కరోనా కల్లోలంతో కుటుంబాలు చితికిపోతున్నాయి. ఇన్నాళ్లూ సంతోషంగా గడిపిన కుటుంబాలు అతలాకుతలం అవుతున్నాయి. ఇంటికి ఆధారమైన కుటుంబ పెద్దను కోల్పోయిన ఆవేదన ఓ వైపు.. వైద్యం కోసం చేసిన లక్షల రూపాయల అప్పులు మరోవైపు.. మానసికంగా కుంగదీస్తున్నాయి. ఇన్నాళ్లు కూడబెట్టిన డబ్బులు ఆస్పత్రుల బిల్లులతో కర్పూరంలా కరిగిపోతున్నాయి. కుటుంబాన్ని నడిపించే తండ్రి, భర్త, కొడుకు.. ఇలా పెద్ద దిక్కును కోల్పోయిన మహిళలు నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ముందు ముందు తమ బతుకులు నడిచేదెట్లాగని ఆందోళనలో మునిగిపోతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల నుంచి బాధితులు మెరుగైన వైద్యం కోసం వరంగల్, హైదరాబాద్ లాంటి నగరాలకు తరలుతున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రిలో చేరితే చాలు.. కనీసం ఐదారు లక్షల నుంచి రూ.20 లక్షల వరకు బిల్లులు కట్టాల్సి వస్తోంది. ఇంత మొత్తంలో ఖర్చు చేసినా బతుకుతారనే నమ్మకం ఎవరూ ఇవ్వడం లేదు. ఎలాగైనా కాపాడుకుందామనే ఆశతో బాధితులు అప్పో సప్పో చేసి లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు. అయినా ఫలితం లేకుండా పోతోంది. ఆస్పత్రిలో చేరినవారు సైతం.. డబ్బుల బాధతోనే మరింత ఆరోగ్యం దెబ్బతీసుకుంటున్నారు. ఆ ఆందోళనతోనే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మరోవైపు ఎలాగోలా కరోనా నుంచి కోలుకుని బయటపడ్డవారు కూడా.. చికిత్సకు అయిన ఖర్చు, అప్పులు చూసుకుని ఆవేదనలో మునిగిపోతున్నారు. ఇన్నాళ్లూ సంతోషంగా గడిపిన తమ కుటుంబాలను కరోనా అతలాకుతలం చేసిందంటూ కన్నీళ్లు పెడుతున్నారు. – సాక్షి నెట్‌వర్క్
భర్త కోసం పుస్తెలతాడు అమ్మి..
ఈ పక్క చిత్రంలో ఉన్నది ఉపేందర్ కుటుంబం. మహబూబాబాద్ జిల్లా మరిపెడకు చెందిన ఉపేందర్ కారు నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆయనకు భార్య రేణుక, ఇద్దరు పిల్లలున్నారు. ఉన్నదాంట్లో ఆనందంగా గడుపుతున్న ఆ కుటుంబంలో ఉపేందర్‌కు గత నెల 15న కరోనా సోకింది. శ్వాస సమస్య తలెత్తడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. రెమిడెసివిర్ ఇంజెక్షన్లు ఇస్తే పరిస్థితి కుదుటపడొచ్చని వైద్యులు చెప్తే.. ఒక్కోటీ రూ.35 వేల చొప్పున రూ.2.10 లక్షలు పెట్టి ఆరు ఇంజెక్షన్లు కొన్నారు. చికిత్సకంతా రూ.5 లక్షల వరకు ఖర్చయింది. ఆస్పత్రి బిల్లు చెల్లించేందుకు ఆధారమైన కారును రూ.1.50 లక్షలకు అమ్మారు. రేణుక తన మెడలో ఉన్న పుస్తెలతాడును కూడా అమ్మినా మరో రూ.3 లక్షల దాకా అప్పులు చేయక తప్పలేదు. ఉపేందర్ ప్రాణాలు దక్కినా.. కరోనా దెబ్బతో చిల్లిగవ్వ లేక రోడ్డునపడ్డారు. ప్రస్తుతం ఇంట్లో బియ్యం, కూరగాయలు కొనేందుకూ దిక్కులేని పరిస్థితి. సంతోషంగా జీవిస్తున్న తమ కుటుంబాన్ని కరోనా అతలాకుతలం చేసిందని ఉపేందర్– రేణుక కన్నీటి పర్యంతమవుతున్నారు.
‘అమ్మ’ను మింగేసింది..
ఈ చిత్రంలో పసిగుడ్డుతో కనిపిస్తున్న వ్యక్తి పేరు రవి. ఇతనిది నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం తిర్మన్‌పల్లి గ్రామం. డిచ్‌పల్లి మండలం ముల్లంగికి చెందిన సంధ్యకు ఏడాదిన్నర క్రితమే వివాహం జరిగింది. మీసేవ కేంద్రంలో నెలకు రూ.6 వేల జీతానికి రవి పనిచేస్తున్నాడు. 20 రోజుల కింద 9 నెలల గర్భిణి అయిన సంధ్యను నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ర్యాపిడ్ టెస్ట్ చేయగా కరోనా నెగెటివ్‌గా వచ్చింది. ప్రసవానికి ఇంకా సమ యం ఉందని వైద్యులు చెప్పడంతో ఇం టికి తిరిగొచ్చారు. తర్వాతి రోజే సంధ్యకు జ్వరం, ఆయాసం మొదలయ్యాయి. ఊపిరిపీల్చుకోవడంలో ఇబ్బం దిగా ఉండటంతో జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సీటీ స్కాన్ చేసిన వైద్యులు.. ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకినట్లు గుర్తించారు. వారి సూచనల మేరకు వెంటనే హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు కరోనా పాజిటివ్ అని చెప్పారు. డెలివరీ చేసి.. పుట్టిన పిల్లాడిని కుటుంబ సభ్యులకు అప్పగించి, ఆమెకు ఐసీయూలో చికిత్స అందించారు. వారం తర్వాత ఆమె చనిపోయింది. మొత్తంగా సుమారు రూ.10 లక్షలకుపైగా బిల్లులు వేశారు. లక్షలు ఖర్చు చేసినా సంధ్య దక్కకపోవడంతో రవి కుప్పకూలిపోయాడు. తల్లిలేని పసికందును ఎలా సాకాలో తెలియడం లేదని రోదిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.
భర్త పోయి.. అప్పులు మిగిలి..
నాగర్‌కర్నూల్ జిల్లా మన్ననూర్‌కు చెందిన రామోజీ (40) చికెన్ సెంటర్ నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. 15 రోజుల క్రితం కరోనా సోకింది. నాలుగు రోజులు హోం క్వారంటైన్‌లో ఉన్నాడు. కానీ ఒక్కసారిగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బంధువులు హైదరాబాద్‌కు తరలించారు. వివిధ ఆస్పత్రులు తిరగగా.. చివరికి బేగంపేటలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో బెడ్ దొరికింది. చికిత్స మొదలుపెట్టిన వైద్యులు రూ.10 లక్షలు కట్టాలన్నారు. అవసరాలకు దాచుకున్న డబ్బుతోపాటు బంధువులు, ఆసాముల వద్ద అప్పు చేసి బిల్లు కట్టారు. కానీ మరుసటి రోజే రామోజీ చనిపోయాడు. కుటుంబాన్ని పోషించాల్సిన వ్యక్తే చనిపోవడం ఓవైపు.. చేసిన అప్పులు మరోవైపు ఆ కుటుంబాన్ని కుంగదీశాయి. ఆయన భార్య, ఇద్దరు పిల్లలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
భార్య, కొడుకు పోయి.. అప్పులు మిగిలి..
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం బూచనెల్లికి చెందిన వహీద్ పండ్లు, ఐస్‌క్రీంలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పదిహేను రోజుల క్రితం భార్య కుర్షీద్‌బీ (60), కుమారుడు ఇస్మాయిల్‌కు కరోనా సోకింది. కర్ణాటకలోని బీదర్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు. దొరికిన దగ్గరల్లా అప్పు చేసి ఆరు లక్షల దాకా బిల్లులు కట్టి, చికిత్స చేయించాడు. అప్పటికీ వారు కోలుకోలేదు. ఈ నెల 9న భార్య, 11న కుమారుడు చనిపోయారు. కోడలు నసీమా, మనవడు సాజిద్ సైతం కరోనా బారినపడి చికిత్స పొందుతున్నారు. వారికోసం రోజుకు రూ.20 వేల దాకా బిల్లులు అవుతున్నాయి. అటు భార్య, కుమారుడి ప్రాణాలు దక్కలేదు. ఇటు కోడలు, మనవడు ఆస్పత్రిలో ఉన్నారు. లక్షలకు లక్షలు అప్పు చేశాడు. ఇప్పుడేం చేయాలో తెలియదంటూ వహీద్ గుండెలవిసేలా రోదిస్తున్నాడు.
ఇంటి పెద్దను కోల్పోయి.. ఇల్లూ మిగలని ఆవేదనలో..
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన వెల్డండి సత్యనారాయణ రిటైర్డ్ ఉపాధ్యాయుడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు. సత్యనారాయణకు ఫస్ట్‌వేవ్‌లో కరోనా సోకింది. మొదట సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేరినా.. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. 14 రోజులు ఐసీయూలో ఉన్నాక కాస్త కోలుకోవడంతో ఇంటికి వెళ్లారు. అప్పటికే రూ.10 లక్షలకుపైగా ఖర్చయింది. ఇంటికెళ్లాక పది రోజులకే శ్వాస సమస్య మొదలైంది. తిరిగి హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. కిడ్నీలు దెబ్బతిని, ఒళ్లంతా నీరు చేరడంతో ఐసీయూలో చేర్చారు. ఫంగస్‌కు చెందిన వ్యాధి వచ్చిందని, ఖరీదైన చికిత్స అవసరమని వైద్యులు చెప్పారు. 45 రోజులు ఐసీయూలో ఉన్నాక సత్యనారాయణ గత ఏడాది అక్టోబర్‌లో మృతి చెందాడు. కరోనా సోకినప్పటి నుంచి చివరిదాకా రూ.50 లక్షల దాకా అప్పులు చేశామని.. అయినా పెద్దదిక్కును కోల్పోయామని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఉన్న ఇల్లు అమ్మినా అప్పుతీరే పరిస్థితి లేదని వాపోతున్నారు.
బిడ్డ పెళ్లికి దాచిన డబ్బులు కరోనాకు..
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం రాయినిపాలానికి చెందిన సామాన్య రైతు యాతం వెంకట్‌రెడ్డి. కొన్నేళ్లుగా కూతురు పెళ్లి కోసం డబ్బులు కూడబెడుతున్నాడు. త్వరలో పెళ్లి చేద్దామనుకున్నాడు. ఈ క్రమంలో ఏప్రిల్ 18న కరోనా బారినపడ్డాడు. తొలుత మిర్యాలగూడలోని ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నా.. పరిస్థితి విషమిస్తుండటంతో హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స కోసం రూ.10.5 లక్షలు ఖర్చయ్యాయి. బిడ్డ పెళ్లి కోసం దాచుకున్న డబ్బులన్నీ కరోనా వైద్యానికే సరిపోయాయి. చేతిలో చిల్లిగవ్వ లేదు. వానాకాలం సాగుకూ డబ్బుల్లేని పరిస్థితి. ఇప్పుడు బిడ్డ పెళ్లి చేసే పరిస్థితి లేదని ఆవేదనలో పడ్డాడు.
కొడుకు చదువెట్లా.. అప్పులు తీర్చేదెట్లా?
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామానికి చెందిన మోతె గోవర్ధన్ (45) ఓ వాహనాల షోరూంలో పనిచేసేవాడు. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు. కూడబెట్టిన కొంత సొమ్ముకు తోడు అప్పులు చేసి ఏడాది కింద బిడ్డ పెళ్లి చేశాడు. కొడుకు చదువుకుంటున్నాడు. ఈ క్రమంలో కొద్దిరోజుల కింద గోవర్ధన్‌కు కరోనా సోకింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. ఏడెనిమిది రోజుల చికిత్స కోసం రూ.5 లక్షల వరకు ఖర్చయింది. కుటుంబ సభ్యులు అందినకాడ అప్పులు చేసి బిల్లు కట్టారు. కానీ గోవర్ధన్ మృతిచెందాడు. ఇటు కుటుంబ పెద్ద చనిపోయి.. అటు అప్పులు మిగిలి ఆ కుటుంబం చితికిపోయింది. కొడుకు చదువు ఎలా, అప్పులు తీర్చేదెలా అని గోవర్ధన్ భార్య హేమలత కన్నీళ్లు పెట్టుకుంటోంది.
రూ.13 లక్షలు ఖర్చయినా ప్రాణం దక్కలేదు
నిర్మల్ జిల్లా భైంసా మండలం పేండ్‌పెల్లికి చెందిన గజ్జారాం బీడీ కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆయనకు భార్య, పన్నెండేళ్ల కుమారుడు ఉన్నారు. కొద్దిరోజుల కింద గజ్జారాం కరోనాబారిన పడటంతో భైంసా ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ పరిస్థితి విషమించడంతో నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గజ్జారాంను ఎలాగైనా బతికించుకోవాలని ఆయన భార్య లావణ్య దొరికిన కాడ అప్పులు చేసి ఆస్పత్రి బిల్లులు కట్టింది. కానీ ఆయన చికిత్స పొందుతూ చనిపోయాడు. కుటుంబాన్ని పోషించే గజ్జారాం చనిపోవడంతో అప్పులు తీర్చే బాధ్యత లావణ్యపై పడింది. అప్పులెలా కట్టాలి, కుమారుడి భవిష్యత్తు ఏమిటి అన్న ఆందోళనతో ఆమె కుంగిపోతోంది.
ఈ కుటుంబానికి దిక్కెవరు?
వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటకు చెందిన న్యాలం సంతోష్ (28) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. రెక్కాడితేగానీ డొక్కాడని పేద కుటుంబం. ఆయనకు భార్య అర్చన, ఆరేళ్ల కుమార్తె తన్విత, మూడేళ్ల కుమారుడు ఆదర్శ్ ఉన్నారు. గత నెల 28న సంతోష్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. హోం ఐసోలేషన్‌లో ఉన్న సంతోష్‌కు.. ఈ నెల 2న శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు మొదలయ్యాయి. వెంటనే వరంగల్‌లోని ఓ ప్రెవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఐదు రోజుల చికిత్స తర్వాత తుదిశ్వాస విడిచాడు. ఆస్పత్రి ఖర్చులు, రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు, మందుల కోసం రూ.5లక్షల దాకా ఖర్చయ్యాయి. సంతోష్ కన్నుమూయడంతో కుటుంబం రోడ్డునపడింది. ఉన్న ఆటో అమ్మేసినా అప్పులు తీరలే. అప్పులెలా కట్టాలి, పిల్లల్ని ఎలా పోషించాలని అర్చన కన్నీళ్లు పెట్టుకుంటోంది.
చితికిపోతున్న కుటుంబాలెన్నో?
- కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాల్వంచకు చెందిన పొన్నాల పర్శరాములు (33)కు గత నెల 19న జ్వరం రావడంతో కరోనా టెస్టు చేయించుకోగా నెగెటివ్ వచ్చింది. మందులు వాడినా జ్వరం తగ్గకపోవడంతో 24న సీటీ స్కాన్ తీయిస్తే.. కరోనా ఇన్ఫెక్షన్ ఉన్నట్టు తేలింది. తొలుత కామారెడ్డిలో, తర్వాత హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స తీసుకుంటూ చనిపోయాడు. రూ.18 లక్షలు ఖర్చుపెట్టినా తమ పర్శరాములు బతకకపోవడంతో తల్లిదండ్రులు, భార్య, ఆరేళ్లలోపు వయసున్న ఇద్దరు చిన్నారులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు.
- జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపులాపూర్‌కు చెందిన కూరాకుల రవికి 15 రోజుల క్రితం కరోనా సోకి.. శ్వాస సమస్యలు తలెత్తాయి. కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుూ కోలుకుంటున్నాడు. ఇప్పటివరకు చికిత్స కోసం రూ.9 లక్షలకు పైగానే ఖర్చయింది. కేవలం రెండెకరాల భూమిలోవ్యవసాయం చేసుకుని బతికే రవిపై ఇంత ఆర్థికభారం పడటంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.
- జగిత్యాల జిల్లా మల్యాలకు చెందిన భోగ గంగాధర్‌కు నెల రోజుల కింద కరోనా సోకి.. ఊపిరితిత్తుల సమస్య వచ్చింది. కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. రూ.13 లక్షలు ఖర్చు చేసినా ప్రాణాలు దక్కలేదని కుటుంబ సభ్యులు ఆవేదనలో పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment