సాక్షి, హైదరాబాద్: రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో మహిళలు, చిన్నారులపై వేధింపులు పెరుగుతున్నాయి. స్కూలు, కాలేజీ, హాస్టల్, ఆఫీసు ఎక్కడపడితే అక్కడ ఆకతాయిలు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. సామాజిక మాధ్యమాలలో వేధింపులూ ఆగడం లేదు. దీంతో రాచకొండ షీ టీమ్స్ ఒక అడుగు ముందుకేసింది.
సున్నితమైన కేసులలో బాధితుల ఇంటికే వెళ్లి భరోసా ఇచ్చి, వారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపుతున్నారు. బాధితులు పోలీసు స్టేషన్‌కు రాకుండానే ఫిర్యాదులు తీసుకుని కేసులు నమోదు చేస్తున్నారు. ప్రతి ఫిర్యాదుపై క్షుణ్నంగా దర్యాప్తు చేసి ప్రాథమిక ఆధారాలను సేకరించి, నిందితులను జైలుకు పంపిస్తున్నారు.
3,273 కేసుల నమోదు..
రాచకొండ షీ టీమ్స్‌లో 7 బృందాలు, ఒక్కో బృందంలో ఐదుగురు పోలీసులు మొత్తం 35 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 292 కేసులు నమోదయ్యాయి. వీటిలో 123 ఎఫ్‌ఐఆర్ నమోదు కాగా, 118 పెట్టీ, 51 కౌన్సిలింగ్ కేసులున్నాయి. ఆయా కేసులలో 310 మంది పోకిరీలను అరెస్టు చేశారు. వీరిలో 110 మంది మైనర్లు, 200 మంది మేజర్లున్నారు. అధికార హోదా, అంగబలం, రాజకీయ అండదండల ప్రలోభాలతో మహిళలు, విద్యారి్థనిలు, చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడినా, అసభ్యకరంగా ప్రవర్తించే ఎవరినైనా వదిలిపెట్టడం లేదు.
ఉదయం 4 నుంచే డెకాయ్ ఆపరేషన్
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాలలో ఉదయం, రాత్రి సమయాలలో సినిమాలు, సీరియళ్ల చిత్రీకరణ జరుగుతుంటాయి. షూటింగ్స్ ముగించుకొని రాత్రి సమయాలలో ఇంటికి వెళుతున్న కళాకారులు, కాస్టింగ్ సిబ్బందిని స్థానికంగా పోకిరీలు వేధిస్తున్నట్లు రాచకొండ షీ టీమ్స్ దృష్టికి వచి్చంది.
దీంతో ప్రత్యేక బృందాలతో ప్రతి రోజు ఉదయం 4 గంటల నుంచే షీ టీమ్స్ డెకాయ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. కళాకారుల లాగే పోలీసులూ మఫ్టీలో తిరుగుతూ.. ఆకతాయిల ఆటకట్టిస్తున్నారు. దీంతో పెద్ద అంబర్‌పేట, అబ్దుల్లాపూర్, హయత్‌నగర్, వనస్థలిపురం వంటి మార్గాలలో పోకిరీల చేష్టలు తగ్గుముఖం పట్టాయి.
– ఎస్‌కే సలీమా, రాచకొండ షీ టీమ్స్ డీసీపీ
(చదవండి: చట్టానికి దొరక్కుండా ఆన్‌లైన్ గేమింగ్)
Comments
Please login to add a commentAdd a comment