదు. జమిలిగా పోరాడుదాం. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను, అంశాలను మీ ప్రాంతాల్లోని సంఘాల నేతలు, రైతులతో చర్చించండి. వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకోండి. మళ్లీ సమావేశమై జాతీయ స్థాయిలో ఐక్య సంఘటనను నిర్మిద్దాం. దేశవ్యాప్తంగా గ్రామగ్రామానికి చేరుకునేలా రైతుల ఐక్యత చాటుదాం. దేశం నలుమూలల నుంచి రైతుల డిమాండ్లను విందాం. శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు, మేధావులు, జర్నలిస్టులను పిలిచి లోతైన చర్చలు, విశ్లేషణలు చేద్దాం. ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేసుకుందాం. రాష్ట్ర, జిల్లా, తాలూకా, గ్రామ స్థాయిలో ఫెడరల్ స్ఫూర్తితో సంఘాల నిర్మాణం చేద్దాం. రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిద్దాం. తెలంగాణ సాధన కోసం సాగిన భావజాల వ్యాప్తిలాగా.. రైతుల సమస్యల పరిష్కార భావజాలాన్ని దేశంలోని అన్ని గ్రామాల్లో వ్యాప్తి చేద్దాం..’’అని కేసీఆర్ సూచించారు.
చదవండి: అక్కడ టీఆర్‌ఎస్ దూకుడు.. బీజేపీ ప్లాన్ ఏంటి?
‘అవ్వల్ దర్జా కిసాన్’లను తయారు చేద్దాం..
ఢిల్లీ, హైదరాబాద్ సహా ఉత్తర, దక్షిణ భారత దేశాలను అనుసంధానం చేసేందుకు రైతు కార్యాలయాలను ఏర్పాటు చేసుకుందామని రైతు సంఘాల నేతలకు కేసీఆర్ సూచించారు. సామాన్య రైతు కూడా దేశ ప్రధానితో దీటుగా చర్చించే విధంగా వారిని తీర్చిదిద్దుదామన్నారు. రైతాంగం కోసం ఏకరీతి ఎజెండాతో ఒకేసారి పోరాటాన్ని ప్రారంభిద్దామని చెప్పారు. దేశ రైతును ఆత్మ గౌరవంతో తలెత్తుకొని తిరిగే ‘అవ్వల్ దర్జా కిసాన్’గా తయారు చేద్దామని పిలుపునిచ్చారు.
కేసీఆర్ నాయకత్వం వహించాలి
కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక, అసంబద్ధ విధానాలను తిప్పికొట్టి వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందామని రైతు సంఘాల నేతలు తీర్మానించారు. ఆ దిశగా దేశ రైతాంగాన్ని గ్రామస్థాయి నుంచి ఐక్యం చేసేందుకు నాయకత్వం వహించాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. స్వాతంత్య్రం తర్వాత మారిన పరిస్థితుల్లో అవలంబించాల్సిన ఉద్యమ కార్యాచరణకు బ్లూప్రింట్ సిద్ధం చేయాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయం రాష్ట్ర పరిధిలోని అంశమే అయినా.. కీలక నిర్ణయాధికారం కేంద్రం చేతుల్లోనే ఉందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రాజకీయాల్లో దేశ రైతాంగం భాగస్వామ్యం కావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఆచార్య వినోభా భావే స్ఫూర్తితో దేశంలో స్వాతంత్య్ర గ్రామాలను నిర్మిద్దామన్నారు. ‘‘ఇకపై సీఎం కేసీఆర్ అనుసరించిన మార్గంలోనే కలిసి నడుద్దాం. ఓటు అనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి దేశ రైతాంగ సమస్యలకు పరిష్కారాలను సాధించుకుందాం’’అని పంజాబ్, యూపీ, కేరళ, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల రైతు నేతలు పిలుపునిచ్చారు.
ఒకే దేశం–ఒకే రైతు సంఘం నినాదంతో..
వాస్తవిక భారత నిర్మాణం కేసీఆర్ వంటి నాయకుల చేతుల మీదుగానే ప్రారంభం కావాలని.. ఒకే దేశం– ఒక్కటే రైతు సంఘం నినాదంతో అన్ని రాష్ట్రాల రైతులు ముందుకు సాగితే సమస్యలు పరిష్కారం అవుతాయని సౌత్ ఇండియన్ ఫార్మర్స్ యూనియన్ నేతలు స్పష్టం చేశారు. దళితబంధును దేశవ్యాప్తంగా అమలు చేయాలని యూపీకి చెందిన దళిత రైతు రాఘవేంద్ర కుమార్ పేర్కొన్నారు. కార్పొరేట్లకు వ్యవసాయ రంగాన్ని అప్పజెప్పేందుకు కుట్ర జరుగుతోందని.. దేశ రైతులు ఒక్క ఎకరం కూడా కోల్పోకుండా కాపాడుకుంటామని రైతు నేతలు తీర్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment