డిజిలాకర్‌: ఆధార్‌ను ఆన్‌లైన్‌లోనే దాచుకొవచ్చు! | DigiLocker Can Help You Store Documents Electronically, Check Full Details Here | Sakshi
Sakshi News home page

డిజిలాకర్‌కు పెరుగుతున్న ప్రాధాన్యత 

Published Tue, Jun 1 2021 4:07 PM | Last Updated on Tue, Jun 1 2021 4:12 PM

DigiLocker Can Help You Store Documents Electronically, Check Full Details Here - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: ప్రస్తుత కోవిడ్‌ మహమ్మారి పరిస్థితులు ‘డిజిటల్‌ సర్వీసెస్‌’ను ఫోకస్‌లోకి తీసుకొచ్చాయి. ఏడాది కాలంగా చోటుచేసుకున్న పరిణామాలతో గతంలో డిజిటల్‌ టెక్నాలజీలను అంతగా అందిపుచ్చుకోని సంప్రదాయ వ్యాపారసంస్థలు, విద్యాసంస్థలు కూడా ఇప్పుడు ఆన్‌లైన్‌ కార్యకలాపాలకు షిప్ట్‌ అయిపోయాయి. గతంలో ఈ సంస్థల లావాదేవీలు, రోజువారీ విధులు, కార్యక్రమాల్లో ఎక్కువగా డాక్యుమెంట్ల రూపంలో కాగితంతో కూడిన ‘ఫిజికల్‌ డాక్యుమెంట్‌ అథెంటికేషన్‌’కున్న ప్రాధాన్యత నేపథ్యంలో దానికి ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వ ‘డిజిటల్‌ ఇండియా’ప్రణాళికలో భాగంగా ‘డిజిలాకర్‌’ ఇప్పుడు ముఖ్య భూమికను పోషిస్తోంది.

ఎడ్యుకేషన్, బర్త్‌ సర్టిఫికెట్లు, ఐటీ చెల్లింపు పత్రాలు, డ్రైవింగ్‌ లైసెన్స్, ఇతర ముఖ్యపత్రాలను డిజిలాకర్‌లో దాచుకునే సౌలభ్యం ఏర్పడింది. దీనిద్వారా దేశపౌరులు తమ జనన ధ్రువీకరణపత్రాలు మొదలు విద్యార్హతల సర్టిఫికెట్లు, బిజినెస్‌ డాక్యుమెంట్లు, ఆదాయపు పన్ను చెల్లింపు పత్రాలు, డ్రైవింగ్‌ లైసెన్స్, ఆర్‌సీలు ఇలా అనేక రకాల డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌ డిజిటల్‌ ఫార్మాట్‌లో జాగ్రత్తగా దాచుకునే వీలు ఏర్పడింది.

ఈ ఏడాది చివరకల్లా యూజర్ల సంఖ్య 8 కోట్లకు...
2015–16లోనే ప్రారంభమైన ఈ వినూత్న ఆలోచన ద్వారా అన్నిరకాల డాక్యుమెంట్లను ఓ ‘సెంట్రల్‌ రిపోసిటరీ’లో పదిలపరుచుకుని అవసరం పడినపుడు రిజిష్టర్డ్‌ సొంతదారు వాటిని డిజిటల్‌ రూపంలో చూపించుకునే సౌలభ్యం చిక్కింది. దీనిని ప్రారంభించిన నాటి నుంచి ఉపయోగించుకునే వారి సంఖ్య క్రమంగా పెరిగినా గతేడాది జూన్‌–ఆగస్టు మధ్యకాలంలో దేశవ్యాప్తంగా యూజర్స్‌ రిజిస్ట్రేషన్లు 4 కోట్ల లోపు నుంచి నాలుగున్నర కోట్లకు పెరిగాయి. గతేడాది మార్చి–ఏప్రిల్‌ నెలల్లో రోజుకు 20 వేల మంది కొత్తయూజర్లు వచ్చి చేరుతుండగా ఇప్పుడు వారి సంఖ్య లక్షకు చేరుకున్నట్టుగా కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్పర్మేషన్‌ టెక్నాలజీ పరిధిలోని నేషనల్‌ ఈ–గవర్నెన్స్‌ డివిజన్‌ తాజాగా వెల్లడించింది. ఈ ఏడాది చివరకల్లా దీని రిజిష్టర్డ్‌ యూజర్ల సంఖ్య 8 కోట్లకు చేరచ్చునని అంచనా వేస్తున్నారు.

ఏపీఐ కీలకం...
అన్ని రకాల డాక్యుమెంట్లను అప్లికేషన్‌ ప్రోగ్రామింగ్‌ ఇంటర్‌ఫేస్‌ (ఏపీఐ)–లెవల్‌ ఇంటిగ్రేషన్‌ ద్వారా డిజిలాకర్‌ అనుమతిస్తుంది. ఏపీఐ ద్వారా ఒక సాఫ్ట్‌వేర్‌ నుంచి మరొక సాఫ్ట్‌వేర్‌కు డేటాను బదిలీ చేసే వీలు ఏర్పడుతుంది. ప్రభుత్వపరంగా ఓపెన్‌ ఏపీఐ పాలసీ అమల్లో ఉండడంతో డేటా సొంతదారుల నుంచి ప్రభుత్వ ఏజెన్సీల (ఇంటర్‌ అండ్‌ ఇంట్రా గవర్నమెంటల్‌ ఏజెన్సీస్‌) మధ్య సమర్థవంతంగా ‘డేటా షేర్‌’చేసుకోడానికి దోహదపడుతోంది. 

తెలంగాణ విషయానికొస్తే...
రాష్ట్రంలో డిజిలాకర్‌ విధానాన్ని వర్తింపజేస్తూ 2020 నవంబర్‌ 4న ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఉత్తర్వులు జారీచేసింది. పౌరులకు డిజిటల్‌ సాధికారతను అందించడంలో భాగంగా డిజిటల్‌ ఫార్మాట్‌లో సంబంధిత విభాగాల నుంచి డాక్యుమెంట్లు, సర్టిఫికెట్ల యాక్సెస్‌ చేసేందుకు డాక్యుమెంట్‌ వ్యాలెట్‌ ఉపయోగపడుతోంది. పేపర్‌లెస్‌ గవర్నెన్స్‌లో భాగంగా ఆయా విభాగాలు,  రంగాల్లో ఈ సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. అవి...

► వివిధ ప్రభుత్వశాఖలు, పీఎస్‌యూలు, స్వయం ప్రతిపత్తిగల సంస్థలు, యూనివర్సిటీలు, ప్రభుత్వ సంస్థల్లో డిజిలాకర్‌ సిస్టమ్‌ను అడాప్ట్‌ చేసుకున్నాయి.
► శాఖలు లేదా ఏజెన్సీలు డిజిలాకర్‌ ప్లాట్‌ఫామ్‌పై రిజిష్టర్‌ చేసుకోవాలి. వారి సాఫ్ట్‌వేర్‌/సిస్టమ్‌ (వెబ్, మొబైల్‌ అప్లికేషన్లు) ఈ ప్లాట్‌ఫామ్‌లో అనుసంధానించుకోవాలి. ప్రత్యక్షంగా హార్డ్‌కాపీ సర్టిఫికెట్‌/డాక్యుమెంట్‌తో సమానంగా దీనిని పరిగణలోకి తీసుకుంటారు.


డిజిలాకర్‌ ద్వారా ఏయే  డాక్యుమెంట్లు పరిగణనలోకి...
ప్రత్యక్షంగా పేపర్‌తో కూడిన ఆధీకృత డాక్యుమెంట్‌ను చూపడానికి బదులు డిజిలాకర్‌ ద్వారా దాదాపు 492 ముఖ్యమైన డాక్యుమెంట్లను డిజిటల్‌ ఫార్మాట్‌లో పరిగణలోకి తీసుకుంటారు.

ఉదా: ఆధార్, పాన్‌కార్డ్, డ్రైవింగ్‌ లైసెన్స్, వాహనాల ఆర్‌సీలు, క్లాస్‌ 10,12 సర్టిఫికెట్లు, ఇన్సురెన్స్‌పాలసీ డాక్యుమెంట్లు, స్కిల్‌ సర్టిఫికెట్, లీగల్‌ హేర్‌ సర్టిఫికెట్, సీనియర్‌ సిటిజన్‌ సర్టిఫికెట్, ప్రాపర్టీ సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు తదితరాలు...

ఏ విధంగా ప్రయోజనం...
►గతేడాది ఢిల్లీ విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాల సందర్భంగా కరోనా కారణంగా విద్యార్థులు కాలేజీకి వచ్చి మార్కుషీట్లు సమర్పించే పరిస్థితి లేదు. నేషనల్‌ ఈ–గవర్నెన్స్‌ డివిజన్‌ ఏపీఐ–లెవల్‌ వెరిఫికేషన్‌కు అనుమతివ్వడంతో దాదాపు లక్షమంది విద్యార్థులు వ్యక్తిగతంగా వచ్చి సర్టిఫికెట్లను సమర్పించకుండానే అడ్మిషన్లు పొందారు.

► కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్‌ కోసం కర్ణాటక పోలీస్‌ శాఖ అభ్యర్థుల 10,12 తరగతుల సర్టిఫికెట్లను డిజిలాకర్‌ ద్వారా పరిశీలించింది. లక్షలాది మంది దరఖాస్తు చేసుకోవడంతో వాటిని వ్యక్తిగతంగా పరిశీలనకు ఆరునెలలకు పైగా సమయం పట్టి ఉండేది. దీంతో రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ 7,8 నెలలు ఆలస్యం కాకుం డా డిజిటల్‌ వెరిఫికేషన్‌ దోహదపడింది.

► డిజిలాకర్‌ ద్వారా డిజిటల్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలను జారీచేయాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో అన్ని బీమా కంపెనీలకు ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా సూచించింది.

► నేషనల్‌ అకడెమిక్‌ డిపొసిటరీ (ఎన్‌ఏడీ)డిజిలాకర్‌ను ఏకైక రిపొసిటరీగా చేసుకుంది.
► నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌ కూడా డిజిలాకర్‌ను ఉపయోగిస్తోంది.


డిజిలాకర్‌ నమోదు ఎలా ?
డిజిలాకర్‌ యాప్‌ను మొబైల్‌ (యాపిల్, ఆండ్రాయిడ్‌) ఫోన్లలో ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. https://digilocker.gov.in/ లేదా https://accounts.digitallocker.gov.in/వెబ్‌సైట్‌ల ద్వారా నమోదు చేసుకోవచ్చు.

కావాల్సినవి...
►పేరు, పుట్టినతేదీ, మొబైల్‌ ఫోన్, ఆధార్‌ నంబర్‌
►మొబైల్‌ ఫోన్‌ను ఆధార్‌ నంబర్‌ను అథెంటికేట్‌ చేస్తూ వన్‌టైమ్‌పాస్‌ వర్డ్‌ వస్తుంది.
►ఆ తర్వాత ఆథెంటికేషన్‌ కోసం సెక్యూరిటీ పిన్‌ను సెట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. 

రాష్ట్రంలో 80 లక్షల దాకా డిజి యూజర్స్‌...
‘ఎక్కువగా మీ–సేవా ద్వారా సర్టిఫికెట్ల జారీ, ఇతర కార్యకలాపాలు    సాగుతున్నాయి. వివిధ శాఖలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఇంటిగ్రేట్‌ చేస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో 80 లక్షల దాకా డిజిలాకర్‌ రిజిష్టర్‌ యూజర్స్‌ ఉన్నారు. ప్రజలు ఈ సదుపాయాన్ని మరింత ఉపయోగించుకునేందుకు ముందుకు రావాలి. తమ మొబైల్, ఆధార్‌ నంబర్లతో అనుసంధానం చేసుకోవాలి. తదనుగుణంగా డిజిలాకర్స్‌ క్రియేట్‌ అవుతూ ఉంటాయి. విద్యార్థుల సర్టిఫికెట్లకు సంబంధించి యూనివర్సిటీలు, వాహన లైసెన్స్‌లు, ఆర్‌సీలు తదితర డాక్యుమెంట్ల కోసం రవాణాశాఖ తదితరాలు మరింతగా భాగస్వామ్యమైతే ఈ సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి. ఈ విషయమై వర్సిటీలకు లెటర్స్‌ పంపించాం.    
–శ్రీనివాస్‌ పెండ్యాల, రాష్ట్ర నోడల్‌ ఆఫీసర్, ఐటీ శాఖ జాయింట్‌ సెక్రటరీ

కోవిడ్‌తో కొంత మేర అంతరాయం...
రాష్ట్రంలో ఇప్పటికే మీ–సేవా కేంద్రాల ద్వారా ఆదాయ ధ్రువీకరణపత్రాలు, ఇతర డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ అవుతున్నాయి. డిజిలాకర్‌లో ఇవి అందుబాటులోకి వచ్చాయి. పీడీఎస్, రేషన్‌కార్డులు కూడా చేయబోతున్నారు. విద్యార్థుల సర్టిఫికెట్లను అప్‌లోడ్‌ చేయడం ద్వారా డిజిలాకర్‌ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని యూనివర్సిటీలకు కూడా రాశాం. అయితే కోవిడ్‌ పరిస్థితుల కారణంగా కొంత అంతరాయం ఏర్పడుతోంది. విద్యాశాఖ కూడా ఈ దిశలో చర్యలు చేపడుతోంది. తద్వారా ఎంసెట్, ఇతర కోర్సుల్లో కౌన్సెలింగ్‌ అపుడు సులభమౌతుంది. రవాణాశాఖకు సంబంధించి ‘ఎం వ్యాలెట్‌’ను డిజిలాకర్‌తో అనుసంధానించాల్సి ఉంది. ఇది ప్రభుత్వం వెరిఫై చేయాల్సిన పత్రాలకు సంబంధించినది అయినందున, హార్డ్‌కాపీలు వెంట తీసుకోవాల్సిన అవసరం లేకుండా, ఇంటర్వ్యూలకు అటెండ్‌ అయ్యే విద్యార్థులకు ఉపయోగపడుతున్నాయి. వివిధ కార్యకలాపాల నిమిత్తం లబ్ధిదారులు లేదా అభ్యర్థుల నుంచి డాక్యుమెంట్లు కోరుతున్న వివిధ ప్రభుత్వ శాఖలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సి ఉంది. డిజిలాకర్‌ సౌకర్యాన్ని వినియోగించుకునేలా పౌరుల్లో మరింత అవగాహన, ప్రచారం కల్పించాల్సి ఉంది. ఈ విధానంలో పూర్తి భద్రత ఉంది.
– గునవలన్, రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నేషనల్‌ ఈ–గవర్నెన్స్‌ ప్రతినిధి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement