సాక్షి, సిటీబ్యూరో: ఎక్కడిక్కడ పెరిగిపోతున్న కోవిడ్ కేసులు.. ఏ ప్రాంతంలో ఎలాంటి ఆంక్షలు అమల్లోకి వస్తాయో తెలియని స్థితి.. ఏ రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలవుతుందో చెప్పలేని పరిస్థితి.. ఈ పరిణామాల నేపథ్యంలో రాజధానిలోని మూడు కమిషనరేట్లలో నమోదవుతున్న సైబర్ క్రైమ్ కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న ఉత్తరాది నిందితులు తాత్కాలికంగా సేఫ్ జోన్‌లోకి వెళ్లారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కేసుల దర్యాప్తు, నిందితుల అరెస్టు కోసం బయటి ప్రాంతాలకు వెళ్లవద్దని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కేవలం సైబర్ క్రైమ్ అధికారులే కాదు.. టాస్‌్కఫోర్స్, స్పెషల్ ఆపరేషన్ టీమ్ పోలీసులు సైతం ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
- హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో నమోదవుతున్న సైబర్ క్రైమ్ కేసుల్లో మూడు రకాలవే ఎక్కువగా ఉంటాయి. ఓఎల్‌ఎక్స్ ఫ్రాడ్స్, వన్ టైమ్ పాస్‌వర్డ్స్ (ఓటీపీ) క్రైమ్స్‌తో పాటు కాల్ సెంటర్ ఫ్రాడ్స్ అత్యధికంగా నమోదవుతున్నాయి.
- సైబర్ నేరాల్లో బయటి రాష్ట్రాలకు చెందిన వారే నిందితులుగా ఉంటున్నారు. కేవలం వ్యక్తిగత కక్షలు, ప్రేమ వ్యవహారాల నేపథ్యంలో రిజిస్టరయ్యే అతి తక్కువ కేసుల్లో మాత్రమే స్థానికులు నిందితులుగా ఉంటారు.
- ఓఎల్‌ఎక్స్ నేరగాళ్లకు రాజస్థాన్‌లోని మేవాట్ రీజియన్‌లో ఉన్న ఆల్వార్, భరత్‌పూర్... ఓటీపీ ఫ్రాడ్ స్టర్స్‌కు ఝార్ఖండ్‌లోని జామ్‌తార, దేవ్‌ఘర్, గిరిధ్.. కాల్ సెంటర్ల కేంద్రంగా నడిచే ఇతర నేరాలు చేసే వారికి ఢిల్లీ, కోల్‌కతా అడ్డాలుగా మారాయి.
- ఇలాంటి కేసుల్లో సూత్రధారులు చిక్కడం కష్టసాధ్యమైనా కమీషన్ల కోసం తమ బ్యాంకు ఖాతాలు ఇచ్చేవారిని ఎక్కువగా అరెస్టు చేస్తుంటారు. ఇలాంటి వాళ్లు ఈశాన్య రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్, బెంగళూరు, పశి్చమ బెంగాల్‌లో ఉన్న చిత్తరంజన్, అసన్‌సోల్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటున్నారు.
- సైబర్ నేరగాళ్లను పట్టుకోవడానికి మూడు కమిషనరేట్లకు చెందిన సైబర్ క్రైమ్ పోలీసులు ఇతర ప్రాంతాలకు వెళ్తూనే ఉండేవారు. ప్రతి నెలా కనీసం పది పదిహేను రోజులు ఏదో ఒక బృందం అక్కడ గాలింపులు చేపట్టి నిందితుల్ని అరెస్టు చేసుకువచ్చేది.
- ప్రస్తుతం కరోనా కేసుల విజృంభణ, ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఆంక్షలు, లాక్‌డౌన్లు అమలులోకి వస్తాయో తెలియని పరిస్థితులతో దర్యాప్తు, అరెస్టుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లవద్దని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అత్యవసర, కీలక కేసులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.
- రాజధానిలోని మూడు కమిషనరేట్లలో కలిపి ఇప్పటి వరకు దాదాపు 600 మంది వరకు సెకండ్ వేవ్‌లో కరోనా బారినపడ్డారు. ఇప్పటికే ఇద్దరు అధికారులు కన్నుమూశారు. ఇప్పటి వరకు పాజిటివ్ వచి్చన వారిలో వాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారూ ఉన్నారు.
- ఈ పరిణామాల నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులతో పాటు ఇతర ప్రాంతాల్లో నిందితుల్ని అరెస్టు చేసే విషయంలో టాస్‌్కఫోర్స్, స్పెషల్ ఆపరేషన్ టీమ్ అధికారులు ఆచితూచి ముందుకు వెళ్తున్నారు. అరెస్టు చేసిన ప్రతి నిందితుడికీ పీపీఈ కిట్ ధరింపజేయడం తప్పనిసరి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment