సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఇందూరు జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయనున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. సుగంధ ద్రవ్యాల బోర్డు కింద ఉన్న పసుపు పంటను విడదీసి, ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటుకు కేంద్రం నిర్ణయించడం, ఇది దేశంలోనే తొలిసారి కావడం విశేషం. దీనిపై నిజామాబాద్ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మంగళవారం మోదీ పాల్గొనే జనగర్జన సభను రైతులు కృతజ్ఞత సభగా మార్చారు.
బోర్డు విధివిధానాలు ప్రకటించనున్న ప్రధాని
కేంద్ర ప్రభుత్వ ఆ«దీనంలోని వాణిజ్య, వ్యవసాయ, ఉద్యాన శాఖల కార్యదర్శులు, ఆర్థిక శాఖ సలహాదారు సంయుక్త ఆధ్వర్యంలో నడుస్తున్న సుగంధ ద్రవ్యాల బోర్డు చైర్మన్ పరిధిలో పసుపు బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. పసుపు బోర్డుకు ప్రత్యేకంగా సీఈవోని నియమించనున్నారు. మరో 11 మందిని పసుపుబోర్డుకు సభ్యులుగా నియమించనున్నారు. ప్రత్యేకంగా అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను ఇందూరు సభలో ప్రధానమంత్రి ప్రకటించనున్నారు.
విత్తనం నుంచి మార్కెటింగ్ వరకు..
పసుపు బోర్డు ఏర్పాటైతే రైతులకు కొత్త వంగడాల అభివృద్ధి నుంచి పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్ వరకు లబ్ధి కలుగుతుంది. రైతులకు పసుపు తవ్వకం, ఆరబెట్టడం, ఉడకబెట్టడం, డ్రై చేయడం, పాలిష్ చేయడానికి అవసరమైన యంత్రాలను రాయితీపై అందిస్తారు. కొత్త వంగడాల అభివృద్ధితో పాటు పసుపు పంట విత్తిన తరువాత అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారు. తద్వారా కర్క్యుమిన్ శాతం, నాణ్యత, దిగుబడి పెంచేలా రైతులకు సహకారం అందుతుంది.
ఇక పసుపు పంట మార్కెటింగ్ కోసం అంతర్జాతీయ కంపెనీలను తీసుకువచ్చే బాధ్యత సైతం బోర్డు తీసుకుంటుంది. ఈ క్రమంలో జిల్లాకు పసుపు శుద్ధి కర్మాగారాలు తరలివస్తాయని ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం తదుపరి దశలో ఇక్కడ పసుపు శుద్ధికర్మాగారం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
నిజామాబాద్ మార్కెట్‌కు 7.49 లక్షల క్వింటాళ్లు
తెలంగాణ వ్యాప్తంగా గత సీజన్‌లో సుమారు 8.80 లక్షల క్వింటాళ్ల పసుపు దిగుబడి వచ్చింది. ఇందులో అత్యధికంగా నిజామాబాద్ మార్కెట్‌కు 7.49 లక్షల క్వింటాళ్లు వచ్చింది. రాష్ట్రంలో మొత్తం పసుపు సాగులో 40% ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే కావడం గమనార్హం.
తరువాతి స్థానాల్లో జగిత్యాల, నిర్మల్, వికారాబాద్, మహబూబాబాద్ జిల్లాలు ఉన్నాయి. 2020లో ఎంపీ అర్వింద్ చొరవతో నిజామాబాద్‌లో ‘సుగంధ ద్రవ్యాల బోర్డు’రీజినల్ ఆఫీస్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి రూ.30 కోట్ల బడ్జెట్ కేటాయించారు. తరువాత కర్క్యుమిన్ అధారిత పసుపు మార్కెటింగ్ కోసం దేశంలోనే మొదటిసారిగా నిజామాబాద్ మార్కెట్‌లో 2021లో నాంది పలికారు.
పసుపు బోర్డు వచ్చింది.. కాలికి చెప్పులొచ్చాయ్..
నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి చెందిన రైతు ముత్యాల మనోహర్‌రెడ్డి పన్నెండేళ్లుగా పసుపు ఉద్యమంలో పాల్గొంటున్నారు. స్థానికంగా పసుపు బోర్డు ఏర్పాటయ్యే వరకు చెప్పులు వేసుకోబోనని ప్రతినబూనిన ఆయన 2011 నవంబర్ 4 నుంచి చెప్పులు వేసుకోవడం లేదు.
2013లో పసుపు బోర్డు కోసం డిమాండ్ చేస్తూ కాలికి చెప్పుల్లేకుండానే తిరుపతికి పాదయాత్ర చేశారు. పసుపు బోర్డు సాధన పోరాటంలో భాగంగా ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద అనేక సార్లు రైతులతో కలిసి ఆందోళనల్లో పాల్గొన్నారు. తాజాగా ప్రధాని మోదీ పసుపు బోర్డు ఏర్పాటు విషయాన్ని ప్రకటించడంతో మనోహర్‌రెడ్డి ఆదివారం చెప్పులు వేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు పసుపు రైతులు ఆయనను ఘనంగా సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment