సాక్షి, హైదరాబాద్: పోలీస్ స్టేషన్‌లో కస్టోడియల్ మరణం విచారకరమని, ఈ ఘటనపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, సైబరాబాద్ సీపీ, మాదాపూర్ డీసీపీ, గచ్చిబౌలి ఎస్‌హెచ్‌ఓలకు నోటీసులు జారీ చేసింది.
తదుపరి విచారణను ఆగస్టు 17కు వాయిదా వేసింది. గచ్చిబౌలి పోలీస్టేషన్‌లో పోలీసుల అదుపులో ఉన్న భవన నిర్మాణ కార్మికుడు అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. పత్రికల్లో వచ్చిన కస్టోడియల్ మరణం వార్తపై స్పందించి న్యాయవాది రాపోలు భాస్కర్.. న్యాయ విచారణ జరపాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు.
ఈ లేఖను సుమోటో రిట్ పిటిషన్‌గా హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.
ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు
కస్టోడియల్ మరణంపై మహబూబాబాద్‌కు చెందిన న్యాయ విద్యార్థి కరుపోతుల రేవంత్ జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సీ)కు ఫిర్యాదు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ కస్టోడియల్ మరణానికి సంబంధించిన పూర్తి వివరాలను 8 వారాల్లోగా సమర్పించాలని జిల్లా కలెక్టర్, పోలీసులను ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment