ఆదివారం తెల్లవారుజామున ఎల్బీనగర్ ప్రాంతంలో దట్టంగా అలుముకున్న పొగమంచు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌ను పొగమంచు కప్పేసింది. ఆదివారం తెల్లవారుజామున 5 నుంచి ఉదయం 9 గంటల వరకు పలు ప్రాంతాల్లో పొగమంచు కప్పేసింది. మరోవైపుసాయంత్రం అయిదు గంటలకే కారుచీకట్లు అలుముకునేలా సర్పిలాకారంలో (స్పైరల్) కమ్మేసిన కారుమబ్బులు.. మరోవైపు వాహనాల నుంచి వెలువడుతున్న దట్టమైన పొగ.. వెరసీ.. సిటీజన్ల ముక్కుపుటాలు, శ్వాసకోశాలు ఊపిరి తీసుకోలేక ఉక్కిరిబిక్కిరవుతున్నాయి.
భూ వాతావరణానికి తక్కువ ఎత్తులో.. కేవలం 0.9 కి. మీ ఎత్తులోనే దట్టమైన క్యుములో నింబస్‌మేఘాలు ఏర్పడడం వీటి నుంచి నింబోస్ట్రేటస్, అల్టోస్ట్రేటస్ అనే వాయువులు వెలువడడంతోనే ఈ దుస్థితి తలెత్తింది. అస్తమా, సైనస్, బ్రాంకైటిస్ సమస్యలున్నవారు ఊపి రాడక విలవిల్లాడుతున్నారు. వాతావరణంలో ఒక్కసారిగా అనూహ్య మార్పులు చోటుచేసుకున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
చదవండి: ‘గుడ్’మార్నింగ్.. పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు
కాలుష్యం.. కారుమబ్బులు..
► నగరంలో పీల్చే గాలిలో వాయు కాలుష్యం తీవ్రమవడంతో ఆయా కారకాలు దట్టమైన మేఘాల కారణంగా భూ ఉపరితల వాతావరణంలో పైకి వెళ్లలేక భూవాతావరణాన్ని ఆవహిస్తున్నాయి. మరోవైపు అనూహ్యంగా పడిపోతున్న కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతల కారణంగా.. సిటీజన్లు న్యుమోనియా, అస్తమా, ఓమిక్రాన్ తదితర తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులతో విలవిల్లాడుతున్నారు.
► క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ వ్యాధి సీఓపీ (శ్వాస ఆడక బాగా ఇబ్బంది పడడం)తో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతుండడం గమనార్హం.ì గత మూడు రోజులుగా ఇదే దుస్థితి నెలకొంది. కాలుష్యం విషయానికి వస్తే..సిటీలో పలు కూడళ్లలో వాయు కాలుష్యం అవధులు దాటుతోంది.
చదవండి: HYD: మందుతాగి పోలీసులకు దొరికితే.. ఇక ఆఫీస్‌లో మీ పని అంతే!
►గ్రేటర్ పరిధిలో సుమారు 55 లక్షలకు పైగా ఉన్న వాహనాలు వెదజల్లుతున్న పొగ, ట్రాఫిక్ రద్దీలో రహదారులపై రేగుతున్న దుమ్ముతో సిటీజన్ల ముక్కుపుటాలు, శ్వాసకోశాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఘనపు మీటరు గాలిలో ధూళికణాలు (పీఎం10) మోతాదు 60 మైక్రోగ్రాములకు మించరాదు. పలు కూడళ్లలో సుమారు 90–100 మైక్రోగ్రాముల ధూళి కాలుష్యం వెలువడుతోందని కాలుష్య నియంత్రణ మండలి తాజా అధ్యయనంలో తేలింది.
► ప్రధానంగా బాలానగర్, ఉప్పల్, జూబ్లీహిల్స్, చార్మినార్, ప్యారడైజ్, జూపార్క్, పంజాగుట్ట, కూకట్‌పల్లి, చిక్కడపల్లి, ఎంజీబీఎస్ ప్రాంతాల్లో వాయుకాలుష్యం శ్రుతిమించుతున్నట్లు తేలింది. అంతేకాదు ఆయా కూడళ్లలో ఏడాదికి సగం రోజులు అంటే 183 రోజులపాటు కాలుష్య మేఘాలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
తస్మాత్ జాగ్రత్త...
ఉష్ణోగ్రతలు పడిపోతుండడం, పొగమంచు కారణంగా వృద్ధులు, రోగులు, చిన్నారులు, శ్వాసకోశ సమస్యలున్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప తెల్లవారుజామున బయటకు రావద్దని స్పష్టం చేస్తున్నారు. చలినుంచి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం, మాస్క్ ధరించడం తప్పనిసరని
సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment