అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ఏడాది పాలన
‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది.. అప్పుల లాభం వాళ్లకు... వాయిదాల కష్టం మాకు..
హామీలన్నీ ఒకటొకటిగా నెరవేరుస్తున్నాం
వైఎస్ ప్రారంభించిన ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, వడ్డీ లేని రుణాలు మా పేటెంట్లు
ప్రతిపక్షాలు ఏడాది కూడా ఆగలేకపోతున్నాయి
మా ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలు చేస్తున్నాయి
ఈ ఐదేళ్లే కాదు.. వచ్చే ఐదేళ్లూ మేమే అధికారంలో ఉంటాం
కాంగ్రెస్ పార్టీలో గొడవలు ఉండవు. భిన్నాభిప్రాయాలు మాత్రమే ఉంటాయి. వాటిపై పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటాం. అభిప్రాయ వ్యక్తీకరణ విభేదించడం కిందికి రాదు. రాజకీయ బాంబుల విషయంలో అధికార యంత్రాంగం తమ పని తాము చేసుకుంటూ వెళ్లిపోతుంది. అందులో రాజకీయ దురుద్దేశాలు ఉండవు. ఎప్పుడు ఏం జరగాలో అది జరుగుతుంది.
గత ఏడాది పాలనలో తాము డిస్టింక్షన్‌లో పాస్ అయ్యామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని రెండు కళ్లుగా సమన్వయం చేసుకుంటూ పాలన సాగిస్తున్నామని చెప్పారు. ధనిక రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్ అప్పుల కుప్పగా మార్చిందని.. ఆ అప్పులు తీర్చుకుంటూ, ప్రజలపై భారాన్ని తగ్గించుకుంటూ వ్యవస్థను గాడిలో పెడుతున్నామని పేర్కొన్నారు. ఒకదాని తర్వాత ఒకటిగా ప్రజల కిచ్చిన అన్ని హామీలను నెరవేర్చే దిశలో అడుగులు వేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా భట్టి విక్రమార్క మంగళవారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే...
సాక్షి, హైదరాబాద్: ‘‘గత ప్రభుత్వ హయాంలో ఆదాయంతో పాటు తెచ్చిన అప్పులను కూడా విచ్చలవిడిగా ఖర్చు చేసేందుకే ప్రాధాన్యమిచ్చారు. ఆ అప్పులు కట్టాల్సిన సమయంలో రాష్ట్ర పగ్గాలు మా చేతికి వచ్చాయి. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు అప్పులు తెచ్చుకోగలగడం వల్ల వారికి లాభం కలిగింది. ఇప్పుడు అవన్నీ కట్టాల్సి రావడం మాకు భారంగా మారింది. మేం ఏడాదిలో రూ.52,118 కోట్లు అప్పులు తెచ్చి.. రూ. 64,516 కోట్ల అప్పులు తీర్చాల్సి వచ్చింది.
అయినా అభివృద్ధి, సంక్షేమంలో వెనకబడకుండా జాగ్రత్త పడుతున్నాం. ప్రణాళిక వ్యయం కింద రూ. 24 వేల కోట్లు ఖర్చుపెట్టి అభివృద్ధి చేశాం. అదే సమయంలో రూ. 61,194 కోట్లను వివిధ సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టాం. ప్రతి పైసా అర్థవంతంగా ప్రజలకు చేరాలన్నదే మా తపన.
ఆ మూడూ మా పేటెంట్లు..
వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన వ్యవసాయానికి ఉచిత విద్యుత్ మా పేటెంట్ పథకం. పకడ్బందీగా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం. ఆరోగ్యశ్రీ, మహిళలకు వడ్డీ లేని రుణాల పథకం పేటెంట్లు కూడా కాంగ్రెస్‌వే. వచ్చే ఐదేళ్లలో మహిళలకు రూ.లక్ష కోట్లు రుణాలు ఇవ్వాలన్నది మా లక్ష్యం
అందులో ఈ ఏడాది రూ.20 వేల కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా... ఇప్పటికే రూ.18 వేల కోట్లు రుణాలిచ్చాం. కొత్త రేషన్ కా ర్డులు ఇచ్చే ప్రక్రియ ప్రారంభించాం. తెలంగాణలో ఇల్లు లేని కుటుంబం ఉండకూడదన్నదే కాంగ్రెస్ లక్ష్యం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వబోతున్నాం. రూ.21 వేల కోట్లతో రైతు రుణమాఫీ చేశాం. పింఛన్లు పెంచుతాం. అన్ని హామీలను ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తాం. గత పదేళ్లలో బీఆర్‌ఎస్, బీజేపీ ఏమీ చేయలేకపో యాయి. కానీ మమ్మల్ని మాత్రం ఏడాదిలోనే అన్నీ చేసేయాలంటున్నాయి.
మేం ప్రచారంపై దృష్టి పెట్టలేదు..
మేం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ప్రచారం చేసుకోవడంపై దృష్టి పెట్టలేదు. కానీ బీఆర్‌ఎస్ మాత్రం ప్రచారం మీదనే బతుకుతోంది. మేం రైతు రుణమాఫీ ప్రారంభించినప్పుడు ఏమీ కాలేదన్నారు. అక్కడితో ఆగిపోతామని అనుకున్నారు. కానీ మేం ఆగలేదు. నిజానికి రేషన్‌కార్డులు లేని రైతులకు రుణమాఫీ ఆలస్యం కావడానికి కారణం బీఆర్‌ఎస్ కాదా? గత పదేళ్లలో ఒక్క రేషన్‌కార్డు ఇవ్వలేదు. ప్రజలకు ఏమేం చేయాలన్న దానిపై మా దృష్టి ఉంటే.. వాళ్లు పదేళ్లు ప్రచార పటాటోపంతో నెట్టుకొచ్చారు.
మేం బీఆర్‌ఎస్‌లా కాదు.. చెప్పినవన్నీ చేస్తున్నాం. దుబారా చేయకుండా కస్టోడియన్‌గా ప్రజల సంపదను ఖర్చు పెడతాం. రైతు భరోసా విషయంలో అదే చేస్తాం. ఒకదాని తర్వాత ఇంకోటి అమలు చేస్తూనే ఉంటాం. పాలనపై సంపూర్ణంగా పట్టు వచ్చింది. ఈ ఐదేళ్లే కాదు.. వచ్చే ఐదేళ్లు కూడా అధికారంలో ఉండేది మేమే. ప్రతిపక్షాలు నిరంతరం మా ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర చేస్తున్నాయి. ఎవరెన్ని కుట్రలు చేసినా ఏమీ చేయలేరు.
సంవత్సరం కూడా ఆగలేకపోతున్నారు
గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్ జరగడం దురదృష్టకరం. అయితే పార్టీలు దీనిని రాజకీయంగా ఉపయోగించుకోవడం సరికాదు. అడ్డగోలుగా అనుభవించిన అధికారం దూరంకావడంతో ఏడాది కూడా ఉండలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో గొడవలుండవు. భిన్నాభిప్రాయాలు మాత్రమే ఉంటాయి. వాటిపై పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటాం. అభిప్రాయ వ్యక్తీకరణ విభేదించడం కిందికి రాదు. రాజకీయ బాంబుల విషయంలో అధికార యంత్రాంగం తమ పని తాము చేసుకుంటూ వెళ్లిపోతుంది. అందులో రాజకీయ దురుద్దేశాలు ఉండవు. ఎప్పుడు ఏం జరగాలో అది జరుగుతుంది. విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు.. ఇలా తెలంగాణను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం. ‘రైజింగ్ తెలంగాణ హాస్ టుబీ రైజ్ ఆల్ ద టైం’’ అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
ప్రజలు వాస్తవాలు తెలుసుకున్నారు
మూసీ ప్రక్షాళనపై ప్రతిపక్షాలు మొదటి నుంచీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కానీ ఈ విషయంలో ప్రభుత్వానికి స్పష్టత ఉంది. మూసీ నీటిని శుద్ధి చేయడం, పెట్టుబడుల ద్వారా పరీవాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం, ఆ అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేయడం మా ఉద్దేశం. ఇవన్నీ పూర్తయితే కాంగ్రెస్‌కు మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో... బీఆర్‌ఎస్, బీజేపీ తప్పుడు ప్రచారం చేశాయి. కానీ ప్రజలు వాస్తవాలు తెలుసుకున్నారు. మూసీ ప్రాజెక్టు కావాలంటున్నారు. ఫ్యూచర్ సిటీ, ట్రిపుల్ ఆర్, మూసీ పునరుజ్జీవం, మెట్రో విస్తరణ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలతో హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా ప్రపంచంతో పోటీపడేలా తీర్చిదిద్దుతాం.
త్వరలో కొత్త విద్యుత్ విధానం..
త్వరలో జరిగే శాసనసభ సమావేశాల్లో కొత్త విద్యుత్ పాలసీని ప్రవేశపెట్టి చర్చిస్తాం. 2029–30 నాటికి 20 వేల మెగావాట్లు, 2035–36 నాటికి 40 వేల మెగావాట్ల గ్రీన్‌ఎనర్జీ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ విద్యుత్‌ను రాష్ట్రంలో వినియోగించడంతోపాటు ఇతర రాష్ట్రాలకు విక్రయించేందుకు ఒప్పందాలు చేసుకుంటాం.
పెరిగే సామర్థ్యానికి తగ్గట్టు సరఫరా, పంపిణీ వ్యవస్థలను అభివృద్ధి చేస్తాం. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం.. భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ మదన్ బి లోకూర్ కమిషన్ సమర్పించిన విచారణ నివేదికను అసెంబ్లీలో పెడతాం. గత ప్రభుత్వ హయాంలో శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదానికి బాధ్యులైన డైరెక్టర్లను తొలగించాం. త్వరలోనే విద్యుత్ సంస్థలకు కొత్త డైరెక్టర్లను నియమిస్తాం.
Comments
Please login to add a commentAdd a comment